
సహజీవనం చేసి.. ముఖం చాటేశాడు!!
పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనను నమ్మించి రెండేళ్ల పాటు తనతో సహజీవనం చేసిన సహోద్యోగి... చివరకు మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తనకు న్యాయం చేయాలని ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం గుజరాత్ రాష్ట్రానికి చెందిన యువతి ఇక్కడకు వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తోంది.
ఇదే ఎయిర్‌పోర్టులోని మరో విభాగంలో పనిచేస్తున్న గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన పాల్ అంబేద్కర్ నిన్ను ప్రేమిస్తున్నానంటూ గుజరాత్ యువతి వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించడంతో ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. అయితే పాల్ అంబేద్కర్ ఇప్పుడు మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. తాను అతడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చానని, అన్ని రకాలుగా సాయం చేశానని, కానీ ఇప్పుడు మొత్తం మారిపోయాడని ఆరోపించింది. మనమధ్య ఉన్న శారీరక సంబంధం విషయాన్ని కూడా ఎవరికీ చెప్పొద్దన్నట్లు తెలిపింది.