కోవాగ్జిన్‌తోనూ సైడ్ ఎఫెక్ట్స్..
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’తోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు.సైడ్ ఎఫెక్ట్స్ వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వాణిజ్య కారణాలతో మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది.