AK Prabhakar
-
స్టాక్స్ కొనడానికి అదే బెస్ట్ టైం..!
-
కతలు వెతల ‘రణస్థలి’
కవులేం చేస్తారు? రచయితలారా మీరెటువైపు? ప్రశ్నలు పాతవే. కానీ కాలం పురుటి నొప్పులు పడ్డ ప్రతి రక్తసిక్త సందర్భంలోనూ యీ ప్రశ్నలు మొలుస్తూనే వున్నాయి. కల్బుర్గి హత్య కావొచ్చు, పెరుమాళ్ మురుగన్ మీద అమలైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలు కావొచ్చు... ఆయా సంఘటనలు జరిగిన తర్వాత పాత ప్రశ్నలే సుళ్లు తిరిగాయి. మనమేం చెయ్యాలో సంఘటనల గీటురాయి మీద పరీక్షించుకోవాల్సిన సందర్భం వచ్చింది. సాహిత్య లోకాన్నే కాదు మొత్తం సమాజాన్నే కుదిపిన రోహిత్ వేములను ఆవాహన చేసుకొని తీక్షణంగా కవిత్వం వెల్లువెత్తింది. ఆ వేడి చల్లారక ముందే కథలూ వచ్చాయి. అయితే యిటువంటి సంఘటనల్ని ఆధారం చేసుకుని వెనువెంటనే వెలువడే సాహిత్యంలోని మంచి చెడ్డల గురించీ, కళాత్మక విలువల గురించీ అదే సందర్భంలో వాదోపవాదాలూ జరిగాయి. జరిగిన సంఘటనపై కయి గట్టేసి కత అల్లేసి బాధ్యత తీరిపోయిందని రచయితలు భావిస్తున్నారని కొందరు ఎత్తిపొడిచారు. సామాజిక సమస్యల పరిష్కారాల గురించి ఆలోచించే పని రచయితలది కాదని నిర్ధారించారు. అంతిమంగా కళ కళ కోసమేనని మరోసారి తీర్మానించారు. సరిగ్గా యీ తరహా వాదనలకు సమాధానం వెతుకుతోన్న రోజుల్లోనే బమ్మిడి జగదీశ్వర రావు (బజరా) ‘కతలు వెతలు’ వొక దారిని చూపాయి. మన చుట్టూ జరుగుతోన్న సంఘటనలపై అల్లిన పీరియాడికల్ స్టోరీస్ని ఆల్ టైమర్ కథలుగా మలచడంలో అతను నిర్మించుకొన్న శిల్పం శుద్ధ కళావాదులకు కనువిప్పు. నిర్దిష్ట స్థలకాలాదుల్ని అధిగమించి కథని తాత్విక స్థాయికి తీసుకెళ్లి సార్వత్రికం చేసిన అతని నేర్పు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలిని గుర్తుచేసింది. ‘నా వూపిరి మీద నిఘా పెట్టినంత కాలం... నేను యేమి తినాలో తాగాలో నువ్వే మెనూ యిచ్చినంత కాలం... నా అస్తిత్వం నువ్వైనంత కాలం... నీ మతం నీదై నా అభిమతం పట్టనంత కాలం... అదెంత కాలమైనా నా పాట నేను పాడుతూనే వుంటాను!’ జరుగుతోన్న సంఘటనల పట్ల బజరా స్పందనే యిది. తాను స్పందించడమే కాదు ఆ స్పందనతో అనివార్యంగా మనల్నీ ప్రతిస్పందించేలా చేస్తాడు. ∙∙l స్త్రీలపై అమలవుతున్న సామాజిక హింస రాజ్య హింస గృహ హింసలు స్వరూపంలోనే వేరు కానీ స్వభావంలో వొక్కటే అని యీ కథలు చదువుతుంటే బలంగా అనిపిస్తుంది. మూలాల్ని అన్వేషించి ఖండించే పనిలో బమ్మిడి యెక్కడా తడబడలేదు. మూడింటినీ మానవ హక్కుల వుల్లంఘనగానే గ్రహించాడు. ‘శృతి తప్పని కథ’లో ‘ఆడాళ్లని అణచివేయడమంటే అత్యాచారాలు చేయడమేనా నాన్నా..’ అని శృతి అడిగిన ప్రశ్న ద్వారా, ‘నేల నొప్పులు’లో ‘రాజధానికి పునాదిల రాళ్లూ యిసకా వున్నా వుండకపోయినా ఆడోళ్ల నెత్తురూ కన్నీళ్లూ వుండక మానవు’ అన్న గౌరి నిర్ధారణ ద్వారా, ‘నాలో నేను’లో ‘స్త్రీకి పగలూ రాత్రి రెండూ సమానం కాదా’ అని ఆకాశంలో సగం వెలిబుచ్చిన సందేహం ద్వారా, ‘పాటల పదమవుదమా?!’లో ‘రాజ్యాంగం ప్రకారం నడవడం నడవాలనుకోవడం ఈ దేశంలో ఆయుధం పట్టుకోవడంలాంటిదేనని’ గ్రహించిన బేలా సోమారి అవగాహన ద్వారా సంఘటనల్ని సాహిత్యంగా మలిచి చేతులు దులుపుకొనే రచయితగా గాక వొక సామాజిక శాస్త్రవేత్తలా బజరా హింసకున్న అనేక కోణాల్ని విశ్లేషిస్తున్నాడు. ‘మై బాడీ మై ఛాయిస్’ నినాదంలోని బోలుతనాన్ని యెత్తిచూపే ‘నో ఛాయిస్’ స్త్రీ స్వేచ్ఛను పక్కదారి పట్టించే పేజ్ త్రీ ఫెమినిస్టులకు చెంపపెట్టు. ఫెమినిజం స్త్రీల శరీరం చుట్టూ అల్లిన మిత్ని బద్దలుకొట్టిన మాట నిజమే కానీ ‘మల్టీ నేషనల్ కార్పోరేట్ డెవిల్’ ఆ స్త్రీ శరీరాన్ని అంగడి సరుకుగా మార్చిన వ్యాపార రాజకీయాన్ని బజరా ఆవిష్కరించాడు. ‘అందమైన అంగడి కొలతల జాకెట్టును బట్టి నా రొమ్ములనెవరో కత్తిరించి కుట్టేస్తున్నారు’ అన్న వొక్క వాక్యంలో స్త్రీలకు తమ శరీరాలపై అధికారం లేదని నిర్ధారించి చెప్పాడు. - ఎ.కె.ప్రభాకర్ (బమ్మిడి జగదీశ్వర రావు ‘రణస్థలి’ కథల సంపుటికి రాసిన ముందుమాటలోంచి కొంతభాగం... ప్రచురణ: మాతృక ప్రచురణలు. ఫోన్: 9676206230) -
కష్టాన్ని చూపేదే మంచి కథ కాదు!
‘సమాజాన్నో, వ్యక్తులనో మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగునపడి పనిముట్టుగానే మిగిలిపోయింది. - కన్నెగంటి చంద్ర అమెరికాలో స్థిరపడ్డ కవీ కథకుడూ కన్నెగంటి చంద్ర యిటీవల ఇండియా వచ్చినప్పుడు ‘’ వేదిక ఆధ్వర్యంలో ‘కథ’పై ఆయనతో చర్చాగోష్టి జరిగింది. అందులో వెల్లడైన కొన్ని అభిప్రాయాలు: రచయిత తన్ను తాను సందేశమిచ్చే వున్నత స్థానంలో కూర్చోబెట్టుకొని పాఠకుల స్థాయిని తక్కువగా అంచనా వేయడం వల్ల తెలుగులో కథలు నీతిబోధకి పరిమితమై పోతున్నాయన్న చంద్ర వాదనతో సమావేశానికి హాజరైనవాళ్లు ఏకీభవించారు. అయితే మన రాతలు సమాజంపైన చూపుతున్న ప్రభావం చాలా తక్కువనీ వ్యక్తుల్ని క్రియాశీలంగా మార్చడానికి దోహదం చేసే సాహిత్యం రావడంలేదనీ చంద్ర చేసిన మరో ప్రతిపాదనపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. అంతిమంగా చర్చ సాహిత్య ప్రయోజనం- రచయితల కర్తవ్యాల వైపు సాగింది. ‘సమాజాన్నో, వ్యక్తులనో మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగునపడి పనిముట్టుగానే మిగిలిపోయింది. కష్టాన్నీ, బాధనూ ఎత్తిచూపడం మంచి కథకు కొలమానంగా మారింది. అది ముందెన్నడూ ఎరగనిదయితే మరీ మంచిదిగా భావించబడుతుంది. స్పందించే హృదయాలు సానుభూతి చూపక తప్పదు కానీ కథ అందుకే పరిమితమవుతూంది. కథను కథగా నిలిపే మిగతా అంశాలేవీ గమనించే, ఆస్వాదించే వీలు రచయితలూ, పాఠకులూ కల్పించుకోలేకుండా ఉన్నారు.’ అన్న చంద్ర ఆలోచన ‘కళ కళ కోసమే’ అన్న ధోరణిని బలపరిచేదిగా వుందని శ్రోతల్లో కొందరు అభిప్రాయపడ్డారు. అనిల్ అట్లూరి నిర్వహణలో జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో వి.రాజారామ మోహనరావు, దాసరి శిరీష, కొండవీటి సత్యవతి, వాసిరెడ్డి నవీన్, కుప్పిలి పద్మ, టైటానిక్ సురేష్, రమణమూర్తి, యాళ్ల అచ్యుతరామయ్య, జి.ఎస్.రామ్మోహన్ లాంటివాళ్లు పాల్గొన్నారు. తెలుగు కథకులు కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. అప్పుడే తెలుగులో ప్రపంచస్థాయిలో మంచి కథలు వస్తాయన్న ఆశంసతో గోష్టి ముగిసింది. ఎ.కె.ప్రభాకర్ 040-27761510