'ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఫోన్ చేసింది'
గుంటూరు: అడవులదీవి యువతి జాస్మిన్ అనుమానాస్పద మృతితో రేపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జాస్మిన్ పై లైంగిక దాడికి ప్రయత్నించి, హత్య చేశారనే అనుమానంతో ఇద్దరిని జనం చితకబాదడంతో వారిలో వేముల శ్రీసాయి అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు జొన్నా పవన్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జాస్మిన్, సాయి మృతదేహాలకు రేపల్లె ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయి బంధువులు సోమవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సాయి బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సాయిని గ్రామస్తులు, పోలీసులే చంపారని అతడి తల్లి ఆరోపించింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వారు వెనక్కు తగ్గక పోవడంతో రేపల్లె లో 144 సెక్షన్ ను విధించారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అదే విధంగా సాయి మృతికి సంబంధించి జాస్మిన్ సోదరుడు షాదుల్లా సహా మరికొంత మంది గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా జాస్మిన్ ను కాపాడాలని తాము ప్రయత్నించామని పవన్ తెలిపాడు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని తమకు జాస్మిన్ ఫోన్ చేసిందని, తాము వెళ్లేసరికి ఆమె శవమై పడివుందని వెల్లడించాడు. గ్రామస్తులంతా తమపై దాడి చేశారని, పోలీసులు చూస్తుండిపోయారని వాపోయాడు. కాగా సాయి మృతికి సంబంధించి జాస్మిన్ సోదరుడు షాదుల్లా సహా మరికొందరు గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.