కాల్దరిలో మద్యం తాగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎక్సైజ్ ఉన్నతాధికారులు(ఫైల్)
పశ్చిమగోదావరి, తణుకు: తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు మద్యం తాగి తరగతి గదికి వచ్చారు. తోటి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు వారిని పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్థారణ అయ్యింది. ఇటీవల కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థినులకు టీసీ ఇచ్చి పంపించేశారు.
♦ 20 ఏళ్లు లోపు ఉన్న ముగ్గురు స్నేహితులు మందు పార్టీ చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మద్యంతో పాటు బీరు సీసాలు కొనుక్కుని గ్రామం శివారులోని ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. వారికి అవగాహన లేకపోవడంతో మద్యంలో బీరు కలుపుకొని తాగేశారు. కొద్దిసేపటికే వారికి వాంతులు, విరేచనాలు కావడంతో స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఉండ్రాజవరం మండలం కాల్దరిలో గతంలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.
♦ ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థి తన పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు తనతోటి విద్యార్థులను పార్టీకు పిలిచాడు. అయితే అక్కడ బీరు సీసాలు ప్రత్యక్షం కావడంతో వచ్చిన వారంతా ఖంగు తిన్నారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో తమను అడిగేవారు ఎదరు లేరన్న దీమాతో పూటుగా తాగి పార్టీ చేసుకున్నారు. తణుకు పట్టణంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలియడంతో అవాక్కయ్యారు.
చిత్తవుతున్న యువత
మద్యం యువతను పెడదోవ పెట్టిస్తోంది. చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన భావిపౌరులు పక్కదారి పడుతున్నారు. బడికెళ్లే వయసులో బాల్యం మద్యం మత్తులో తూగుతోంది. 15 ఏళ్ల ప్రాయంలోనే విద్యార్థులు మత్తు రుచిని ఆస్వాదిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న సంఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మద్యానికి బానిసవుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. తాగే వయసు క్రమేపీ తగ్గుతోంది. దేశంలో మద్యం తాగే వారిని పరిగణనలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మద్యం తాగుతున్నారని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ స్పష్టం చేసింది. మద్యానికి అలవాటు పడుతున్న వారి వయసు ఎక్కువగా 15 నుంచి 20 ఏళ్ల లోపు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మద్యానికి బానిసైన వారిలో 28 శాతం రోడ్డు ప్రమాదాల్లో, 21 శాతం జీర్ణకోశ వ్యాధులతో, 19 శాతం గుండె సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే విద్యార్థి దశలోనే మద్యానికి బానిసలు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా రూ.వందల కోట్లు మేర మద్యాన్ని తాగేస్తున్నారంటే మద్యం ఎంత వరకు జీవితాలను విచ్ఛిన్నం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.
మద్యంతోనే మరణాలు
జిల్లాలో మొత్తం 474 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ. వందల కోట్లు మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. సాధారణంగా యుక్త వయసులో మద్యం తాగడం మొదలు పెట్టిన వారు ఎక్కువగా బానిసలవుతున్నారు. మరో వైపు 15 నుంచి 20 ఏళ్లలోపు మద్యం తాగిన వారిలోనే శారీరక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మద్యం తాగే అలవాటు ఉన్న వ్యక్తి సగటున 34.5 లీటర్ల మద్యం తాగుతున్నాడని గణాంకాలు చెబుతుండగా మద్యం తాగడంతో ప్రపంచవ్యాప్తంగా 2016లో 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా మరణిస్తున్న వారిలో ఎక్కువగా పురుషులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే మద్యానికి బానిసైన వారికి, యువతను మద్యానికి దూరంగా ఉంచడానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నూతనంగా ‘జాగృతి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించి మద్యానికి బానిసైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టారు.
చిన్నతనం నుంచే కౌన్సిలింగ్ అవసరం
తల్లిదండ్రులు విలువైన సమయాన్ని పిల్లలకు కేటాయించడం ద్వారా నేను ఒంటరిని కాను అనే ఆలోచన మత్తు పదార్ధాల వైపు మళ్లించకుండా చేయవచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండటం వల్ల పిల్లలు చెడు అలవాట్లపై దృష్టిసారించే అవకాశం ఉండదు. రేపటి భవిష్యత్ కోసం ఉన్న యువత మద్యం, డ్రగ్స్ వంటి ఇతరత్రా వ్యసనాల వల్ల రేపు చూస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా నైతిక విలువలను చిన్నప్పటి నుంచి నేర్పడం ద్వారా చెడు అలవాట్లు, ఆలోచనలకు దూరంగా ఉంచి మంచి రోల్‌మోడల్స్‌గా మారాలి. – అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, తణుకు
Comments
Please login to add a commentAdd a comment