ఆ ఎంపీకి ఇక రైలు లేదా బస్సే గతి!
ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తూ.. కేబిన్ సిబ్బందిలో ఒకరిని 25 సార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ను వరుసపెట్టి విమానయాన సంస్థలన్నీ బహిష్కరిస్తున్నాయి. ఆయనను తమ విమానాల్లో ఇక ఎక్కించుకునేది లేదని ఇప్పటికే పలు సంస్థలు ప్రకటించాయి. సంఘటన జరిగిన ఎయిరిండియాతో పాటు విస్తారా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్ లాంటి సంస్థలు ఆయనను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదని స్పష్టం చేశాయి. ఆయన నుంచి తాము క్షమాపణలు కోరేది లేదని.. అలా చేస్తే ఆయనను మళ్లీ విమానాల్లోకి అనుమతించాల్సి వస్తుందని ఎఫ్ఐఏ తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల విమానానికి గైక్వాడ్ బుక్ చేసుకున్న టికెట్‌ను ఎయిరిండియా రద్దుచేసింది. దాంతో ఆయన సాయంత్రం 5.50 గంటలకు ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే.. ఇండిగో కూడా ఆయన టికెట్‌ను రద్దుచేసి, చార్జీలను తిరిగి ఇచ్చేసింది.
దాంతో ఇప్పుడు ఆయన రైలు లేదా బస్సు ఎక్కాల్సిందేనని.. కాదంటే సొంతంగా ప్రైవేటు విమానం బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. దాదాపుగా విమానయాన సంస్థలన్నీ కూడా రవీంద్ర గైక్వాడ్ తమ విమానాలలో ప్రయాణించేందుకు వీల్లేకుండా నిషేధం విధించడంతో మరికొన్ని సంస్థలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎయిర్ ఏషియా లాంటి సంస్థలు కూడా తమకు సంఘీభావంగా ఉంటాయని భావిస్తున్నట్లు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.
సుకుమార్ (60) అనే ఎయిరిండియా సిబ్బందిని 25 సార్లు చెప్పుతో కొట్టినట్లు స్వయంగా చెప్పిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గైక్వాడ్ లాంటి వాళ్లకు విమానంలోనే బేడీలు వేసే అవకాశం కూడా ఉంది. కాకపోతే సరిగ్గా విమానం దిగే సమయంలో ఇది జరగడంతో అలా చేయలేదు. తమ సిబ్బందిలో ఎవరి మీద దాడి జరిగినా అది తామందరి మీద దాడిలాగే భావిస్తామని ఎయిరిండియా అధికారులు అంటున్నారు. ఇక మీదట కూడా ఇలా దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల జాబితాతో ఒక 'నో ఫ్లై' జాబితాను తయారుచేస్తామని, వాళ్లను విమానాల్లోకి అనుమతించబోమని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్లను నియంత్రించాలని కోరుతున్నారు.