Actor Krishna Death
-
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయడానికి కారణమిదే!
సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్‌ను శోకసంద్రంలోకి నెట్టివేసింది. వెండితెరపై 350కు పైగా సినిమాల్లో వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్నారు. గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన ఆ నటశేఖరుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిన్న(బుధవారం) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. కృష్ణ కుమారుడు మహేశ్ బాబు ఆయనకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే దిగ్గజ నటుడికి సొంతంగా వారి ప్రైవేట్ స్థలంలో కాకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడంపై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించారు. ఇలా చేయడానికి ఓ కారణం ఉందని.. కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు నిర్వహించామని, రమేష్ బాబు అంత్యక్రియలు కూడా అక్కడే చేసినట్లు తెలిపారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం!
సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు ఇందుకోసం కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మెమోరియల్‌ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: కీలక ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ -
కృష్ణ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న ఆ హీరోని ఆదుకున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ సాహసాల హీరో మాత్రమే కాదు.. మంచి మనుసున్న వ్యక్తి కూడా. కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అలా ఆయన నుంచి సహాయాన్ని పొందినవారిలో సీనియర్ హీరో హరనాథ్ కూడా ఉన్నారు. కృష్ణకంటే ముందుగానే హరనాథ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అందగాడుగా మంచి మార్కులు కొట్టేసిన హరనాథ్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఒకానోక సమయంలో హరనాథ్ మద్యానికి బానిస అయ్యాడట. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో అవకాశాలు తగ్గాయట. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ దీంతో హరనాథ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఇక దిక్కతోచని స్థితిలో హరనాథ్ కృష్ణను కలుసుకోవడానికి పద్మాలయ స్టుడియోస్కి వెళ్లారట. ఆయన వచ్చిన విషయాన్ని సిబ్బంది కృష్ణ దగ్గరికి వెళ్లి చెప్పగానే ఆయనే స్వయంగా కిందికి వెళ్లి హారనాథ్ను లోపలికి తీసుకువెళ్లి మాట్లాడారట. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న కృష్ణ ఇంటికి తీసుకుని వెళ్లి అతిథి మర్యాదలు చేశారట. అంతేకాదు కొన్ని రోజులు ఆయనను ఇంట్లోనే ఉంచుకున్నారట. ఈ క్రమంలో ఆయనకు ధైర్యం చెప్పి.. పెద్ద మొత్తంలో డబ్బును ఆయన చేతిలో పెట్టారట కృష్ణ. అలా తన కోస్టార్‌ను కష్టాల్లో ఆదుకుని ఆయన మంచి మనసు చాటుకున్నారు. అయితే ఈ విషయాన్ని కృష్ణ ఎప్పుడూ ఎక్కడా చెప్పకపోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. -
ఆయన చనిపోయారన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం
-
కృష్ణ లేని లోటు ఎవరు పూడ్చలేనిది, ఆయన మళ్లీ పుట్టాలి: ఫ్యాన్స్ ఆవేదన
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకి తరలించారు. నానక్‌రామ్ గూడలోని ఆయన నివాసం నుంచి పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచి ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తమ అభిమాన నటుడి కడచూపు కోసం పద్మాలయ స్టూడియోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు రావడంతో పద్మాలయ స్టూడియో ముందు అభిమానుల తాకిడి ఎక్కువైంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అభిమానులు అయనను కడసారి చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాలు, పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తు చేస్తూ సూపర్‌స్టార్ ఘననివాళులు అర్పిస్తున్నారు. ‘‘ఆయన ఓ హీరో మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన చనిపోయారన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం. మా ఇంట్లో మనిషి మరణించిన దానికంటే ఎక్కువగ బాధగా ఉంది. ఆయన కడచూపు కోసం వచ్చిన ఈ అభిమానుల సంద్రోహమే ఆయన మంచితనానికి నిదర్శనం. ఆయన ఓ లెజెండరి నటులు. సినిమాల్లో తన పాత్రలతో ఎన్నో వేరియేషన్స్ చూపించారు. ఆయన లేని లోటు ఇండస్ట్రీలో ఎవరు పూడ్చలేరు. ఆయన మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నాం’ అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చబొట్టుతో అభిమానం ఇక సిద్దిపేటకు చెందిన ఓ అభిమాని ఏకంగా కృష్ణపేరును చేతిపై పచ్చబొట్టు వేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అంటూ చేతిపై పచ్చబొట్టు వేసుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. కృష్ణగారు చనిపోయారని తెలిసి అన్నం కూడా తినలేదు అంటూ సదరు అభిమాని కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌ను ఆపకుండ చెబుతూ తన అభిమాన నటుడికి నివాళి అర్పించాడు. అచ్చం కృష్ణలా మారి.. ఇక ఓ అభిమాని అచ్చం కృష్ణలా తయరై వచ్చాడు. ఊహా తెలిసినప్పటి నుంచి కృష్ణగారు అంటే అభిమానం, ఆ అభిమానంతోనే ఇక్కడి వచ్చాను. యమదొంగ, నెంబర్ వన్, అల్లూరి సీతారామరాజు. ఆయన సినిమాలన్నా, ఆయన డైలాగ్స్ అంటే గూస్బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా అల్లూరి సీతారామారాజు మూవీలోని డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. -
డబ్బులిచ్చి మరీ సినిమాలు రిలీజ్ చేశాడు..కృష్ణని కోల్పోవడం దురదృష్టకరం: అల్లు అరవింద్
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్కి చేరుకున్న ఆయన .. కృష్ణకు పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ నిర్మాత హీరో అని కొనియాడాడు. ‘నేను సినిమాలు తీయడానికి వచ్చినప్పటి నుంచి ఆయనను(కృష్ణ) గమనిస్తున్నాను. ఆయన చనిపోయాడనే వార్త వినగానే.. ఆయన చేసిన గొప్ప విషయం గుర్తుకు వచ్చింది. ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకముందే సినిమాలు విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అప్పుడు కృష్ణ వాళ్లని పిలిచి ‘మీరేదో కష్టాల్లో ఉన్నారట కదా.. నన్ను ఏమైనా సాయం చెయ్యమంటారా?’అని అడిగి డబ్బులు ఇచ్చి మరీ సినిమాలు విడుదల చేశారు. ఆ నిర్మాతలు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వారి పేర్లు ప్రస్తావించదలచుకోలేదు. నిర్మాతల బాగోగులు కోరుకునే గొప్ప వ్యక్తి ఇప్పుడు మనకు లేడు. అది మన దురదృష్టం. ఆయన నివాళికి కుటుంబు సభ్యులు, సినీ ప్రముఖులతో పాటు లక్షల మంది అభిమానులు రావడం నిజంగా విచిత్రం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’అని అల్లు అరవింద్ అన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ.. వెండితెరపై ఆయన పేరు చేరగని ముద్ర. సాహసాలకు, సంచనాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిలోనే పాత్రలతో ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి జేమ్స్‌బాండ్ తరహాలో గుఢాచారి 116 సినిమాతో అద్భుతం చేశాడు. ఇక తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాలో రికార్డులు క్రియేట్ చేశారు. హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఆయన కథ తెలుగు వెండితెరపై ఓ చరిత్రగా నిలిచింది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ ఓ హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న చాటుకున్న నటుడు. కష్టకాలంలో నిర్మాతలను ఆదుకున్న గొప్ప హీరో. అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు. స్టార్ హీరోగా, మంచి మనసు చాటుకున్న వ్యక్తిగా సూపర్ స్టార్ సువర్ణాక్షరాలతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా. అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన ఓ పాత న్యూస్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు ‘‘నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’’ అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానికి జోహార్లు చేస్తున్నారు. కాగా గుండెపోటు కారణంగా కృష్ణ మంగళవారం(నవంబర్ 15) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన అంతిమ యాత్ర మహప్రస్థానం వరకు సాగనుంది. -
Super Star Krishna: వైజాగ్ అందుకే ఆయనకు ప్రత్యేకం..
సాహసానికి ఊపిరి ఆగిపోయింది. తూటాల్లా డైలాగ్స్ పేల్చిన కంఠం మూగబోయింది. నింగిలోకి మరో ధ్రువతార చేరింది. సినీ ప్రయోగశాల.. తెలుగు సినీ పరిశ్రమస్థాయిని ఆకాశం అంత ఎత్తున నిలబెట్టిన మహర్షి సూపర్‌స్టార్ కృష్ణ.. ఉమ్మడి విశాఖ జిల్లాతో ఎన్నో జ్ఞాపకాలను పెనవేసుకున్నారు. ఆయన సినీ జీవితంలో 350కు పైగా సినిమాలు చేసినా.. అందులో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు చింతపల్లి ప్రాంతంలో చిత్రీకరించారు. విశాఖ– భీమిలి బీచ్‌రోడ్డు, యారాడ బీచ్‌లో చాలా సినిమాలు షూటింగ్‌లు జరుపుకున్నాయి. మనిషిగా బతకడం అంటే.. మన చుట్టూ ఉన్న నలుగురిని బతికించడం అని నమ్మిన సూపర్‌స్టార్‌కు ఉమ్మడి జిల్లాలో చాలా అభిమాన సంఘాలున్నాయి. సాహసమే ఊపిరిగా.. సాయమే శ్వాసగా సాగిన ఆయన జీవన ప్రయాణం.. ఎందరికో ఆదర్శప్రాయం.. జోహర్ ఘట్టమనేని శివరామకృష్ణ. విశాఖపట్నం: సూపర్‌స్టార్ కృష్ణకు విశాఖ సాగరతీరంతో ఎక్కువ అనుబంధం ఉంది. వాస్తవానికి ఆయన సినిమాలు ఎక్కువ శాతం చెన్నై, బెంగుళూర్ తదితర ప్రాంతాల్లోనే చిత్రీకరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా తీయాలి అంటే విశాఖ వైపే మక్కువ చూపేవారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సూపర్‌స్టార్ కృష్ణ జ్ఞాపకాలు తీరంలో పదిలంగా ఉన్నాయి. 1961–62 ప్రాంతంలో భీమిలిలో కులగోత్రాలు సినిమాలో షూటింగ్ జరిగింది. కృష్ణకు నటుడిగా ఇది రెండవ సినిమా. ఇందులో ఆయన చిన్న పాత్రలో నటించారు. 1975లో ప్రకారావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన చీకటి వెలుగులులో ఓ సన్నివేశాన్ని ఇప్పటి పార్క్ హోటల్ సమీపంలో చిత్రీకరించారు. 1983లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో అడివి సింహాలు సినిమా షూటింగ్ రుషికొండ, రామకృష్ణ బీచ్‌లో జరిగింది. 1984లో విజయనిర్మల దర్శకత్వంలో రక్త సంబంధం సినిమాలో ఓ సన్నివేశాన్ని యారాడ కొండపై చిత్రీకరించారు. 1993లో పచ్చని సంసారం చిత్రం అర్ధశత దినోత్సవం విశాఖలో జరిగింది. 100వ సినిమా అల్లూరి సీతారామరాజు మన్యంలో నిర్మించగా, 1995లో కృష్ణ నటించిన 300వ సినిమా తెలుగువీర లేవరా సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ ఎర్రమట్టి దిబ్బల్లో చిత్రీకరించారు. బీచ్‌రోడ్‌లో ఎన్కౌంటర్, యారాడ కొండపై కృష్ణ, మహేష్ నటించిన వంశీ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లను షూట్ చేశారు. ఎస్ నేనంటే నేను సినిమా రుషికొండ, ఆర్.కె.బీచ్ తదితర ప్రాంతాలు, జగదాంబ సెంటర్లో చిత్రీకరణ జరుపుకుంది. విశాఖలో రాజేశ్వరి థియేటర్లో కంచుకాగడా సినిమా విడుదల సమయంలో మూడు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. విశా ఖతో ఉన్న అనుబంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలనే ఆకాంక్షతో.. పద్మాలయ ఫిల్మ్ స్టూడియో ను విశాఖలో నిర్మించాలని ఉందని పలుమార్లు కృష్ణ మీడియాకు చెప్పారు. నటశేఖరుడికి కళాప్రపూర్ణ ప్రదానం ఏయూక్యాంపస్: సినీ నటుడు కృష్ణకు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణను ప్రదానం చేసింది. ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి ఏయూ ఉపకులపతిగా పనిచేసిన కాలంలో కళారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ 75వ స్నాతకోత్సవంలో ఆయనను కళాప్రపూర్ణతో సత్కరించింది. ఏయూలోని సీఆర్‌రెడ్డి కాన్వొకేషన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనిర్మలతో కలసి కృష్ణ పాల్గొన్నారు. కాగా.. కృష్ణ మృతి పట్ల ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి సంతాపం తెలిపారు. మన్యం గుండెల్లో సూపర్‌స్టార్ సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు పేరు చెబితే అందరికీ సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఈ సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలను చింతపల్లి ప్రాంతంలోనే చిత్రీకరించారు. 1973–74లో దాదాపు ఏడు నెలలపాటు చిత్ర యూనిట్ చింతపల్లిలో ఉంది. తెలుగు వీరలేవరా, జయం మనదే వంటి సినిమాలను అరకులోయలో, పాడిపంటల సినిమాలో ఒక పాటను సీలేరు, గుంటవాడ డ్యామ్, సప్పర్ల రెయిన్‌గేజ్ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. 18న ఏయూలో సంతాప సభ మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఏయూ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం సెమినార్ హాల్లో ఈ నెల 18న సూపర్‌స్టార్ కృష్ణ సంతాపసభ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని.. ఆయన నటించిన ఈనాడు చిత్రాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు. పార్క్ హోటల్లోనే బస బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): సూపర్‌స్టార్ కృష్ణ విశాఖపట్నంనకు వచ్చిన ప్రతీసారి బీచ్‌రోడ్డులోని పార్క్ హోటల్లో బస చేసేవారట. కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించిన అడవి సింహాలు చిత్రం షూటింగ్ సాగరతీరంలో జరిగింది. ఆ చిత్రంలోని ఓ పాటను గ్యాస్ బెలూన్లతో చిత్రీకరిస్తున్నప్పుడు.. అవి పేలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారి్మకుడు మృతి చెందగా.. కృష్ణకు ప్రమాదం తప్పింది. ఓ సందర్భంలో గురజాడ కళాక్షేత్రంలో కృష్ణను టి.సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. సూపర్ మెమొరీ స్టార్ సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న మెమొరీ పవర్ మరే నటుడికీ లేదు. రెండు పేజీల డైలాగ్ అయినా సునాయాసంగా సింగిల్ టేక్‌లో చెప్పగలిగే నటుడు ఆయన మాత్రమే. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అందరి నటులను సమానంగా చూడగలిగే మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో చంద్రవంశం, గూఢాచారి 117, ఆయుధం వంటి సినిమాల్లో నటించాను. మంచి నటుడిని కోల్పోయాం. – ప్రసన్న కుమార్, సీనియర్ నటుడు, వైజాగ్ ప్రొడ్యూసర్ల హీరో తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్లకు నష్టం, కష్టం లేకుండా చూసుకునే ఏకైక నటుడు సూపర్‌స్టార్ కృష్ణ. సినిమా నిర్మించేప్పుడు నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చేసే మహా మనిíÙ. ఆయనతో చల్ మోహన్‌రంగ సినిమాకు నేను సహ నిర్మాతగా వ్యవహరించాను. అప్పటి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనివి. –పురిపండ వెంకట రమణ శర్మ, నిర్మాత చిన్న నటులకు ప్రోత్సాహం సూపర్‌స్టార్ కృష్ణతో పని చేసిన జూనియర్ ఆరి్టస్ట్ను నేను. అల్లూరి సీతారామరాజు సినిమాలో గిరిజనుడి వేషధారణలో ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కింది. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. – బొబ్బాది అప్పారావు, జూనియర్ ఆర్టిస్ట్, వైజాగ్ -
ఆయన మళ్లీ పుట్టాలి: ఫ్యాన్స్ ఆవేదన
-
మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు
అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిసింది. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. ►అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిసింది. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. ►సూపర్‌స్టార్ కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ►సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. లక్షలాది అభిమానుల మధ్య ఆయన అంతిమయాత్ర కొనసాగుతోంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగనుంది. ►సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు అభిమానులు పోటెత్తారు. అభిమానుల రాకతో పద్మాలయ స్టూడియోస్ కిక్కిరిసిపోయింది. కాసేపట్లో ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మహాప్రస్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ► సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సందర్శించారు. ఆయనకు నివాళులు అర్పించి అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కృష్ణ నిర్మాతల హీరో అన్నారు. నిర్మాతల బాగోగులు కోరుకున్న ఒకే ఒక్క హీరో ఆయన అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ► పద్మాలయ స్టూడియో ప్రాంగణం అంతా జనాలతో కిక్కిరిసి పోయింది. తమ అభిమాన నటుడిని కడాసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లు తోసుకుని అభిమానులు ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. దీంతో జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగారు. ► సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి సినీ నటి జయప్రద నివాళులు అర్పించారు. ఆనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ లెజెండరి హీరో అన్నారు. హైదరాబాద్‌కు తెలుగు ఇండస్ట్రీ రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన పట్టుదలతో పనిచేసే వ్యక్తి అంటూ జయప్రద కన్నీరు పెట్టుకున్నారు. ► సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ఏపీ మంత్రి రోజా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ అద్భుతమైన వ్యక్తి అని, సాహసాలు.. సంచనాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ కృష్ణ మృతి పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ► కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్తమిళి సై నివాళులర్పించారు. ► సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్కి చేరుకున్న ఆయన .. కృష్ణకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్‌ని హత్తుకుని ధైర్యం చెప్పాడు. ► కృష్ణ భౌతికకాయానికి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించాడు. ఫ్యామిలీతో కలిసి పద్మాలయ స్టూడియోకు వచ్చిన బాలకృష్ణ.. పూలమాల వేసి అంజలి ఘటించారు. ► పద్మాలయ స్టూడియోకి సినీ తారలు తరలివస్తున్నారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, నటుడు అలీ, ఆయన సోదరుడు ఖయ్యూంలు కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ►మహేశ్‌బాబు తనయుడు గౌతమ్, కూతురు సితారలు వారి తాత పార్ధివదేహానికి నివాళులర్పించారు. ► జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం లో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల కి ఏర్పాట్లు చేస్తున్నారు. మహా ప్రస్థానం వద్ద కార్యక్రమం జరుగుతున్న సమయంలో బయటకి వ్యక్తులు లోపలకి రాకుండా భారీ ప్రైవెట్ భద్రత ఏర్పాటు చేశారు. ► తండ్రిని తలచుకుంటూ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) ► కృష్ణ మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కృష్ణ మృతికి గౌరవ సూచికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినీ పరిశ్రమ నేడు బంద్ పాటిస్తోంది. ► సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుని.. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించనున్నారు. అనంతరం ఘట్టమనేని కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ► అభిమానుల సందర్శనార్ధం కృష్ణ భౌతికకాయం పద్మాలయ స్టూడియోకి తీసుకొచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అభిమానులు సందర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. 12 గంటల తరువాత అంతిమయాత్ర, మహా ప్రస్ధానంలో అంత్యక్రియులు జరగనున్నాయి. ►సూపర్‌స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మాలయా స్టూడియోస్ దగ్గర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. -
ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెండితెరపై 350 వందలకు పైగా చిత్రాలు చేసి వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. అవేంటంటే.. మనవడితో కలిసి తెరపై సందడి చేయాలనుకున్నారు… ‘వన్ నేనొక్కడినే’ మూవీతో ఆయన మనవడు, మహేశ్ కుమారుడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. దాంతో మనవడితో నటించాలని ఉందని ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో, మూవీ విడుదల తర్వాత కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. కానీ అది కుదరలేదు. మంచి కథ వస్తే మహేశ్‌తో కలిసి మరో సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఆ కోరిక కూడా తీరలేదు. అయితే కృష్ణ తన కుమారులు మహేశ్, రమేశ్ బాబులతో కలిసి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి నటించిన పలు చిత్రాల్లో మహేశ్ బాలనటుడిగా కనిపించారు. ఆయనను జేమ్స్ బాండ్‌గా చూడాలనుకున్నారు.. తెలుగు తెరకు జెమ్స్‌బాండ్ తరహా పాత్రని పరిచయం చేసింది కృష్ణే. గూఢఛారి 116, రహస్య గూఢచారి వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా గుర్తింపు పొందారు. తనలానే కుమారుడు మహేశ్‌ను కూడా జేమ్స్ బాండ్ పాత్రలో చూడాలనుకున్నారాయన. ఇదే విషయాన్ని పలు ఇంటర్య్వూలో ఆయన పేర్కొన్నారు. మహేశ్‌ను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారంటూ జెమ్స్‌బాండ్‌గా అని ఆయన సమాధానం ఇచ్చారు. దాంతో మహేశ్‌ను జేమ్స్‌బాండ్‌గా చూడాలనే కృష్ణ కోరిక తీరకుండానే మిగిలిపోయింది. కాగా మహేశ్-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో మహేశ్ జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే నిజమైతే కృష్ణ కోరిక తీరినట్టే.. కానీ తెరపై మహేశ్‌ను జెమ్స్‌బాండ్‌గా చూసి మురిసిపోవాలనుకున్న ఆయన ఆశ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆయన మనసు పడ్డ పాత్రలో నటించకుండానే.. తెరపై విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేసిన కృష్ణకు చత్రపది శివాజీగా చేయాలనేది ఆయన కోరిక. అల్లూరి సీతారామరాజుగా వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆ తర్వాత మనసు పడ్డ మరో పాత్ర.. ఛత్రపతి వీర శివాజీ. చంద్రహాస సినిమాలో కృష్ణ శివాజీ పాత్రలో నటించారు. అయితే.. అది పూర్తిస్థాయి పాత్ర కాదు. కాసేపు మాత్రమే. దానికి తృప్తి చెందని కృష్ణ పూర్తి స్థాయిలో చత్రపతి శివాజీ సినిమా చేయాలనుకున్నారట. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత మహారథితో శివాజీ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట కృష్ణ. ఆ ప్రాజెక్ట్ మీద కొంత వర్క్ కూడా చేశారు. అయితే.. ఆ సినిమా వలన మత ఘర్షణలు చెలరెగే అవకాశం ఉందనే సందేహం వచ్చింది. దీంతో ఈ సినిమా చేయాలనే ఆలోచనను ఆయన వెనక్కి తీసుకున్నారట. దాంతో తనకు ఇష్టమైన శివాజీ పాత్రలో కనిపించాలనే కోరిక తీరకుండానే పోయింది. ఆ తర్వాత ఆ అవకాశం కూడా ఆయనకు రాలేదు. ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేయాలని.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహస్తున్న రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. దేశవ్యాప్తంగా ఈ షో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగులోనూ ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే అప్పట్లోనే ఇలాంటి ఓ రియాలిటీ షో చేయాలన్నది కృష్ణ కోరిక అట. కౌన్ బనేగా కరోడ్ పతి చూసి ఇక్కడ కూడా అలాంటి ఓ షో చేయాలని ఆయన కోరుకున్నారట. అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కేబీసీ షో చూసిన కృష్ణ.. తనకు కూడా అటువంటి షో చేయాలని ఉందని ఓ సందర్భంలో తన మనసులో మాట బయటపెట్టారు. అటువంటి కొత్త కాన్సెప్ట్‌తో ఎవరైనా టీవీ షో ఆఫర్‌తో తన దగ్గరకు వస్తే చేస్తానన్నారు. బుల్లితెరపై షోలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని కృష్ణ గతంలో తెలిపారు. చదవండి రికార్డుల గని... అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ -
అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు
సూపర్ స్టార్ కృష్ణ... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ చరిత్రగా నిలిచిన పేరు ఇది. హీరోగా వెండితెరపై కొత్త పాత్రలను పరిచయం చేసిన ఘనత ఆయనది. అందుకే కృష్ణ అంటే నేటి తరానికి కూడా పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడికి పుంతలు వేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి లెజెండరి నటులు పోటీగా ఉన్నప్పటికీ పాత్రలతో ప్రమోగాలు చేసేందుకు ఏమాత్రం వెనకాడని సాహిసి ఆయన. అలా మోసగాళ్లకు మోసగాడు అనే యాక్షన్ మూవీ చేసి రికార్డు సృష్టించారు. అప్పటి వరకు హాలీవుడ్లో మాత్రమే కనిపించే ఈ పాత్రలు ఈ మూవీతో తొలిసారి ఇండియన్ సినిమాలో అది తెలుగు తెరపై పరిచయం కావడం విశేషం. 1971లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఒక్క తెలుగులోనే కాదు హిందీ. తమిళం, మలయాళం, బెంగాలీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇక ఈసినిమాతో కౌబాయ్‌గా టాలీవుడ్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన. కృష్ణ అంటే ఓ స్టార్ హీరో మాత్రమే కాదు గొప్ప వ్యక్తిగతం ఉన్న హీరో కూడా. ఇక కృష్ణను నిర్మాతల హీరో అని కూడా పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. నిర్మాతల హీరోగా మంచి మనసున్న వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణకు పేరు ఉంది. తాను నటించిన సినిమా ప్లాప్ అయితే వెంటనే ఆ నిర్మాతతను పిలిచి.. మళ్ళీ మంచి కథ సిద్ధం చేసుకోండి… ఫ్రీగా సినిమా చేస్తాను చెప్పడమే కాదు.. వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్న హీరో ఆయన. అలా పలు నిర్మాతలకు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండ నటించి వారికి హిట్లు ఇచ్చారు కృష్ణ. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో అప్పటి నిర్మాతలే స్వయంగా చెప్పారు. కృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో మాత్రమే కాదని, ఆయన నిర్మాతల హీరో అంటూ ఆయనపై తరచూ ప్రశంసలు కురిపించేవారు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో మరే సినీ నటుడికీ ఇలాంటి రికార్డు లేదు. చదవండి: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ నటులకు ఆ భయం పట్టుకుంది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ -
బాగా కావాల్సిన వాళ్లంతా దూరమైపోతున్నారు.. మహేశ్ వీడియో వైరల్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే తల్లి, సోదరుడిని పోగొట్టుకున్న మహేశ్‌కు తాజాగా తండ్రి కూడా దూరమయ్యాడు. గతకొంత కాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో ఘట్టమనేని ఇంట విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని మహేశ్‌బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. (చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు) నాన్న అంటే మహేశ్‌కు ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ‘నాన్న నాకు దేవుడితో సమానం’ అని చాలా సందర్భాల్లో మహేశ్ చెప్పాడు. ఇప్పుడా దేవుడే లేడననే విషయాన్ని మహేశ్ తట్టుకోలేకపోతున్నాడు. తండ్రి పార్థీవదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మహేశ్‌ను అలా చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.ధైర్యంగా ఉండాలంటూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోదరుడు రమేశ్‌బాబు మరణించిన సమయంలో మహేశ్ ఓ కార్యక్రమంలో పాల్గొని స్టేజ్ పైన ఎమోషనల్ గా మాట్లాడాడు.‘నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగిన మీ అభిమానం మాత్రం మారలేదు’ అంటూ అభిమానులనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Mahesh True Fans 🔔 (@mahesh_truefans) -
తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్
తండ్రి మరణాన్ని తట్టుకోలేక సూపర్ స్టార్ మహేశ్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు. కాసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి కృష్ణ పార్థివదేహం నానక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమాలను భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక సినీ ప్రముఖులు సైతం ఆయన నివాసానికి చేరుకుని కృష్ణ భౌతికఖాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం ఆయన తనయుడు మహేశ్ బాబును ఇతర కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ మృతి.. స్పందించిన ఘట్టమనేని కుటుంబం ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర రావు పరామర్శిస్తున్న క్రమంలో మహేశ్ ద:ఖం ఆపుకోలేకపోయారు. తండ్రిని తలుచుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం అక్కడి వారితో పాటు అభిమానులను హత్తుకుంటోంది. మహేశ్ ఏడుస్తుంటే రాఘవేంద్రరావు ఆయనకు ధైర్యం చెబుతూ ఓదార్చారు. కాగా ఏడాది వ్యవధిలోనే తండ్రి, తల్లి, సోదరుడిని కొల్పోయిన మహేశ్ తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ఇక ఈ వీడియోపై మహేశ్‌కు అభిమానులు స్పందిస్తూ ఆయనకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కన్నీటి పర్యంతమైన మహేశ్ బాబు
-
బుధవారం మధ్యాహ్నాం మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు
►ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో బుధవారం మధ్యాహ్నాం మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ►రేపు ఉదయం 9 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించనున్నారు. ఇవాళ రాత్రికి నానాక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహంలోనే ఉంచనున్నారు. ►కృష్ణ ఆత్మకు నివాళులర్పిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. ► సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు... ఆయనతో కలిసి 3 సినిమాల్లో నటించా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ సంతాపం ప్రకటించారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి హీరో రానా, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ హీరో అక్కినేని అఖిల్, టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నివాళులర్పించారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి ఏపీ సీఎం జగన్ రేపు నివాళులర్పించనున్నారు. బుధవారం హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. ► కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్ బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహాన్ని చూసిన మోహన్‌బాబు బోరున విలపించారు. బాధను ఆపులోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని సీఎం కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. ఈ బాధాకర సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం ఆకాంక్షించారు. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ కుడా ఉన్నారు. ► కృష్ణ పార్థివదేహనికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. నానాక్‌రామ్‌గూడలోని కృష్ణ స్వగృహానికి చేరుకున్న కేసీఆర్ మహేశ్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోశ్ కుమార్ కూడా ఉన్నారు. ► సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం 4గంటలకు మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ► కృష్ణ పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి ,ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, నాగచైతన్య తదితరులు నివాళులర్పించారు. . అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ►తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’అని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశాడు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి హీరో వెంకటేశ్, దర్శఖులు బోయపాటి, రాఘవేంద్రరావుతో పాటు పలువురు సీనీ ప్రముఖులు నివాళులర్పించారు.దర్శకుడు రాఘవేంద్ర రావు పరామర్శిస్తున్న క్రమంలో మహేశ్ ద:ఖం ఆపుకోలేకపోయారు. తండ్రిని తలుచుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం అక్కడి వారితో పాటు అభిమానులను కలిచి వేస్తోంది. ► రేపు మహా ప్రస్థానం లో కృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు సిని రాజకీయ ప్రముఖుల సందర్శన తర్వాత కృష్ణ గారి పార్ధివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర , సాయంత్రం 4గంటలకు మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. ► సూపర్‌స్టార్ కృష్ణ మరణం పట్ల పశ్చిమగోదావరి జిల్లా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణానికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) జిల్లా వ్యాప్తంగా థియేటర్స్‌లో ఉదయం ఆటను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబీటర్స్ తెలిపారు. ►సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. రేపు పద్మాలయ స్టూడియో, అనంతరం కృష్ణ పార్థివ దేహానికి మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుపబడతాయని తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.