వెంకటేశ్ టు అల్లు అర్జున్.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ కొందరు స్టార్స్‌ని మిస్సయింది. వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఈ హీరోలు నటించిన చిత్రాలు 2023లో రిలీజ్ కాలేదు. ఈ స్టార్స్ వెండితెరపై కనిపించకపోవడం వారి అభిమానులను కాస్త నిరుత్సాహ పరిచే విషయం. మరి.. 2024లో ఈ స్టార్స్ ఏ చిత్రాలతో వెండితెరపై కనబడతారో తెలుసుకుందాం.
‘సైంధవ్’ రావాలి కానీ...
‘సైంధవ్’ రిలీజ్ ప్లాన్ మారడంతో ఈ ఏడాది తెలుగు తెరపై వెంకటేశ్ కనిపించే అవకాశం లేదు. వెంకటేశ్ కెరీర్లో రూపొందుతున్న 75వ సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని డిసెంబరు 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే తేదీకి ప్రభాస్ ‘సలార్: సీజ్ ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘సైంధవ్’ రిలీజ్ జనవరి 13కు వాయిదా పడింది.
ఇలా ఊహించని విధంగా వెంకటేశ్ ఈ ఏడాది తెలుగు తెరకు దూరంగా కావాల్సిన పరిస్థితి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్ట్ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలో, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతో హిందీ తెరపై వెంకీ కనిపించడం ఈ స్టార్ ఫ్యాన్స్‌ను కాస్త ఆనందపరిచే విషయం.
నా సామి రంగ.. వచ్చే ఏడాదే
గత రెండేళ్లలో మూడు సినిమాలతో (2021లో ‘వైల్డ్ డాగ్’, 2022లో ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన నాగార్జున ఈ ఏడాది మాత్రం గ్యాప్ ఇచ్చారు. నాగార్జున తాజా చిత్రం ‘నా సామి రంగ’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. సో.. ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై కనిపించరు. వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ‘నా సామి రంగ’ రూపంలో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
వేసవి నుంచి సంక్రాంతికి..
‘సర్కారువారి పాట’తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు మహేశ్‌బాబు. అన్నీ సజావుగా సాగినట్లయితే ఈ ఏడాది కూడా వెండితెరపై మహేశ్‌బాబు సందడి ఉండేది. మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ను ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 12కి వాయిదా వేశారు. ఇలా మహేశ్ ఈ ఏడాది థియేటర్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
2024 నుంచి నో గ్యాప్
2018లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది ‘ఆర్ఆర్ఆర్’ (2022) సినిమాలోనే. ఆ సినిమా కమిట్మెంట్ కారణంగా 2019, 2020, 2021లో ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక 2023 నుంచి అయినా ఎన్టీఆర్ సినిమాలు వరుసగా విడుదలవుతాయనుకున్న ఆయన ఫ్యాన్స్ మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి.
ఎందుకంటే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో.. ఈ ఏడాది ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనపడరు. ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో), ‘దేవర’ రెండు భాగాలు, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ.. ఇలా వరుస సినిమాలతో ఈ స్టార్ 2024 నుంచి గ్యాప్ లేకుండా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది.
లేట్‌గా డ్యూటీ
ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసినా వీలుపడలేదు. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి శంకర్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో కియారా అద్వానీ నాయిక. మరోవైపు ఈ ఏడాదే విడుదలైన సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లోని ఓ పాటలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇది చరణ్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది.
రెండేళ్ల తర్వాతే పుష్ప రూల్
‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా మలి భాగం 2023లో విడుదల కాలేదు. క్యాస్టింగ్, కథ విషయాల్లో ఈ సినిమా స్పాన్ మరింత పెరగడం, చిత్రీకరణ వాయిదా పడుతుండటంతో 2024 ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది.
సో.. ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ థియేటర్స్‌లో కనిపించరు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రధారులు.ఇలా మరికొందరు స్టార్స్‌ని 2023 సిల్వర్ స్క్రీన్ మిస్సయ్యింది.