కడప : మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో సమైక్య శిబిరాన్ని సందర్శించిన ఆయనకు సోమవారం అవమానం ఎదురైంది. పదవులు పట్టుకుని వేళ్లాడే నేతలు ఎందుకు వచ్చారంటూ నినాదాలు చేశారు. నిరసనకారులు మంత్రికి చెప్పు చూపి నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆయన నిరసనకారులకు సర్ధి చెప్పారు. రాజీనామా చేయటానికి తాను సిద్ధమేనని తెలిపారు.
మరోవైపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు సోమవారం ముట్టడించారు. తక్షణమే మంత్రి పదవికి రఘువీరా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురం మున్సిపల్ ప్రాజెక్టు ఆఫీసర్ విజయ్ కుమార్ రాజీనామా చేశారు. కేబుల్ ఆపరేటర్లు హిందూపురంలో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. బెలుగుప్పలో సమైక్యాంధ్రకు మద్దతుగా 4 వేల మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
కాగా కర్నూలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట మంత్రి టీజీ వెంకటేష్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. అవుకులో సమైక్యవాదుల భారీ ర్యాలీ చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం బాధాకరమని, శాశ్వత ప్రాతిపదికన హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో మూడువేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఆళ్లగడ్డలో రవి అనే వికలాంగుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్యాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆళ్లగడ్డ నాలుగురోడ్ల సెంటర్‌లో ఉపాధ్యాయులు.... విద్యార్థులకు పాఠాలు చెప్పి నిరసన తెలిపారు.
సమైక్యాంధ్ర కోసం రాజమండ్రిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాష్ట్రాన్ని విభజించొద్దని నినదిస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో మరో 72 గంటల పాటు మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద వారు మానవ హారం నిర్వహించారు. కాగా విజయవాడ సబ్ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు వాహనాలను తుడిచి నిరసన తెలిపారు.
మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ
Published Mon, Aug 5 2013 1:23 PM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement