రోడ్డు ప్రమాదంలో ఎయిర్‌పోర్టు ఉద్యోగిని దుర్మరణం | Airport employee Died In Road Accident At Visakhapatnam | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎయిర్‌పోర్టు ఉద్యోగిని దుర్మరణం

Published Wed, Mar 30 2022 9:49 AM | Last Updated on Wed, Mar 30 2022 9:53 AM

Airport employee Died In Road Accident At Visakhapatnam - Sakshi

అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం): షీలానగర్‌ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎయిర్‌పోర్టు ఉద్యోగిని దుర్మరణం చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తండ్రి షిప్‌యార్డు ఉద్యోగి జెర్రిపోతుల రామ్మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం... షిప్‌యార్డు క్వార్టర్స్‌లో నివసిస్తున్న జెర్రిపోతుల రామ్మోహన్‌రావు కుమార్తె జెర్రిపోతుల హారిక (28) విశాఖ ఎయిర్‌పోర్టులో కస్టమర్‌ ఎయిర్‌ ఇండియా సర్వీసెస్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం ఆమెను ఎయిర్‌పోర్టులో దించేందుకు తండ్రి రామ్మోహన్‌రావు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

ఉదయం 11 గంటల సమయంలో షీలానగర్‌ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న డివైడర్‌ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన ఆర్‌టీసీ బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇరువురు తూలి రోడ్డుపై  పడిపోవడంతో రామ్మోహన్‌రావుకు స్వల్ప గాయాలవగా హారిక తలకు బస్సు టైరు తాకింది. యూనిఫాం ద్వారా ఆమె ఎయిర్‌పోర్టు ఉద్యోగి అని గుర్తించిన సహోద్యోగులు విమానాశ్రయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న గాజువాక ఎస్‌ఐ రమేష్‌ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగం కంటే మంచిదాని కోసం మద్రాస్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఇంటర్వ్యూకు హారిక వెళ్లాల్సి ఉందని.., ఇంతలో ఈ లోకాన్నే వీడి వెళ్లిపోయిందని మృతురాలి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హారికకు వివాహమై భర్త ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement