Ahmed Mohamed
-
'అవమానించినందుకు రూ.100 కోట్లు ఇవ్వండి'
హ్యూస్టన్: తనను అరెస్టు చేసి అవమానించిన వారు దాదాపు రూ.వందకోట్లు (రూ.99,54,81,179.1)-(15 మిలియన్ డాలర్లు)) చెల్లించాలని, లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఎనిమిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ డిమాండ్ చేశాడు. అమెరికాలోని టెక్సాస్ లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడు సొంత తెలివి తేటలతో అలారం గడియారాన్ని తయారు చేసి స్కూల్ కి తీసుకురాగా దానిని బాంబు అనుకొని భ్రమపడి ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఆ విద్యార్థి ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యాడు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఆ బాలుడి తెలివి తేటలకు ముగ్దులై అతడిని కలిసేందుకు ఆహ్వానించారు కూడా. వైట్ హౌస్ ఇప్పటికే అతడిని సత్కరించింది. అయితే, ఖతార్ లోని ఓ ముస్లిం ఫౌండేషన్ ఆ విద్యార్థిని చదివించేందుకు ముందుకు రావడంతో అతడు త్వరలో అక్కడికి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసిన ఇర్వింగ్ సిటీ పోలీసులు, మేయర్ క్షమాపణలు చెప్పాలని పది మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించాలని, అలాగే, తనను తప్పుగా అర్థం చేసుకొని ఓ ముస్లిం విద్యార్థిపట్ల వివక్ష చూపించారని ఆరోపిస్తూ ఐదు మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించడంతో పాటు తనకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆ విద్యార్థి తరుపు న్యాయవాది సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించారు. -
ఆ 'బాంబ్' వాచ్ తిరిగొచ్చేసింది!
వాషింగ్టన్: మొత్తానికి అహ్మద్ మహమద్ చేతికి ఆ 'వాచ్' తిరిగొచ్చేసింది. 'బాంబ్' వాచ్‌గా పొరపడి.. 14 ఏళ్ల అహ్మద్ మహమద్ను సంకెళ్లలో నిలబెట్టిన వాచ్.. అతడి ఆవిష్కరణను మెచ్చి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల్లో ముంచెత్తిన 'వాచ్'.. ఎట్టకేలకు తన చేతుల్లోకి చేరింది. 'ఎట్టకేలకు నా వాచ్ నాకు దక్కిందోచ్' అంటూ అమెరికా ముస్లిం బాలుడు అహ్మద్ మహమద్ ట్వీట్ చేశాడు. అతడు గత నెలలో తాను సొంతంగా తయారుచేసిన 'వాచ్'ను పాఠశాలకు తీసుకురావడం.. దానిని 'బాంబ్'గా పొరపడి స్కూలు యాజమాన్యం ఆ బాలుడి చేతికి సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నిలుపడం తీవ్ర కలకలం సృష్టించింది. తన ఆవిష్కరణను స్కూలకు తీసుకొచ్చి.. ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను ఆశ్చర్యపరచాలని అహ్మద్ భావిస్తే.. అమెరికాలో ఉన్న 'ఇస్లామోఫొబియా'తో అతన్నో ఉగ్రవాదిగా చూసి.. ఆ 'వాచ్' లాక్కొన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాత్రికి రాత్రే.. అహ్మద్ ఘటన ఇంటర్నెట్లో సంచలనం అయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బాలుడికి సంఘీభావం ప్రకటించారు. అతడి ఆవిష్కరణను మెచ్చుకుంటూ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు ఆ వాచ్‌ను తీసుకొస్తావా? అని అడిగారు. అహ్మద్‌కి ఫేస్బుక్, గూగుల్, ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే అతడు న్యూయార్క్, సుడాన్, ఖతార్, మక్కాలో పర్యటించాడు. గతవారం కొందరు విద్యార్థులతో కలిసి అధ్యక్షుడు ఒబామను కలిశాడు. ఈ సందర్భంగా ఒబామాతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను ట్వీట్ చేశాడు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉండే అహ్మద్ మహమద్ ప్రవాసి సుడాన్‌కు చెందిన వ్యక్తి కొడుకు. ప్రపంచవ్యాప్తంగా అహ్మద్‌కు వెల్లువెత్తున్న మద్దతుతో సంతోషపడుతున్న తల్లిదండ్రులు.. అతని చదువును ఖతార్‌లో కొనసాగించాలని భావిస్తున్నారు. అతని పాఠశాల విద్య, అండర్ గ్రాడ్యుయేషన్‌కు పూర్తి స్కాలర్షిప్ అందించేందుకు ఖతార్ ముందుకొచ్చింది. అతన్ని ఖతార్ ఫౌండేషన్‌కు చెందిన యంగ్ ఇన్నోవేటర్స్ కార్యక్రమానికి ఎంపిక చేసింది. -
ఎనిమిదో తరగతిలోనే ఎంత అదృష్టం!
టెక్సాస్: అదృష్టం అంటే ఇదేనేమో. నిన్న మొన్నటి వరకు అతడో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ సాధారణ విద్యార్థి. కానీ అతడు చేసిన చిన్న ఆలోచన మొత్తం జీవితాన్నే మార్చేసింది. గొప్పగొప్పవారికి సైతం దక్కని అదృష్టం తరుముకుంటూ వెంటపడింది. ఏకంగా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మీటింగులు, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్వంటి మేథావులతో ఫోన్లో సంభాషణలు ఎవరికి ఉంటుందీ అదృష్టం. అది కాస్త మరింత పెరిగి ఇప్పుడు అతడి ఉన్నత విద్య కోసం ఏకంగా ప్రపంచంలోనే ధనిక గల్ఫ్ దేశమైన దుబాయ్‌లోని ఖతార్‌లో అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం టెక్సాస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న అతడి మిగితా విద్యాభ్యాసం ఖర్చంతా తమదే అంటూ ఖతార్‌లోని ఓ ముస్లిం సంస్థ ముందుకొచ్చింది. దీంతో అతడి కుటుంబమంతా కలిసి టెక్సాస్నుంచి ఖతార్‌కు బయలుదేరనున్నారు. అహ్మద్ మహ్మద్ అనే పద్నాలుగేళ్ల కుర్రాడు టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతడు ఈ ఏడాది ప్రారంభంలో సొంత తెలివితేటలతో ఓ అలారం గడియారాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే. దానిని తన టీచర్లకు చూపించాలనే ఉద్దేశంతో పాఠశాలకు తీసుకురాగా అది బాంబు అనుకుని భ్రమపడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి బేడీలు వేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేసి ఆ బాల మేధావి తెలివి తేటలకు ఒబామా, జూకర్ బర్గ్ ముగ్దులై పోయారు. గత రెండు రోజుల కిందట ఒబామా స్వయంగా వైట్ హౌస్‌కు ఆహ్వానించి మర్యాదలు కూడా చేశారు. దీంతో దుబాయ్‌లోని ఓ ముస్లిం సంస్థ తమ కమ్యూనిటికి చెందిన విద్యార్థులను మరింత పురోగతిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఖతార్‌లో విద్యాభ్యాసం పూర్తి చేయించేందుకు ఆహ్వానించింది.