
కడప కోటిరెడ్డి, సి.రామచంద్రయ్య, ఎస్‌ఏ ఖలీల్‌బాషా, అహ్మదుల్లా
సాక్షి, కడప : జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లో గెలిచిన వారికే ఎక్కువసార్లు మంత్రి పదవులు లభించాయి. 1952లో ఇక్కడ గెలిచిన కడప కోటిరెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఎస్.రామమునిరెడ్డికి వెద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం లభించింది. 1985లో టీడీపీఅభ్యర్థిగా గెలుపొందిన సి.రామచంద్రయ్యకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా అవకాశం వచ్చింది. 1999లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎస్‌ఏ ఖలీల్‌బాషాను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా నియమించారు. 2009లో రెండవ పర్యాయం కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మదుల్లా గెలుపొందారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు మైనార్టీ సంక్షేమశాఖను అప్పగించారు. ఇలా ఐదుసార్లు కడప ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి.
అసలే దక్కని నియోజకవర్గాలు
రైల్వేకోడూరులో సరస్వతమ్మ, రాజంపేటలో బండారు రత్నసభాపతి, పసుపులేటి బ్రహ్మయ్య, బద్వేలులో బిజివేముల వీరారెడ్డి, మైదుకూరులో డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి, జమ్మలమడుగు నుంచి పి.శివారెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కమలాపురంలో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, పులివెందుల నుంచి పి.బసిరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలు మంత్రులుగా పనిచేశారు. రాయచోటి, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు ఇంతవరకు మంత్రి పదవులు దక్కలేదు.