‘ఐటెం సాంగ్’ ఆరోపణలు.. మహిళా జడ్జికి భారీ ఊరట
హైకోర్టు న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఐటెం సాంగ్‌కు చిందులేయాని బలవంతం చేశారని ఆరోపించిన దిగువ స్థాయి కోర్టు న్యాయమూర్తికి ఊరట లభించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్ మరక’గా దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యింది. అయితే ఈ ఉదంతంలో 2014లో రాజీనామా చేసిన ఆమెను.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది.
2014లో సదరు మహిళా న్యాయమూర్తి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని, ఆ కారణంతో ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గురువారం ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. రాజీనామాను స్వచ్చంద విరమణ కింద పరిగణించకూడదంటూ కోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు సూచించింది. అంతేకాదు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమోదించిన ఆమె రాజీనామాను కొట్టేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు.
ఏం జరిగిందంటే..
జూలై 2014లో, అదనపు జిల్లా న్యాయమూర్తి అయిన ఆమె.. హైకోర్టు జడ్జి నుంచి తనకు జరిగిన వేధింపుల ఎదురవుతున్నాయని ఆరోపణలకు దిగింది. ఈ వేధింపులపై రాష్ట్రపతి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసింది. ఆ తర్వాత ఆమె గ్వాలియర్‌లోని అదనపు జిల్లా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసేసింది.
ఓ ఐటెం సాంగ్‌లో తనను డ్యాన్స్ చేయాలని హైకోర్టు జడ్జి తనను కోరినట్లు లేఖలో ఆరోపించిందామె. అంతేకాదు సుదూర ప్రదేశానికి తనను బదిలీ చేయడాన్ని న్యాయమూర్తి ప్రభావితం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో సదరు జడ్జికి సుప్రీం నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం రాజ్యసభ తరపున ఒక ప్యానెల్ నియమించారు. ఈ ప్యానెల్ గత ఏడాది డిసెంబర్లో నివేదిక ఇస్తూ.. సదరు హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది.
ఫిర్యాది మహిళను వేధించడానికి న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగంలో ఎటువంటి ఆధారం లేదని ప్యానెల్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత.. ఆరోపణలు చేసిన మహిళ.. తనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని పరిశీలించాలని ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు చుక్క ఎదురు కాగా.. ఇప్పుడు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది.