ఏఎన్-32 విమానం గల్లంతు: శకలాల వెలికితీత
సాక్షి ప్రతినిధి, చెన్నై: గత నెల గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ కోసం గాలిస్తున్న నౌకా సిబ్బందికి బుధవారం బంగాళాఖాతంలో 54 వస్తువులు దొరికాయి. ఈ వస్తువులు అదృశ్యమైన విమానానికి చెందిన శకలాలేనా! అనే కోణంలో పరిశీలన సాగుతోంది.
భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం చెన్నై తాంబరంలోని ఎయిర్‌బేస్ నుంచి పోర్టుబ్లెయిర్‌కు పయనమైన కొద్దిసేపటికే గల్లంతైన విషయం విదితమే. గల్లంతైన విమానంలో సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. విమానం గల్లంతై నేటికి(బుధవారం నాటికి) 35 రోజులైనా ఆచూకీ దొరకలేదు. సముద్ర రత్నాకర్ అనే అత్యాధునికమైన నౌక ద్వారా కొన్ని రోజులుగా గాలింపు చర్యలు సాగుతున్నాయి.
సముద్రానికి ఐదువేల మీటర్ల లోతుకు దృశ్య, శ్రవణ యంత్రాన్ని పంపడం ద్వారా విమానాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుండగా సముద్రం అడుగు భాగం నుంచి ఈ నౌక 54 వస్తువులను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ వస్తువులు గల్లంతైన విమానానికి చెందిన శకలాలేనా అని పరిశోధిస్తున్నారు. ప్రమాదం జరిగి నెలరోజులు కావడంతో బ్లాక్‌బాక్స్ పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్‌బాక్స్ దొరికిన పక్షంలో గల్లంతయ్యే ముందు పరిస్థితులు, పెలైట్ చివరి మాటలు, ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఆశించారు. బ్లాక్‌బాక్స్ కూడా పనిచేయకపోవడంతో దానిని కనుగొనడం కష్టసాధ్యమని అధికారులు నిరాశను వెలిబుచ్చారు.