సహారన్‌పుర్‌లో శాంతి.. రాంపూర్‌లో హింస!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో కొంతమేరకు శాంతి నెలకొనగా.. మరో పట్టణం రాంపూర్ రాజుకుంది. యూపీ మంత్రి ఆజంఖాన్ సొంత పట్టణం, రాంపూర్ దగ్గరలోని మెహందీపూర్ గ్రామంలో సోమవారం అకస్మాత్తుగా హింస చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక బైక్ ఒక వ్యక్తిని ఢీకొనడంతో చిన్నగా ప్రారంభమైన వివాదం హింసాత్మకమై పరస్పర కాల్పులకు దారితీయడంతో ముగ్గురు చనిపోయారు. సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, శనివారం హింస ప్రజ్వరిల్లిన సహారన్‌పుర్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
అయినా, అక్కడి పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సోమవారం అధికారులు 4 గంటల పాటు కర్ఫ్యూని సడలించారు. మరోవైపు, సహారన్‌పుర్ ఘటనపై బురద జల్లుకునే కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు యూపీలో ‘గుజరాత్ మోడల్’ను అనుసరించాలంటూ వివాదాస్పద ట్వీట్ చేసిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రవి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. గుజరాత్ మోడల్ అంటే తన ఉద్దేశం మతోద్రేకాలు రెచ్చగొట్టడం కాదన్నారు.