
ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ గంటన్నర పాటు ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, గవర్నర్‌కు లై డిటెక్టర్‌తో పరీక్షలు చేస్తేనే నిజాలు బయటికి వస్తాయని రఘువీరా వ్యాఖ్యానించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, రాజకీయ సానుభూతి కోసమే చంద్రబాబు తనపై దాడి జరిగిందంటున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌వి పగటికలలు..
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగిరిన చందంగా ఉందంటూ రఘువీరా రెడ్డి ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణా రాష్ట్రాన్నే అభివృద్ధి చేయలేకపోయిన కేసీఆర్.. ప్రధాని అయినట్లు పగటి కలలు కనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. 17మంది ఎంపీలతో భూకంపం ఎలా సృష్టిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
తెలుగువారు బీజేపీని ఓడించాలి..
ఆంధ్ర్రప్రదేశ్‌కు బీజేపీ తీరని అన్యాయం చేసిందన్న రఘువీరా.. కర్ణాటకలో తెలుగు మాట్లాడేవారంతా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న జేడీఎస్‌ను కూడా ఓడించాలన్నారు. ఈనెల 30 వ తేదీన కర్ణాటక తెలుగు వారితో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభతో బీజేపీ పతనానికి నాంది పలుకుతామని ఆయన తెలిపారు. గవర్నర్ రాజకీయ పనులు చేస్తున్నారని.. మజ్లిస్, టీడీపీలతో మాట్లాడి కర్ణాటకలో బీజేపీకి సహకరించాలని కోరుతున్న గవర్నర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తగా మారారని రఘువీరా ఆరోపించారు. గవర్నర్‌ను ఇప్పటికే బాయ్‌కాట్ చేశామని పేర్కొన్నారు. ఏపీలో వైఎస్సార్‌కు ఉన్న ఇమేజ్.. కర్ణాటకలో సిద్ధరామయ్యకు ఉందని.. గెలుపు సులభమేనని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment