Aircraft design
-
జంబో హోటల్..
ఇది జంబో హోటల్. విమానం డిజైన్‌లో కట్టినది కాదు. ఇది నిజమైన విమానమే.. ఎన్నో ఏళ్లపాటు సేవలందించిన ఈ 747-200 జెట్లైనర్కు 2008లో రిటైర్మెంట్ ఇచ్చేశారు. అది ఎప్పుడూ దిగే రన్‌వే పైనే.. దాన్ని హోటల్‌గా మార్చేశారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంకు సమీపంలో అర్లాండా ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఈ జంబో హోటల్ ఉంది. ప్రస్తుతం ఈ రన్‌వేను ఉపయోగించడం లేదు. ఇందులో సింగిల్, డబుల్ బెడ్రూంలు ఉన్నాయి. కాక్‌పిట్‌లో లగ్జరీ రూంను ఏర్పాటు చేశారు. పై అంతస్తులోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను కేఫ్ కింద మార్చేశారు. ప్రతీ రూంలో ఒక ఎల్ఈడీ టీవీ ఉంటుంది. ఈ జంబో హోటల్లో ఎక్కువగా విమాన ప్రయాణికులే ఉంటారు. తర్వాతి రోజు ఉదయం ఫ్లైట్ ఉన్నవాళ్లు ఇక్కడ రాత్రి బస చేస్తుంటారు. -
కిటికీలు లేని విమానం..
ఇదో ప్రైవేటు జెట్ డిజైన్. ఇందులో కిటికీలు ఉండవు. అయితే.. చిత్రంలో కనిపిస్తున్నట్లు ఇదేదో అద్దాలతో రూపొందించిన విమానం డిజైన్ కూడా కాదు. దీనికి వాడేది రెగ్యులర్ మెటీరియల్‌నే.. అయితే.. విమానానికి బయట ఉండే కెమెరాలు చుట్టూ ఉండే దృశ్యాలను లోపల ఉండే క్యాబిన్ గోడలు, సీలింగ్‌పై టెలికాస్ట్ చేస్తాయన్నమాట. దీని వల్ల మనకు పారదర్శకమైన విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ డిస్ప్లే ప్యానెళ్లను వీడియో కాన్ఫరెన్స్ కోసం లేదా ఫొటో ఆల్బమ్స్ వంటివి చూసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. లేదా కంప్యూటర్ డెస్క్టాప్పై పెట్టుకున్నట్లు ఓ మంచి వాల్‌పేపర్‌ను పెట్టుకోవచ్చు. ఈ డిజైన్‌ను ఫ్రాన్స్‌కు చెందిన టెక్నికాన్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న ఈ డిజైన్‌పై విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయట.