ఆ 'బాంబ్' వాచ్ తిరిగొచ్చేసింది!
వాషింగ్టన్: మొత్తానికి అహ్మద్ మహమద్ చేతికి ఆ 'వాచ్' తిరిగొచ్చేసింది. 'బాంబ్' వాచ్‌గా పొరపడి.. 14 ఏళ్ల అహ్మద్ మహమద్‌ను సంకెళ్లలో నిలబెట్టిన వాచ్.. అతడి ఆవిష్కరణను మెచ్చి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల్లో ముంచెత్తిన 'వాచ్'.. ఎట్టకేలకు తన చేతుల్లోకి చేరింది. 'ఎట్టకేలకు నా వాచ్ నాకు దక్కిందోచ్' అంటూ అమెరికా ముస్లిం బాలుడు అహ్మద్ మహమద్ ట్వీట్ చేశాడు. అతడు గత నెలలో తాను సొంతంగా తయారుచేసిన 'వాచ్'ను పాఠశాలకు తీసుకురావడం.. దానిని 'బాంబ్'గా పొరపడి స్కూలు యాజమాన్యం ఆ బాలుడి చేతికి సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నిలుపడం తీవ్ర కలకలం సృష్టించింది.
తన ఆవిష్కరణను స్కూలకు తీసుకొచ్చి.. ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను ఆశ్చర్యపరచాలని అహ్మద్ భావిస్తే.. అమెరికాలో ఉన్న 'ఇస్లామోఫొబియా'తో అతన్నో ఉగ్రవాదిగా చూసి.. ఆ 'వాచ్' లాక్కొన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాత్రికి రాత్రే.. అహ్మద్ ఘటన ఇంటర్‌నెట్‌లో సంచలనం అయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బాలుడికి సంఘీభావం ప్రకటించారు. అతడి ఆవిష్కరణను మెచ్చుకుంటూ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు ఆ వాచ్‌ను తీసుకొస్తావా? అని అడిగారు. అహ్మద్‌కి ఫేస్‌బుక్, గూగుల్, ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే అతడు న్యూయార్క్, సుడాన్, ఖతార్, మక్కాలో పర్యటించాడు.
గతవారం కొందరు విద్యార్థులతో కలిసి అధ్యక్షుడు ఒబామను కలిశాడు. ఈ సందర్భంగా ఒబామాతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను ట్వీట్ చేశాడు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉండే అహ్మద్ మహమద్ ప్రవాసి సుడాన్‌కు చెందిన వ్యక్తి కొడుకు. ప్రపంచవ్యాప్తంగా అహ్మద్‌కు వెల్లువెత్తున్న మద్దతుతో సంతోషపడుతున్న తల్లిదండ్రులు.. అతని చదువును ఖతార్‌లో కొనసాగించాలని భావిస్తున్నారు. అతని పాఠశాల విద్య, అండర్ గ్రాడ్యుయేషన్‌కు పూర్తి స్కాలర్‌షిప్ అందించేందుకు ఖతార్ ముందుకొచ్చింది. అతన్ని ఖతార్ ఫౌండేషన్‌కు చెందిన యంగ్ ఇన్నోవేటర్స్ కార్యక్రమానికి ఎంపిక చేసింది.