తెలంగాణ ఆదర్శం: వాయువేగాన ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటం, పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో బాధితులు చనిపోతుండటం నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆస్ప త్రుల్లో ఆక్సిజన్ కొరత లేకపోయినా.. మున్ముందు పరిస్థితులు విషమిస్తే ఎలాగన్న ఆలోచనతో చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒడిశాలోని ప్లాంట్ల నుంచి మన రాష్ట్రానికి కేటాయించిన లిక్విడ్ ఆక్సిజన్‌ను ఎయిర్‌ఫోర్స్ సహాయంతో వేగంగా దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో తొమ్మిది ఆక్సిజన్ ట్యాంకర్లను హైదరాబాద్ నుంచి ఒడిశాకు పంపారు. అవి అక్కడ ఆక్సిజన్ నింపుకొని ఈ నెల 27వ తేదీలోగా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి ట్యాంకర్లను ఒడిశాకు పంపే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.
రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నామని, ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొరత రాలేదని మంత్రి ఈటల చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు అధిక విలువ ఇస్తోందని, ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా.. రాష్ట్రానికి దాదాపు 400 టన్నుల ఆక్సిజన్ కావాల్సి ఉండగా.. కేంద్రం 250-270 టన్నుల మేర ఆక్సిజన్ కేటాయించిందని అధికారవర్గాలు తెలిపాయి. ఖాళీ ట్యాంకర్లు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి రావడానికి వారం, పది రోజులకుపైగా పడుతుందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ రాగానే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అవసరమైన మేరకు సరఫరా చేయనున్నారు. వైమానిక దళం వింగ్ కమాండర్ చైతన్య నిఝవాన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ట్యాంకర్ల తరలింపు పని చేపడుతున్నారు. ఎయిర్‌ఫోర్స్ విమానాల ద్వారా ఆక్సిజన్ రప్పించేందుకు రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, సర్ఫరాజ్ అహ్మద్, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతీ మీనా కృషి చేశారని ప్రభుత్వం వివరించింది.
సచివాలయ సందర్శకులపై ఆంక్షలు
రాష్ట్ర సచివాలయంలో కరోనా బారినపడుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడంతో.. ప్రభుత్వం సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తాత్కాలిక పాసులు, రోజువారీ పాసులు తీసుకుని సచివాలయంలోకి వచ్చే సందర్శకులను ఇకపై అనుమతించరు. ఆ పాసులను సస్పెండ్ చేశారు. సచివాలయంలోకి రావాలనుకునేవారు ముందుగా సంబంధిత అధికారి అనుమతి తీసుకుని, ఆ అధికారి వద్దకు మాత్రమే వచ్చి వెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సచివాలయంలోని ఇతర సెక్షన్లు, అధికారుల దగ్గర వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు.