ఫాక్స్ మెసేజ్‌లతో రుణమాఫీ ఆగుతుందా?
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు ఫ్యాక్స్ మెసేజ్లు పంపితే రుణమాఫీ ఆగుతుందా అని ఆయన ప్రశ్నించారు. చేతకానమ్మకు చేష్టలు మొండు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రఘువీరా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
రైతులపై బాబుకు కనికరం లేదా అని ఆయన ప్రశ్నించారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో రైతులు నలిగిపోతున్నారని, రాష్ట్రంలో 2003 పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని రఘువీరా అన్నారు. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని రఘువీరా అభిప్రాయపడ్డారు. రుణాలు కట్టొద్దని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారని, ఇప్పుడెందుకు రుణమాఫీ నుంచి జారుకుంటున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు, కేసీఆర్ల వైఖరిని రఘువీరా ఖండించారు. ఎంసెట్ వ్యవహారంలో రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఇద్దరు సీఎంలు తమ మంత్రులను అదుపులో ఉంచుకోవాలని రఘువీరా సూచించారు. ఎవరెవరికి ఫీజులు కట్టాలో రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా ఉందన్నారు. సమైక్య ఉద్యమంలో ధ్వంసమైన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు.