ఆదివిష్ణు దీక్ష భగ్నం
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు రాఘవరాజు ఆదివిష్ణు నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేశారు. సీఐ పి.మురళీరామకృష్ణ, ఎస్సై బీఎన్ నాయక్ రెండు వాహనా ల్లో సిబ్బందితో, అంబులెన్స్‌తో దీక్షా శిబిరానికి వచ్చి ఆదివిష్ణును తరలించేందుకు యత్నించగా వైఎస్ఆర్సీపీ నాయకులు నులకాని వీరస్వామినాయుడు, చలమాల శ్రీనివాస్, కె.మల్లిబాబు, పి.శ్రీనివాస్, పోల్నాటి బాబ్జి, కార్యకర్తలు ప్రతిఘటించారు.
పోలీసులు నాయకులు, కార్యకర్తలను గెంటివేసి ఆదివిష్ణును బలవంతంగా అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా ఆమరణదీక్ష కొనసాగిస్తునట్లు ఆదివిష్ణు ప్రకటించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డి.భాస్కరరావు, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ కె.విజయకృష్ణ ఆదివిష్ణుకు వైద్యం చేసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. ఆదివిష్ణుకు బీపీ, పల్స్, రక్తపరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఆదివిష్ణు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశామని సీఐ మురళిరామకృష్ణ, ఎస్సై నాయక్ చెప్పారు.