Addict to alcohol
-
మద్యానికి బానిసైన కిమ్.. అతిగా తాగి ఏడుస్తూ కాలం గడుపుతున్నారా?
సియోల్: రోజంతా మద్యం తాగడం వంటి అనారోగ్యకర ఆహార అలవాట్ల కారణంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే 39వ బర్త్‌డే జరుపుకున్న కిమ్‌కు.. వయస్సు మీదపడుతుందనే బెంగ ఎక్కువైనట్లుగా ఉందని దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో ఉంటున్న ఉత్తర కొరియా విద్యావేత్త డాక్టర్ చొయ్ జిన్‌వూక్ అంటున్నారు. ఒంటరితనంతో బాధపడుతున్న కిమ్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అతిగా తాగి ఏడుస్తూ కాలం గడుపుతున్నారని చెబుతున్నారు. అనారోగ్య వివరాలు ఎక్కడ బయటకు పొక్కుతాయో అనే భయంతో కిమ్ పర్యటనల సమయంలో సొంత టాయిలెట్‌ను కూడా తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. తాగుడు తగ్గించి, రోజూ సమయం వ్యాయామం చేయాలని భార్య, వైద్యులు సలహాలిచ్చినా పట్టించుకోవడం లేదని మిర్రర్ పత్రిక కథనం పేర్కొంది. -
మద్యానికి బానిసైన భర్త.. ఇంటి నుంచి వెళ్లగొట్టిన భార్య.. ప్రతీకారంతో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను పొడిచి చంపి, కత్తితో నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ఢిల్లీలోని మంగోల్‌పురిలోకి చెందిన సమీర్(45) అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. తరచూ డబ్బులు కావాలని భార్య షబానాతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నెల క్రితం అతడిని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టింది. అప్పటి నుంచి అతను వీధుల్లో నివసిస్తున్నాడు. తాను నిరాశ్రయుడు కావడానికి తన భార్య కారణం అని ప్రతీకారంతో.. శనివారం ఉదయం భార్య షబానాతో ఘర్షణ పడి హత్య చేశాడు. అంతేకాకుండా భార్యను కత్తితో పొడిచి చంపి స్టేషన్లో లొంగిపోయాడు.’’ అని తెలిపారు. కాగా, ఈ ఘటనపై నిందితుడుని మంగోల్‌పురి స్టేషన్ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఇక అతని భార్య షబానా (40)ను స్థానికులు సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. కాగా, ఈ జంటకు 21, 17 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లితో గొడవపడిన ఓ కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన చెవిబోయిన భాగ్యకు ఇద్దరు సంతానం.. కూతురు స్వప్న, కొడుకు ప్రసాద్(20). కాగా, ఆమె భర్త గతంలోనే చనిపోవడంతో జీవనోపాధి నిమిత్తం హైదరబాద్‌కు వెళ్లారు. అక్కడ ప్రసాద్ గత కొంతకాలంగా మద్యంతాగుతూ ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోతే తాను ఆత్మహాత్య చేసుకుంటానని తరుచూ తన తల్లిని బెదిరించేవాడు. ఈక్రమంలో 21న మద్యం కోసం తల్లితో గోడవపడి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నాగిరెడ్డిపేటకు చేరుకున్నాడు. మరుసటిరోజు రాత్రి వరకు ప్రసాద్ తన ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని తలుపులను పాక్షికంగా ధ్వంసంచేసి చూడగా ప్రసాద్ ఇంట్లో దులానికి ఉరేసుకొని ఉన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భర్తతో వనితా విజయ్ కుమార్‌కు విభేదాలు!
చెన్నై: తన భర్త మద్యానికి బానిసయ్యాడని నటి, బిగ్‌బాస్ ఫేం వనితా విజయకుమార్ ఆరోపించింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిన ఆమె ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారు. తాజాగా పీటర్ పాల్‌తో కూడా వనితా విజయ్‌కుమార్‌కు విభేదాలు తలెత్తినట్లు, వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ సంచలన జంట ఇటీవల విహారయాత్రకు గోవాకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గొడవ మొదలైంది. దీంతో చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత నటి వనితా విజయకుమార్ మూడవ భర్తను కూడా వదిలేసినట్లు ప్రచారం హోరెత్తుతోంది. చదవండి: వనితా విజయకుమార్ భర్తకు గుండెపోటు ఈ విషయంపై స్పందించిన వనిత విజయకుమార్ ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో ఆమె.. ‘పీటర్‌పాల్ మద్యానికి పచ్చి బానిసని, చైన్ స్మోకర్’ అని ఆరోపించారు. అతనికి రెండు సార్లు గుండెపోటు రావడంతో రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అదృష్టవశాత్తు పీటర్ పాల్‌కు ఆరోగ్యం బాగుపడిందని, అయితే మళ్లీ మద్యం తాగుతున్నట్లు ఆరోపించారు. మద్యానికి దూరంగా ఉంటానని తనకు ప్రమాణం చేసి కూడా తాగడం ఆపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తానీ నిర్ణయానికి వచ్చినట్లు వనితా విజయకుమార్ వివరించారు.చదవండి: ‘సైఫ్‌ను చాలా ప్రేమిస్తున్నాను.’ -
‘మత్తు’ వదిలించొచ్చు
మద్యం మహమ్మారి నేడు అనేక కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది.. మద్యానికి బానిసైనవారు తమ శరీరానికి హాని చేసుకోవడమే కాకుండా ఇంట్లోవారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తారు.. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువుగా మృతి చెందడం చూస్తున్నాం. వారిలో చాలామంది మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరిగి మృతిచెందినట్లుగా తేలడం విస్మయానికి గురిచేస్తోంది. మద్య పానానికి అలవాటుపడిన వారు నలుగురిలో చులకనకు గురవుతారు.. చాలామందికి మద్యం మానాలని ఉన్నా రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రారంభిస్తారు.. అయితే చిత్తశుద్ధి ఉంటే వారిలో ఈ వ్యసనాన్ని తేలిగ్గా పోగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాక్షి, విజయవాడతూర్పు : సరదాగా స్నేహితులతో కలిసి వీకెండ్స్‌లో తాగేవారు కొందరు..కాయకష్టం చేసి, అలసటను మర్చిపోవాలనే ఉద్ధేశంతో తాగేవారు మరికొందరు. మద్యానికి బానిసలై ఉదయం నిద్రలేవగానే మద్యం తాగే వాళ్లు ఇంకొందరు. ఇలా పురుషుల్లో 17 శాతం మంది ఏదొక సమయంలో మద్యం తాగుతూ ఉంటారు. వారిలో సాయంత్రం 6 గంటల తర్వాత తాగేవారు అధికంగా ఉండగా, రాత్రి 9 నుంచి వేకువ జామున 3 గంటల వరకూ మద్యం తాగే వారు అత్యధికంగా ఉన్నట్లు అంచనా. అలాంటి వారి కారణంగానే ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నట్లు మానసిక వైద్యులు చెబుతున్నారు. రక్తంలో ఆల్కాహాల్ శాతం పెరిగితే... మద్యం అధికంగా తాగడం వలన రక్తంలో ఆల్కాహాల్ శాతం పెరిగి తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. అలెర్ట్నెస్(అప్రమత్తత) తగ్గడం, సరిగ్గా వినపడక పోవడం, విజన్(కంటిచూపు) తగ్గడం, తక్షణమే నిర్ణయం తీసుకునే శక్తి తగ్గడం జరుగుతుంది. ఈ ప్రభావంలో వాహనం నడిపే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులను గుర్తించలేక ప్రమాదాలకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువుగా జరుగుతున్నట్లు అంచనా. అనారోగ్య సమస్యలు అధికంగా మద్యం సేవించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వెంట్రుకల నుంచి కాలిపాదం వరకూ శరీరంలోని ప్రతి అవయవంపై మద్యం ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా లివర్ దెబ్బతినడం, కిడ్నీలు పాడవడం, రక్తనాళాలు, గుండెపై ప్రభావం చూపడం, రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పేగు పూత, ప్రాంకియాటైటీస్ వంటి సమస్యలు ఆల్కాహాలిస్టుల్లో సర్వసాధారణంగా వస్తుంటాయి. మద్యం సేవించే వారిలో దాంపత్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెపుతున్నారు. మాన్పించవచ్చు.. మద్యానికి బాలిసలైన వారిని మాన్పించేందుకు వైద్యం అందుబాటులో ఉంది. రెండు సంవత్సరాల పాటు క్రమం తప్పక మందులు వాడటం ద్వారా మద్యం అలవాటును పూర్తిగా మాన్పించవచ్చునని మానసిక వైద్యులు చెబుతున్నారు. రోజుకు మూడు క్వార్టర్లు కన్నా ఎక్కువ మద్యం తాగే వారికి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది. మద్యం తాగే ప్రతి వంద మందిలో 10 మంది మానేందుకు ప్రయత్నిస్తూ చికిత్సకోసం వస్తున్నట్లు చెబుతున్నారు. అలా వచ్చిన వారిలో 90 శాతం మంది తిరిగి మద్యం తాగడం జరగడం లేదంటున్నారు. -
మద్యం ఉచ్చు.. యువత చిత్తు
పశ్చిమగోదావరి, తణుకు: తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు మద్యం తాగి తరగతి గదికి వచ్చారు. తోటి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు వారిని పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్థారణ అయ్యింది. ఇటీవల కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థినులకు టీసీ ఇచ్చి పంపించేశారు. ♦ 20 ఏళ్లు లోపు ఉన్న ముగ్గురు స్నేహితులు మందు పార్టీ చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మద్యంతో పాటు బీరు సీసాలు కొనుక్కుని గ్రామం శివారులోని ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. వారికి అవగాహన లేకపోవడంతో మద్యంలో బీరు కలుపుకొని తాగేశారు. కొద్దిసేపటికే వారికి వాంతులు, విరేచనాలు కావడంతో స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఉండ్రాజవరం మండలం కాల్దరిలో గతంలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ♦ ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థి తన పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు తనతోటి విద్యార్థులను పార్టీకు పిలిచాడు. అయితే అక్కడ బీరు సీసాలు ప్రత్యక్షం కావడంతో వచ్చిన వారంతా ఖంగు తిన్నారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో తమను అడిగేవారు ఎదరు లేరన్న దీమాతో పూటుగా తాగి పార్టీ చేసుకున్నారు. తణుకు పట్టణంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలియడంతో అవాక్కయ్యారు. చిత్తవుతున్న యువత మద్యం యువతను పెడదోవ పెట్టిస్తోంది. చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన భావిపౌరులు పక్కదారి పడుతున్నారు. బడికెళ్లే వయసులో బాల్యం మద్యం మత్తులో తూగుతోంది. 15 ఏళ్ల ప్రాయంలోనే విద్యార్థులు మత్తు రుచిని ఆస్వాదిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న సంఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మద్యానికి బానిసవుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. తాగే వయసు క్రమేపీ తగ్గుతోంది. దేశంలో మద్యం తాగే వారిని పరిగణనలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మద్యం తాగుతున్నారని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ స్పష్టం చేసింది. మద్యానికి అలవాటు పడుతున్న వారి వయసు ఎక్కువగా 15 నుంచి 20 ఏళ్ల లోపు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మద్యానికి బానిసైన వారిలో 28 శాతం రోడ్డు ప్రమాదాల్లో, 21 శాతం జీర్ణకోశ వ్యాధులతో, 19 శాతం గుండె సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే విద్యార్థి దశలోనే మద్యానికి బానిసలు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా రూ.వందల కోట్లు మేర మద్యాన్ని తాగేస్తున్నారంటే మద్యం ఎంత వరకు జీవితాలను విచ్ఛిన్నం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. మద్యంతోనే మరణాలు జిల్లాలో మొత్తం 474 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ. వందల కోట్లు మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. సాధారణంగా యుక్త వయసులో మద్యం తాగడం మొదలు పెట్టిన వారు ఎక్కువగా బానిసలవుతున్నారు. మరో వైపు 15 నుంచి 20 ఏళ్లలోపు మద్యం తాగిన వారిలోనే శారీరక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మద్యం తాగే అలవాటు ఉన్న వ్యక్తి సగటున 34.5 లీటర్ల మద్యం తాగుతున్నాడని గణాంకాలు చెబుతుండగా మద్యం తాగడంతో ప్రపంచవ్యాప్తంగా 2016లో 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా మరణిస్తున్న వారిలో ఎక్కువగా పురుషులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే మద్యానికి బానిసైన వారికి, యువతను మద్యానికి దూరంగా ఉంచడానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నూతనంగా ‘జాగృతి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించి మద్యానికి బానిసైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. చిన్నతనం నుంచే కౌన్సిలింగ్ అవసరం తల్లిదండ్రులు విలువైన సమయాన్ని పిల్లలకు కేటాయించడం ద్వారా నేను ఒంటరిని కాను అనే ఆలోచన మత్తు పదార్ధాల వైపు మళ్లించకుండా చేయవచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండటం వల్ల పిల్లలు చెడు అలవాట్లపై దృష్టిసారించే అవకాశం ఉండదు. రేపటి భవిష్యత్ కోసం ఉన్న యువత మద్యం, డ్రగ్స్ వంటి ఇతరత్రా వ్యసనాల వల్ల రేపు చూస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా నైతిక విలువలను చిన్నప్పటి నుంచి నేర్పడం ద్వారా చెడు అలవాట్లు, ఆలోచనలకు దూరంగా ఉంచి మంచి రోల్‌మోడల్స్‌గా మారాలి. – అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, తణుకు -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
కుల్కచర్ల: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మందిపల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటయ్య(32) స్థానికంగా వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన ఖాళీగా తిరుగుతూ పనిచేయడం లేదు. ఈనేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. మంగళవారం మద్యం తాగిన వెంకటయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటయ్య తండ్రి అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు.