శంషాబాద్ రూరల్: తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో వివాహితపై పెట్రోలు పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తొండుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలోని కిషన్‌గూడ వాసి బంటారం మహేశ్‌గౌడ్, మండలంలోని గండిగూడకు చెందిన సంధ్య(29) వివాహం 2012లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొండుపల్లిలో నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవలు జరగడంతో పిల్లలతో కలిసి సంధ్య గండిగూడలోని పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో వీరింటి పక్కన నివాసముండే మహ్మద్ అల్తాఫ్‌తో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కొంత కాలం తర్వాత సంధ్య భర్త వద్దకు వెళ్లిపోయింది.
పెళ్లి చేసుకోవాలని వేధింపులు..
ఈ క్రమంలో తొండుపల్లిలో ఉంటున్న సంధ్యకు తరచూ అల్తాఫ్ ఫోన్ చేస్తూ వేదిస్తున్నాడు. తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇటీవలే ఈ విషయాన్ని సంధ్య తన భర్తకు తెలిపింది. సంధ్య తన మాట వినడంలేదని కక్షగట్టిన అల్తాఫ్ ఆమెను ఎలాగైనా అంతం చేయాలని భావించాడు. ఇందుకోసం పథకం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సంధ్య భర్త మహేశ్‌కు అల్తాఫ్ ఫోన్ చేశాడు. తాను తొండుపల్లి వద్ద వైన్‌షాపు దగ్గర ఉన్నానని, మాట్లాడుకుందాం.. అక్కడకు రావాలని చెప్పాడు.
దీంతో మహేష్ ఇంటి నుంచి వైన్‌షాపు వద్దకు వెళ్లాడు. దీంతో సంధ్య ఇంట్లో ఒక్కతే ఉందని గుర్తించి అక్కడకు వెళ్లిన అల్తాఫ్.. తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోలును సంధ్యపై పోసి నిప్పటించాడు. దీంతో పాటు తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన సంధ్యను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అల్తాఫ్‌కు స్వల్పగాయాలవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడుపై నేర చరిత్ర..
వివాహితపై పెట్రోలు పోసి నిప్పటించిన అల్తాఫ్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట వలస వచ్చి గండిగూడలో స్థిరపడ్డారు. సుమారు 8 ఏళ్ల కిందట అల్తాఫ్ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అల్తాఫ్, తన అన్నతో కలిసి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత అల్తాఫ్ కుటుంబ గండిగూడ నుంచి ఘాంసిమియాగూడకు మకాం మార్చింది.
చదవండి: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం
Comments
Please login to add a commentAdd a comment