సాహసానికి ఊపిరి ఆగిపోయింది. తూటాల్లా డైలాగ్స్ పేల్చిన కంఠం మూగబోయింది. నింగిలోకి మరో ధ్రువతార చేరింది. సినీ ప్రయోగశాల.. తెలుగు సినీ పరిశ్రమస్థాయిని ఆకాశం అంత ఎత్తున నిలబెట్టిన మహర్షి సూపర్‌స్టార్ కృష్ణ.. ఉమ్మడి విశాఖ జిల్లాతో ఎన్నో జ్ఞాపకాలను పెనవేసుకున్నారు. ఆయన సినీ జీవితంలో 350కు పైగా సినిమాలు చేసినా.. అందులో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు చింతపల్లి ప్రాంతంలో చిత్రీకరించారు. విశాఖ– భీమిలి బీచ్‌రోడ్డు, యారాడ బీచ్‌లో చాలా సినిమాలు షూటింగ్‌లు జరుపుకున్నాయి. మనిషిగా బతకడం అంటే.. మన చుట్టూ ఉన్న నలుగురిని బతికించడం అని నమ్మిన సూపర్‌స్టార్‌కు ఉమ్మడి జిల్లాలో చాలా అభిమాన సంఘాలున్నాయి. సాహసమే ఊపిరిగా.. సాయమే శ్వాసగా సాగిన ఆయన జీవన ప్రయాణం.. ఎందరికో ఆదర్శప్రాయం.. జోహర్ ఘట్టమనేని శివరామకృష్ణ.
విశాఖపట్నం: సూపర్‌స్టార్ కృష్ణకు విశాఖ సాగరతీరంతో ఎక్కువ అనుబంధం ఉంది. వాస్తవానికి ఆయన సినిమాలు ఎక్కువ శాతం చెన్నై, బెంగుళూర్ తదితర ప్రాంతాల్లోనే చిత్రీకరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా తీయాలి అంటే విశాఖ వైపే మక్కువ చూపేవారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సూపర్‌స్టార్ కృష్ణ జ్ఞాపకాలు తీరంలో పదిలంగా ఉన్నాయి. 1961–62 ప్రాంతంలో భీమిలిలో కులగోత్రాలు సినిమాలో షూటింగ్ జరిగింది. కృష్ణకు నటుడిగా ఇది రెండవ సినిమా. ఇందులో ఆయన చిన్న పాత్రలో నటించారు.
1975లో ప్రకారావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన చీకటి వెలుగులులో ఓ సన్నివేశాన్ని ఇప్పటి పార్క్ హోటల్ సమీపంలో చిత్రీకరించారు. 1983లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో అడివి సింహాలు సినిమా షూటింగ్ రుషికొండ, రామకృష్ణ బీచ్‌లో జరిగింది. 1984లో విజయనిర్మల దర్శకత్వంలో రక్త సంబంధం సినిమాలో ఓ సన్నివేశాన్ని యారాడ కొండపై చిత్రీకరించారు. 1993లో పచ్చని సంసారం చిత్రం అర్ధశత దినోత్సవం విశాఖలో జరిగింది. 100వ సినిమా అల్లూరి సీతారామరాజు మన్యంలో నిర్మించగా, 1995లో కృష్ణ నటించిన 300వ సినిమా తెలుగువీర లేవరా సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ ఎర్రమట్టి దిబ్బల్లో చిత్రీకరించారు.
బీచ్‌రోడ్‌లో ఎన్‌కౌంటర్, యారాడ కొండపై కృష్ణ, మహేష్ నటించిన వంశీ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లను షూట్ చేశారు. ఎస్ నేనంటే నేను సినిమా రుషికొండ, ఆర్.కె.బీచ్ తదితర ప్రాంతాలు, జగదాంబ సెంటర్‌లో చిత్రీకరణ జరుపుకుంది. విశాఖలో రాజేశ్వరి థియేటర్‌లో కంచుకాగడా సినిమా విడుదల సమయంలో మూడు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. విశా ఖతో ఉన్న అనుబంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలనే ఆకాంక్షతో.. పద్మాలయ ఫిల్మ్ స్టూడియో ను విశాఖలో నిర్మించాలని ఉందని పలుమార్లు కృష్ణ మీడియాకు చెప్పారు.
నటశేఖరుడికి కళాప్రపూర్ణ ప్రదానం
ఏయూక్యాంపస్: సినీ నటుడు కృష్ణకు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణను ప్రదానం చేసింది. ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి ఏయూ ఉపకులపతిగా పనిచేసిన కాలంలో కళారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ 75వ స్నాతకోత్సవంలో ఆయనను కళాప్రపూర్ణతో సత్కరించింది. ఏయూలోని సీఆర్‌రెడ్డి కాన్వొకేషన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనిర్మలతో కలసి కృష్ణ పాల్గొన్నారు. కాగా.. కృష్ణ మృతి పట్ల ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి సంతాపం తెలిపారు.
మన్యం గుండెల్లో సూపర్‌స్టార్
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు పేరు చెబితే అందరికీ సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఈ సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలను చింతపల్లి ప్రాంతంలోనే చిత్రీకరించారు. 1973–74లో దాదాపు ఏడు నెలలపాటు చిత్ర యూనిట్ చింతపల్లిలో ఉంది. తెలుగు వీరలేవరా, జయం మనదే వంటి సినిమాలను అరకులోయలో, పాడిపంటల సినిమాలో ఒక పాటను సీలేరు, గుంటవాడ డ్యామ్, సప్పర్ల రెయిన్‌గేజ్ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు.
18న ఏయూలో సంతాప సభ
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఏయూ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం సెమినార్ హాల్‌లో ఈ నెల 18న సూపర్‌స్టార్ కృష్ణ సంతాపసభ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని.. ఆయన నటించిన ఈనాడు చిత్రాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు.
పార్క్ హోటల్‌లోనే బస
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): సూపర్‌స్టార్ కృష్ణ విశాఖపట్నంనకు వచ్చిన ప్రతీసారి బీచ్‌రోడ్డులోని పార్క్ హోటల్‌లో బస చేసేవారట. కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించిన అడవి సింహాలు చిత్రం షూటింగ్ సాగరతీరంలో జరిగింది. ఆ చిత్రంలోని ఓ పాటను గ్యాస్ బెలూన్లతో చిత్రీకరిస్తున్నప్పుడు.. అవి పేలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారి్మకుడు మృతి చెందగా.. కృష్ణకు ప్రమాదం తప్పింది. ఓ సందర్భంలో గురజాడ కళాక్షేత్రంలో కృష్ణను టి.సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు.
సూపర్ మెమొరీ స్టార్
సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న మెమొరీ పవర్ మరే నటుడికీ లేదు. రెండు పేజీల డైలాగ్ అయినా సునాయాసంగా సింగిల్ టేక్‌లో చెప్పగలిగే నటుడు ఆయన మాత్రమే. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అందరి నటులను సమానంగా చూడగలిగే మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో చంద్రవంశం, గూఢాచారి 117, ఆయుధం వంటి సినిమాల్లో నటించాను. మంచి నటుడిని కోల్పోయాం.
– ప్రసన్న కుమార్, సీనియర్ నటుడు, వైజాగ్
ప్రొడ్యూసర్ల హీరో
తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్లకు నష్టం, కష్టం లేకుండా చూసుకునే ఏకైక నటుడు సూపర్‌స్టార్ కృష్ణ. సినిమా నిర్మించేప్పుడు నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చేసే మహా మనిíÙ. ఆయనతో చల్ మోహన్‌రంగ సినిమాకు నేను సహ నిర్మాతగా వ్యవహరించాను. అప్పటి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనివి.
–పురిపండ వెంకట రమణ శర్మ, నిర్మాత
చిన్న నటులకు ప్రోత్సాహం
సూపర్‌స్టార్ కృష్ణతో పని చేసిన జూనియర్ ఆరి్టస్ట్‌ను నేను. అల్లూరి సీతారామరాజు సినిమాలో గిరిజనుడి వేషధారణలో ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కింది. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది.
– బొబ్బాది అప్పారావు, జూనియర్ ఆర్టిస్ట్, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment