Akula Rajender
-
మల్కాజిగిరిలో కమలం వికసించేనా!
హైదరాబాద్: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ నియోజకవర్గ పరిధిలో రాజకీయ సమీకరణలు మారనున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఆకుల రాజేందర్ 2009లో కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. బీసీ నేతగా ఎదిగి నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించారు. రెండోసారి కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. కొంతకాలం తర్వాత పార్టీలో ఇమడలేక బహుజన్ సమాజ్ పార్టీలోకి వెళ్లారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కానీ.. పార్టీలో సముచితమైన స్థానం, గుర్తింపు లభించకపోవడంతో స్తబ్ధుగా ఉండిపోయారు. కొద్ది కాలం క్రితం కాంగ్రెస్‌కు సైతం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడంతో మల్కాజిగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇక్కడ అధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, వివాద రహితుడిగా పేరు ఉండటంతో ఆయన చేరికతో బీజేపీ బలం పుంజుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే పదవీ కాలం పూర్తయినప్పటి నుంచి రాజకీయాలకు అంటీముట్టనట్లుగా ఉండటంతో ఆయన అనుచర గణాలు ఇతర పార్టీల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఆయన అనుయాయులు తిరిగి బీజేపీలోకి వస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆపరేషన్ ఆకర్ష్.. జయసుధ సహా బీజేపీలోకి భారీ చేరికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో చేరికలపై నేతలు బిజీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు.. సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో ప్లాన్స్ చేస్తున్నారు. దీంతో, బీజేపీలో చేరికలు భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో కొందరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు బీజేపీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి బీజేపీ లో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఇప్పటికే వివేక్‌ను కలిశారు. ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ భేటీ అయ్యారు. ఈ క్రమంలో జయసుధ బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. హైకమాండ్ పిలుపు నేపథ్యంలో కిషన్‌రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. ఈటల రాజేందర్ సైతం ఈరోజు ఢిల్లీలోకి వెళ్లనున్నారు. వీరి తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాత పార్టీలో చేరికలపై ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: బండి సంజయ్, డీకే అరుణకు కీలక పదవులు.. -
సర్వే, మందకృష్ణల నుంచి ప్రాణహాని: ఆకుల రాజేందర్
హైదరాబాద్: కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ నుంచి నాకు ప్రాణహాని ఉందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని రాజేందర్ తెలిపారు. మంద కృష్ణ బెదిరింపు ఫోన్ కాల్స్ వెనుక ఉన్నది కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణే అని రాజేందర్ ఆరోపించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశానని మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా ఆరోపణలు తప్పని తేలితే రాజకీయాల్లోంచి తప్పుకుంటాను... ఏ పార్టీ నుంచి పోటీచేయను అని మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ స్పష్టం చేశారు.