Ahmadulla
-
కడప.. మంత్రుల గడప
సాక్షి, కడప : జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కడప అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచిన వారికే ఎక్కువసార్లు మంత్రి పదవులు లభించాయి. 1952లో ఇక్కడ గెలిచిన కడప కోటిరెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఎస్.రామమునిరెడ్డికి వెద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం లభించింది. 1985లో టీడీపీఅభ్యర్థిగా గెలుపొందిన సి.రామచంద్రయ్యకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా అవకాశం వచ్చింది. 1999లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషాను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా నియమించారు. 2009లో రెండవ పర్యాయం కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మదుల్లా గెలుపొందారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు మైనార్టీ సంక్షేమశాఖను అప్పగించారు. ఇలా ఐదుసార్లు కడప ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. అసలే దక్కని నియోజకవర్గాలు రైల్వేకోడూరులో సరస్వతమ్మ, రాజంపేటలో బండారు రత్నసభాపతి, పసుపులేటి బ్రహ్మయ్య, బద్వేలులో బిజివేముల వీరారెడ్డి, మైదుకూరులో డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి, జమ్మలమడుగు నుంచి పి.శివారెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కమలాపురంలో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, పులివెందుల నుంచి పి.బసిరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలు మంత్రులుగా పనిచేశారు. రాయచోటి, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు ఇంతవరకు మంత్రి పదవులు దక్కలేదు. -
టీడీపీ వర్గీయుల ఘర్షణ
కడప అర్బన్: ఇటీవల టీడీపీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా, అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు లక్ష్మిరెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరు తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదం ప్రారంభమై.. వారు తలలు పగులగొట్టుకునేంత వరకు దారి తీసింది. తీవ్రంగా గాయపడిన వారు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ♦ టీడీపీ నేత లక్ష్మిరెడ్డి వర్గానికి చెందిన మజ్జారి వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 28న టీడీపీ నేతలు అహ్మదుల్లా, అతని కుమారుడు అష్రఫ్తో పాటు, తమ గ్రామానికి చెందిన రాజుల వెంకట సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, ఇంకా కొంతమంది కలిసి గ్రామంలో ర్యాలీ, సమావేశం నిర్వహించారన్నారు. ఆ కార్యక్రమానికి అహ్మదుల్లా, అతని కుమారుడు వచ్చి తనను పిలిచినా తాను వెళ్లలేదన్నాడు. అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని రామాలయం గోడలపై పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను సుబ్బారెడ్డితో పాటు, కొంతమంది వారి అనుచరులు ఏర్పాటు చేస్తుంటే తాము అభ్యంతరం తెలిపామన్నారు. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తమపై దాడికి పాల్పడ్డారని తెలిపాడు. దాడి చేసిన వారిలో రాజుల వెంకటసుబ్బారెడ్డి, ఆర్. రవీంద్రారెడ్డి, పోతుల భాస్కర్‌రెడ్డి, రాంగంగిరెడ్డి, చంద్రబాబుతో పాటు మరికొందరు ఉన్నారని పేర్కొన్నాడు. తనపై సుత్తి, ఇంకా కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నాడు. ♦ ఈ సంఘటనలో గాయపడిన మాజీ మంత్రి అహ్మదుల్లా, అష్రఫ్ వర్గానికి చెందిన, ఆనగొంది చంద్రబాబు పాలెంపల్లెకు చెందిన వ్యక్తి, రూకవారిపల్లెకు చెందిన రాం గంగిరెడ్డిల ఫిర్యాదు మేరకు తమ గ్రామానికి రాజుల వెంకట సుబ్బారెడ్డి, ఇంకా కొందరు నేతలు కలిసి మాజీమంత్రి అహ్మదుల్లాను, ఆయన కుమారుడు అష్రఫ్‌లను ఈనెల 28న గ్రామానికి పిలిపించి భారీగా, ర్యాలీ బహిరంగసభ నిర్వహించామన్నారు. ఆ కార్యక్రమం చూసి ఓర్వలేని వెంకటసుబ్బయ్య, అతని కుమారుడు వెంకటరమణలు తమపై దాడి చేశారని తెలిపారు. మేము.. మేం.. ఒక్కటే మేమే చూసుకుంటాం– మాజీ మంత్రి అహ్మదుల్లా ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారు రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా వచ్చారు. వెంకట సుబ్బయ్యను, చంద్రబాబు, రాం గంగిరెడ్డిలను పరామర్శించారు. అనంతరం మీడియాతో విషయం చెప్పేందుకు నిరాకరిస్తూనే... మేము మేమంతా ఒక్కటే... మేమే చూసుకుంటాం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంఘటనపై ఇరువర్గాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తెలిపారు. -
టీడీపీలో ప్రకంపనలు!
సాక్షి ప్రతినిధి కడప : టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తీవ్రతరమయ్యాయి. మాజీ మంత్రి అహమ్మదుల్లా కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకోవడాన్ని సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉండగా వేధించి అక్రమ కేసులు బనాయించిన నాయకున్నే అక్కున చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకున్నారు. పార్టీకి అండగా నిలిచిన కేడర్‌ను విస్మరించడంపై భగ్గుమంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. రాజధాని అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో మాజీ మంత్రిఅహమ్మదుల్లా, ఆయన తనయుడు అష్రపుల్లా టీడీపీలో చేరారు. సరిగ్గా అదే సమయంలో కడపలో మైనార్టీసెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమీర్‌బాబు ఇంట్లో టీడీపీ సీనియర్ నేతలంతా సమావేశమయ్యారు. పార్టీ ఉన్నతికి మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న వారిని కాదని, టీడీపీ కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు బనాయించిన వారిని ఎలా చేర్చుకుంటారంటూ నిలదీత చర్యలు తెరపైకి వచ్చాయి. అమీర్‌బాబు నేతృత్వంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు సుభాన్‌భాషా, బరకతుల్లా, ఇనాయతుల్లా, జింకాశ్రీను, బొమ్మిశెట్టి చంద్రశేఖర్, శాప్ మాజీ డైరెక్టర్ జయచంద్రలతోపాటు దాదాపు వివిధ హోదాల్లో ఉన్న 30 మంది సమావేశమయ్యారు. మాజీ మంత్రి అహమ్మదుల్లా కుటుంబం టీడీపీలో చేరడం వల్ల అదనపు ప్రయోజనమేమి లేదని పలువురు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ అధిష్టానం వైఖరిపై పలువురు బాహాటంగా విభేదించారు. యూజ్ అండ్ త్రో పాలసీ.. గతంలో టీడీపీ నాయకత్వం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అండగా ఉండేదని, ప్రస్తుతం యూజ్ అండ్ త్రో పాలసీతో వ్యవహరిస్తోందని కడప నగర టీడీపీ సీనియర్ నేతలు వాపోయారు. వ్యాపార కార్యకలాపాల్లో ఉన్న దుర్గాప్రసాద్‌ను పిలిచి గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ కేటాయించారని, తాజా రాజకీయాల నేపథ్యంలో ఆయన పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని వివరించారు. కడపలో నాయకత్వ కొరత లేకపోయినా అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏమిటని పలువురు నిలదీశారు. ఎమ్మెల్యే సీటు మైనార్టీలకు కేటాయిస్తే అమీర్‌బాబు లేదా సుభాన్‌బాషాల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలని కోరారు. బలిజ కమ్యూనిటీ కేటాయిస్తే దుర్గా ప్రసాద్ ఇవ్వాలని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే టీకెట్ ముస్లిం మైనార్టీలకు ఇస్తే, మేయర్ స్థానం బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయం జిల్లా నాయకత్వం ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, అధిష్టానం నిర్ణయాన్ని బట్టి చర్యలుండాలని ఎట్టి పరిస్థితుల్లో మాజీ మంత్రి అహమ్మదుల్లా కుటుంబానికి సహాకరించేదీ లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. టీడీపీ నేతలుగా ఉద్యమాలు చేసిన చరిత్ర తమకు ఉందని, అహమ్మదుల్లా కుటుంబానికి ప్రజల్లో పట్టుగానీ, ఉద్యమాలు చేసిన చరిత్ర కానీ లేదని, కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చర్మిషాతో గెలిచారని ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా అందలం ఎక్కించడం ఏమిటని పలువురు నిలదీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. డైలమాలో పుట్టా వర్గీయులు.. మైదుకూరు రాజకీయాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రోజుకో హాట్ టాఫిక్ తెరపైకి వస్తుండడంతో టీటీడీ చైర్మన్ మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ వర్గీయులు డైలమాలో పడ్డారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థిత్వం పట్ల పుట్టా సుధాకర్‌ను తిరస్కరించారని, ఆమేరకు సీఎం చంద్రబాబు రాజధానికి పిలిపించుకున్నారని, సీటు విషయం చర్చించారని గురువారం జోరుగా చర్చ నడిచింది. అదంతా ఒట్టి పుకారు మాత్రమే సీటు సుధాకర్‌యాదవ్‌దేనని అతని అనుచరులు కొట్టి పడేస్తున్నారు. మైదుకూరు చరిత్రలో టీడీపీ కోసం సుధాకర్‌యాదవ్ కష్టపడినట్లు మరెవ్వరూ కష్టపడలేదని, పార్టీని అన్నీవిధాలుగా బలోపేతం చేశారని, ఆయన్నే అధిష్టానం గుర్తిస్తోందని ఆయన అనుచరులు ఘంటా పథంగా చెబుతున్నారు. కాగా ఏదో అపశ్రుతి కల్గుతోందని ఎప్పుడూ లేని డైలమా తాజాగా పుట్టా వర్గీయులు ఉండిపోయిందనీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ
కడప : మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో సమైక్య శిబిరాన్ని సందర్శించిన ఆయనకు సోమవారం అవమానం ఎదురైంది. పదవులు పట్టుకుని వేళ్లాడే నేతలు ఎందుకు వచ్చారంటూ నినాదాలు చేశారు. నిరసనకారులు మంత్రికి చెప్పు చూపి నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆయన నిరసనకారులకు సర్ధి చెప్పారు. రాజీనామా చేయటానికి తాను సిద్ధమేనని తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు సోమవారం ముట్టడించారు. తక్షణమే మంత్రి పదవికి రఘువీరా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురం మున్సిపల్ ప్రాజెక్టు ఆఫీసర్ విజయ్ కుమార్ రాజీనామా చేశారు. కేబుల్ ఆపరేటర్లు హిందూపురంలో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. బెలుగుప్పలో సమైక్యాంధ్రకు మద్దతుగా 4 వేల మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాగా కర్నూలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట మంత్రి టీజీ వెంకటేష్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. అవుకులో సమైక్యవాదుల భారీ ర్యాలీ చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం బాధాకరమని, శాశ్వత ప్రాతిపదికన హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో మూడువేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఆళ్లగడ్డలో రవి అనే వికలాంగుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్యాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆళ్లగడ్డ నాలుగురోడ్ల సెంటర్లో ఉపాధ్యాయులు.... విద్యార్థులకు పాఠాలు చెప్పి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం రాజమండ్రిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాష్ట్రాన్ని విభజించొద్దని నినదిస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో మరో 72 గంటల పాటు మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద వారు మానవ హారం నిర్వహించారు. కాగా విజయవాడ సబ్ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు వాహనాలను తుడిచి నిరసన తెలిపారు.