కులాల్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయాలు చేయడంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మహాదిట్ట. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టులో చంద్రబాబు విసిరిన కులపాచిక మాత్రం పారలేదు.. సరికదా బెడిసికొట్టింది. ఈఎస్‌ఐ స్కాంలో చిక్కుకొన్న అచ్చెన్నాయుణ్ణి ఏదోఒక విధంగా కాపాడుకోకపోతే, తీగలాగితే డొంక కదిలినట్లు అనేక చీకటి విషయాలు వెలుగు చూస్తాయనే భయం చంద్రబాబును వెంటాడుతోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితుల్ని పరామర్శించబోతున్నట్లు ప్రచారం చేసుకుని కూడా మొహం చాటేసిన చంద్రబాబు.. అచ్చెన్నాయుడి ఉదంతంలో మాత్రం హుటాహుటిన గుంటూరు వెళ్లారు. ఈ అంశానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా నిజాలు వెళ్లగక్కవద్దన్న సంకేతాల్ని అచ్చెన్నాయుడికి పంపారు. ఈ స్కాంలో లోకేశ్ ప్రమేయం ఉందన్న వార్తలు బయటకొస్తున్నాయి. చంద్రబాబు హైరానా పడుతున్న కారణం అదే.
అచ్చెన్నాయుడు వెనుకబడిన తరగతుల కులానికి చెందినవారు కనుక.. బీసీలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పడదని, అందుకే కక్షతో అరెస్ట్ చేయించారన్నది చంద్రబాబు చేసిన అభియోగం. విశ్వసనీయతలేని ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నానాహంగామా సృష్టిం చాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ జరగగానే ఆయనను కిడ్నాప్ చేశారంటూ చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు. దానిని పలు చానళ్లు కొన్ని గంటలపాటు హోరెత్తించాయి. తీరా, అచ్చెన్నాయుడు ఇంట్లోకి పోలీసులు చట్టబద్ధంగానే ప్రవేశించి.. ఆయనతో మర్యాదగానే వ్యవహరించిన తీరును గమనించాక.. చంద్రబాబు అల్లిన కిడ్నాప్ కథ ఎంత అసత్యమో; చంద్రబాబు నిజాలను ఏవిధంగా వక్రీకరిస్తారో ప్రజలకు అర్థం అయ్యింది.
అసలు అచ్చెన్నాయుడిని ఓ కుల ప్రతినిధిగా పరిగణించడంలోనే చంద్రబాబు వక్రబుద్ధి బయటపడింది. అచ్చెన్నాయుడి అరెస్ట్ వ్యవహారంలో తాము ఆశించినట్లుగా కులం కార్డు పనిచేయలేదని గ్రహించగానే, వెనువెంటనే.. ప్లేటు మార్చారు. మరో కొత్త కథనాన్ని తెరపైకి తెచ్చారు. అచ్చెన్నాయుడి సోదరుడైన ఎర్రన్నాయుడు గతంలో తనకు వ్యతిరేకంగా ఓ కేసులో ఇంప్లీడ్ అయ్యారు కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వారి కుటుంబంపై ద్వేషం ఉందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. నిజానికి, 1999లో ఆనాడు ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కావడానికి టీడీపీకి అవకాశం వచ్చినా.. ఎర్రన్నాయుడుకు అవకాశం కల్పించాల్సి ఉంటుందనే ఏకైక కారణంతోనే చంద్రబాబు వాజ్‌పేయి ప్రతిపాదనను తిరస్కరించారన్న వాస్తవం ఎర్రన్నాయుడి కుటుంబసభ్యులకు తెలుసు. అనేక సందర్భాలలో ఎర్రన్నాయుడు తనకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోయేవారు. కానీ, 2014లో అవకాశం రాగానే ఎన్డీఏలో చేరడానికి బాబు ఉత్సాహపడిపోయారు.
సీనియర్ నేత అయిన కొనకళ్ల నారాయణకు అవకాశం ఇవ్వాల్సి ఉండికూడా ఆయనకు అన్యాయం చేసి.. ఆర్థిక నేరాల ఆరోపణలు ఉన్న సుజనాచౌదరికి మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ రెండు సందర్భాలలో బీసీ నేతలు కేంద్ర మంత్రులు కాకుండా అడ్డుకొన్నది ఎవరు? అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 33% పార్టీ టికెట్లు కేటాయిస్తానని 2007లో చంద్రబాబు నిర్వహించిన వరంగల్ బీసీ గర్జన సభలో ఓ డిక్లరేషన్ ప్రకటించారు. కానీ, 2009లో, 2014లో, 2019లో బీసీలకు 25% కూడా టికెట్లు కేటాయించలేకపోయారు. 2000లో తన క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న కృష్ణాయాదవ్‌పై నకిలీ స్టాంపుల కుంభకోణం ఆరోపణలు రాగానే.. క్షణాల మీద ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పుడు కృష్ణాయాదవ్‌ను చంద్రబాబు బీసీ నేతగా గుర్తించలేదా? కృష్ణాయాదవ్‌కు పార్టీ పరంగా కనీసం న్యాయ సహాయం కూడా అందించలేదు.
చంద్రబాబు మస్తిష్కం నిండా కుట్రలు, కుతంత్రాలు మాయోపాయాలే ఉంటాయి. ప్రజలు అధికారం ఇచ్చినపుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ ప్రజల ప్రయోజనాలు ఆయనకు ప్రాధాన్యతాంశాలుగా కనబడలేదు. 2014లో అధికారంలోకి వచ్చాక ఏకపక్షంగా బలహీన వర్గాల ప్రయోజనాల్ని కాలరాశారు. కొన్ని కులాలు, వర్గాల ప్రజలు తమకు చారిత్రకంగా జరిగిన సామాజిక అన్యాయాన్ని సరిదిద్దాలనే డిమాండ్లతో ఉద్యమబాట పడితే.. వారి న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించే బదులు వారి ఉద్యమాలను అణచివేశారు. ఆయా వర్గాలు తమ బాధలు చెప్పుకోవడానికి సచివాలయానికి వస్తే అవహేళన చేశారు. ఫలితంగానే.. ఆ వర్గాలన్నీ బాబుకు దూరమయ్యాయి. చంద్రబాబుకు ప్రజల బలీయమైన ఆకాంక్షలపట్ల అవగాహనలేదు. అధికారంలో ఉన్నపుడు చేసిన అన్యాయాలన్నీ చేసేసి ఇప్పుడు వైఎస్ జగన్‌ని బీసీలకు, ఎస్సీలకు, కాపులకు లేదా మరో వర్గానికో వ్యతిరేకం అని చంద్రబాబు చిత్రీకరించినంత మాత్రాన ఆ వర్గాల ప్రజలు నమ్ముతారా? గత యేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బడుగుబలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారులవుతున్నారు.. ఇది ఎవరో చెప్పడం కాదు.. వారికి అనుభవంలోకి వచ్చిన వాస్తవం.
చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకోగల సిద్ధహస్తులని ఆ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు తెలియని విషయమేమీ కాదు. మోత్కుపల్లి నర్సింహులు, జె.ఆర్. పుష్పరాజ్, వర్ల రామయ్య వంటి పార్టీ సీనియర్ నేతలకు ఇవ్వాల్సిన రాజ్యసభ పదవుల్ని బహిరంగ మార్కెట్‌లో వేలం వేసినట్లు పాట పాడుకొన్నారని ఆ పార్టీ నేతలకు తెలియనిది కాదు. ఎస్టీలకు, మైనార్టీలకు చంద్రబాబు ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లపాటు ప్రాతినిధ్యం లేకపోవడం ఆ వర్గాలకు తెలియదా? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బీసీ హోదా కోసం పోరాడిన కాపు నేతలకు జరిగిన అవమానాల్ని వారు సులభంగా మర్చిపోగలరా? ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ఎదుర్కొనే సత్తా, ధైర్యం చంద్రబాబుకు లేవు. కనుకనే.. బీజేపీకి దాసోహమై.. బీజేపీలోకి పంపిన తన మనుషుల ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించడానికి హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ కేంద్రంగా కుట్రలు చేయిస్తున్నారు.
పలు కీలక వ్యవస్థలలో చంద్రబాబు పెంచిపోషిస్తున్న వ్యక్తులు రాజకీయ ముసుగులు తగిలించుకొన్న శక్తులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి పనిచేస్తున్నాయి. ఎన్టీఆర్ హయాంలో.. గండిపేట మేధావులుగా పిలవబడిన కొందరు పార్టీ సిద్ధాంతకర్తలు.. ఎన్టీఆర్ పొరపాటు నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ఆయనను సవ్యదిశలో నడిపించేవారు. కానీ అదే పార్టీ నేడు లాబీయిస్టుల చేతుల్లోకి జారిపోవడమే విషాదం!
వ్యాసకర్త: సి. రామచంద్రయ్య, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment