airport employee
-
రోడ్డు ప్రమాదంలో ఎయిర్‌పోర్టు ఉద్యోగిని దుర్మరణం
అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం): షీలానగర్ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎయిర్‌పోర్టు ఉద్యోగిని దుర్మరణం చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తండ్రి షిప్‌యార్డు ఉద్యోగి జెర్రిపోతుల రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం... షిప్‌యార్డు క్వార్టర్స్‌లో నివసిస్తున్న జెర్రిపోతుల రామ్మోహన్రావు కుమార్తె జెర్రిపోతుల హారిక (28) విశాఖ ఎయిర్‌పోర్టులో కస్టమర్ ఎయిర్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం ఆమెను ఎయిర్‌పోర్టులో దించేందుకు తండ్రి రామ్మోహన్రావు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 11 గంటల సమయంలో షీలానగర్ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న డివైడర్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇరువురు తూలి రోడ్డుపై పడిపోవడంతో రామ్మోహన్‌రావుకు స్వల్ప గాయాలవగా హారిక తలకు బస్సు టైరు తాకింది. యూనిఫాం ద్వారా ఆమె ఎయిర్‌పోర్టు ఉద్యోగి అని గుర్తించిన సహోద్యోగులు విమానాశ్రయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న గాజువాక ఎస్ఐ రమేష్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగం కంటే మంచిదాని కోసం మద్రాస్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఇంటర్వ్యూకు హారిక వెళ్లాల్సి ఉందని.., ఇంతలో ఈ లోకాన్నే వీడి వెళ్లిపోయిందని మృతురాలి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హారికకు వివాహమై భర్త ఉన్నారు. -
మామిడిపండ్లు దొంగిలించాడని దేశ బహిష్కరణ
దుబాయ్ : మామిడిపండ్లు దొంగతనం చేసినందుకు ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికుడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. సదరు వ్యక్తి వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి దుబాయి ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీలను కంటెయినర్ నుంచి కన్వేయర్ బెల్ట్‌లోకి ఎక్కించడం.. అక్కడి నుంచి కిందకు దించడం అతడి పని. 2017 ఆగస్టు 11న ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహిస్తోన్న సమయంలో అతడికి బాగా దాహం వేయడంతో ఒక ప్రయాణికుడికి చెందిన బాక్సు నుంచి రెండు మామిడిపండ్లను దొంగలించాడు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. తాను ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆకలి వేసిందని, దాంతో పాటు బాగా దాహం వేయడంతో రెండు మామిడి పండ్లు దొంగతనం చేశానని చెప్పడంతో పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు. కాగా సోమవారం ఈ కేసును దుబాయ్‌కు చెందిన పస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు విచారించి తమ తుది తీర్పును వెల్లడించింది. అతనికి 5000 దిర్హామ్‌ల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ విధించింది. కాగా, ఈ తీర్పుపై 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం అతడికి ఉంటుంది. -
ఎయిర్పోర్ట్ ఉద్యోగి క్రిస్మస్ విషెస్.. వైరల్
సిడ్నీ: ఏదైనా వినూత్నంగా చేస్తేనే గుర్తింపు లభిస్తోంది. ఇలానే వినూత్నంగా ఆలోచించి వార్తల్లో నిలిచింది ఓ ఎయిర్పోర్ట్ ఉద్యోగి. అసలే క్రిస్మస్ పండుగ.. విమానాశ్రయంలో ప్రయాణీకులు అందరూ తమ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇంతలో అక్కడి ఉద్యోగిని తన చక్కటి స్వరంతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ పాట పాడింది. దీంతో ప్రయాణీకులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని ఓ విమానాశ్రయంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెకెర్ ఐల్యాండ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రిచార్డ్ బ్రాన్సన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే 5.8 లక్షల మందికిపైగా వీడియోను చూడగా 67,000 మంది లైక్ కొట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఆనందకర వాతావరణాన్ని సృష్టించినందుకు నెటిజన్లు సిబ్బందిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ప్రేమను అన్ని చోట్ల వ్యాప్తింపజేయాలని కొందరు కోరారు. మరికొందరేమో ఆమె స్వరం బాగుందని మెచ్చుకున్నారు. ఎయిర్పోర్ట్ ఉద్యోగి క్రిస్మస్ విషెస్.. వైరల్ -
సహజీవనం చేసి.. ముఖం చాటేశాడు!!
పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనను నమ్మించి రెండేళ్ల పాటు తనతో సహజీవనం చేసిన సహోద్యోగి... చివరకు మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తనకు న్యాయం చేయాలని ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం గుజరాత్ రాష్ట్రానికి చెందిన యువతి ఇక్కడకు వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తోంది. ఇదే ఎయిర్‌పోర్టులోని మరో విభాగంలో పనిచేస్తున్న గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన పాల్ అంబేద్కర్ నిన్ను ప్రేమిస్తున్నానంటూ గుజరాత్ యువతి వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించడంతో ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. అయితే పాల్ అంబేద్కర్ ఇప్పుడు మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. తాను అతడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చానని, అన్ని రకాలుగా సాయం చేశానని, కానీ ఇప్పుడు మొత్తం మారిపోయాడని ఆరోపించింది. మనమధ్య ఉన్న శారీరక సంబంధం విషయాన్ని కూడా ఎవరికీ చెప్పొద్దన్నట్లు తెలిపింది.