వాయుసేనలోకి భారీ రవాణా విమానం
న్యూఢిల్లీ: వాయుసేన రవాణా సామర్థ్యం మరింత పటిష్టం కానుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్‌క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సెప్టెంబర్ 2న వైమానికదళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ రాజధానిలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో వీటి సేవలను ఆయన ప్రారంభిస్తారు. వాయుసేన 81వ స్క్వాడ్రన్‌లో చేర్చనున్న సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సుమారు రూ.20,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాదాపు 80 టన్నుల లోడ్‌ను ఇవి మోసుకెళ్లగలవు. రష్యా నుంచి కొనుగోలు చేసిన --76 స్థానంలో వీటిని ప్రవేశపెడతారు.
భారత వైమానిక దళంలో ఇప్పటివరకు ఇవే భారీ రవాణా విమానాలు. --76 విమానాలు 40 టన్నుల బరువును మోయగలవు. 2011లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం పది సీ-17 విమానాల సరఫరాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 3 విమానాలను అందచేయగా వచ్చే ఏడాది చివరినాటికి మిగతావి సరఫరా కానున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో వీటి ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు.