AFRC proposals
-
డిసెంబర్లో ఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్ల ఫీజులను ఖరారు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2016లో ఖరారు చేసిన ఫీజుల గడువు 2018–19 విద్యా సంవత్సరంతో ముగియడంతో..2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో వివిధ కోర్సులకు ఏటా వసూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌గా పని చేసిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ స్వరూప్‌రెడ్డి పదవీకాలం గత డిసెంబర్‌తోనే ముగియగా, ఇపుడు కొత్త చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. ఏఎఫ్ఆర్సీకి చైర్మన్ మినహా మిగతా కమిటీ సభ్యులంతా ఉన్నారు. దీంతో ఆ కమిటీ నేతృత్వంలో నోటిఫికేషన్ జారీ చేసి, మూడేళ్లలో కాలేజీల ఆదాయ వ్యయాలు, ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు స్వీకరించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా ఉంది. సాధారణంగా ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ జడీ ్జల పేర్లను ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తే ఆయన అందులోని ఏదో ఒక పేరును ఖరారు చేస్తారు. -
మళ్లీ ప్రైవేటు మెడికల్ ఫీజుల బాదుడు!
♦ రెండింతలకుపైగా పెంచాలని కోరిన యాజమాన్యాలు ♦ వైద్య ఆరోగ్యశాఖకు ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల ఫీజుల బాదుడుకు రంగం సిద్ధమైంది. బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఫీజులు పెంచాలన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలవిజ్ఞప్తిపై అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫీజులను పెంచు తూ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గతేడాదే ఫీజులు పెంచిన ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి ఈ ఏడాదీ ఫీజులు పెంచాలని నిర్ణయించనుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి ఫీజులను సవరించాల్సి ఉండ గా ఏడాదికే మళ్లీ పెంచుతుండటాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. రెండింతలు కోరిన యాజమాన్యాలు... ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను నీట్ ర్యాంకుల ద్వారా భర్తీ చేస్తున్నందున ఇక తమకు డొనేషన్లు వసూలు చేసుకునే వీలుండదని... కాబట్టి భారీగా నష్టపోతామని మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఏఎఫ్ఆర్సీలో ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వ వర్గాల వద్ద ప్రస్తావిస్తూ ప్రస్తుత ఫీజులకు రెండింతల మేరకు పెంచాలని కోరినట్లు తెలియవచ్చింది. ఫీజులు ఎంతున్నా ఇప్పటివరకు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్‌కు రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకు డొనేషన్ల రూపంలో వసూలు చేశాయి. నీట్ ద్వారా భర్తీ చేస్తే పూర్తిగా ర్యాంకుల ఆధారంగానే సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని... ఇది తమకు నష్టమని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి.‘అవును.. నీట్ వల్ల ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు నష్టపోతాయి. కాబట్టి ఫీజులు పెంచితే తప్పేంటి?’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీ కేటగిరీకి రూ.11 లక్షల వరకు... ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీటు ఫీజు ఏడాదికి రూ. 9 లక్షలుండగా ఆ ఫీజును ఏపీ ప్రభుత్వం మాదిరిగా రూ. 11 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే సీ కేటగిరీ (ఎన్ఆర్ఐ) సీట్ల ఫీజు ప్రస్తుతం రూ. 11 లక్షలుంది. ఏపీలో ఈ కేటగిరీ ఫీజు బీ కేటగిరీ ఫీజుకు ఐదు రెట్ల వరకు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ప్రకారమే తెలంగాణలోనూ పెంచాలనుకుంటున్నారు. అంటే ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటుకు వార్షిక ఫీజు రూ. 55 లక్షల వరకు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నారు. ఫీజులను ఏటా 5 శాతం చొప్పున పెంచాలని ఏపీ ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. ఆ ప్రకారమే తెలంగాణలోనూ చేసే అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్రంలోని 11 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,040 సీట్లు ఉండగా వాటిలోని బీ కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా ఏపీలో మాదిరిగానే భర్తీ చేసే అవకాశాలున్నాయి.