వారణాసిలో మోడీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఢీ
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తలపడే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడింది. స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాయ్‌ని కాంగ్రెస్ తన అభ్యర్థిగా మోడీపై బరిలోకి దించింది. పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జీవాలా మంగళవారమిక్కడ ఈ విషయం తెలిపారు.
వారణాసిలో మోడీపై పోటీ చేస్తామని దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, రషీద్ అల్వీలు ముందుకొచ్చినా పార్టీ స్థానిక నేతపైనే మొగ్గుచూపింది. పింద్రా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అజయ్ క్షేత్రస్థాయిలో పనిచేశారని, సోనియా గాంధీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని సూర్జీవాలా చెప్పారు. అజయ్ 1996, 2002, 2007ల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో మరుసటి ఏడాది పార్టీని వదిలేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి.