వెంకట సుబ్బయ్యను పరామర్శిస్తున్న మాజీమంత్రి అహ్మదుల్లా
కడప అర్బన్: ఇటీవల టీడీపీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా, అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు లక్ష్మిరెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరు తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదం ప్రారంభమై.. వారు తలలు పగులగొట్టుకునేంత వరకు దారి తీసింది. తీవ్రంగా గాయపడిన వారు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
♦ టీడీపీ నేత లక్ష్మిరెడ్డి వర్గానికి చెందిన మజ్జారి వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 28న టీడీపీ నేతలు అహ్మదుల్లా, అతని కుమారుడు అష్రఫ్‌తో పాటు, తమ గ్రామానికి చెందిన రాజుల వెంకట సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, ఇంకా కొంతమంది కలిసి గ్రామంలో ర్యాలీ, సమావేశం నిర్వహించారన్నారు. ఆ కార్యక్రమానికి అహ్మదుల్లా, అతని కుమారుడు వచ్చి తనను పిలిచినా తాను వెళ్లలేదన్నాడు. అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని రామాలయం గోడలపై పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను సుబ్బారెడ్డితో పాటు, కొంతమంది వారి అనుచరులు ఏర్పాటు చేస్తుంటే తాము అభ్యంతరం తెలిపామన్నారు. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తమపై దాడికి పాల్పడ్డారని తెలిపాడు. దాడి చేసిన వారిలో రాజుల వెంకటసుబ్బారెడ్డి, ఆర్. రవీంద్రారెడ్డి, పోతుల భాస్కర్‌రెడ్డి, రాంగంగిరెడ్డి, చంద్రబాబుతో పాటు మరికొందరు ఉన్నారని పేర్కొన్నాడు. తనపై సుత్తి, ఇంకా కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నాడు.
♦ ఈ సంఘటనలో గాయపడిన మాజీ మంత్రి అహ్మదుల్లా, అష్రఫ్ వర్గానికి చెందిన, ఆనగొంది చంద్రబాబు పాలెంపల్లెకు చెందిన వ్యక్తి, రూకవారిపల్లెకు చెందిన రాం గంగిరెడ్డిల ఫిర్యాదు మేరకు తమ గ్రామానికి రాజుల వెంకట సుబ్బారెడ్డి, ఇంకా కొందరు నేతలు కలిసి మాజీమంత్రి అహ్మదుల్లాను, ఆయన కుమారుడు అష్రఫ్‌లను ఈనెల 28న గ్రామానికి పిలిపించి భారీగా, ర్యాలీ బహిరంగసభ నిర్వహించామన్నారు. ఆ కార్యక్రమం చూసి ఓర్వలేని వెంకటసుబ్బయ్య, అతని కుమారుడు వెంకటరమణలు తమపై దాడి చేశారని తెలిపారు.
మేము.. మేం.. ఒక్కటే మేమే చూసుకుంటాం– మాజీ మంత్రి అహ్మదుల్లా
ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారు రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా వచ్చారు. వెంకట సుబ్బయ్యను, చంద్రబాబు, రాం గంగిరెడ్డిలను పరామర్శించారు. అనంతరం మీడియాతో విషయం చెప్పేందుకు నిరాకరిస్తూనే... మేము మేమంతా ఒక్కటే... మేమే చూసుకుంటాం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంఘటనపై ఇరువర్గాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment