akula Rajinder
-
నా గుండెల్లో పదిలంగా తెలంగాణ: కేసీఆర్
హైదరాబాద్: ఎవరెన్ని శాపాలు పెట్టినా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, కొత్త పంథాలో ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి బాబూమోహన్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్, పల్లా రాజేశ్వర్ రెడ్డి... కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తలరాత మారాలంటే పాత ప్రభుత్వాలతో సాధ్యం కాదన్నారు. తన గుండెల్లో పదిలంగా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణలో సకల బాధలకు కాంగ్రెస్, టీడీపీయే కారణమన్నారు. మంచి ప్రభుత్వం కావాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలన్నారు. మొదట రాజకీయ అవినీతిని పాతరవేయాలన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. -
కాంగ్రెస్‌కు షాక్
రాజేందర్ గుడ్‌బై.. పార్టీలో కలకలం మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఊగిసలాట.. సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్లో తొలిషాక్ తగిలింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్లో చేరిపోయారు. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, పీసీసీ అధ్యక్షులు పొన్నాల తీరుతో మనస్తాపానికి గురైన రాజేందర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదే నియోకజవర్గంలోని మరో ఇద్దరు శాసనసభ్యులు సైతం కాంగ్రెస్‌లో కొనసాగే అంశంపై ఊగిసలాడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఆ పార్టీ బలహీనపడే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు గానూ ఐదింటా కాంగ్రెస్ శాసనసభ్యులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానాల్లో మల్కాజిగిరి ఒకటని అధిష్టానం లెక్కలు వేసుకుంటున్న తరుణంలో.. తాజా పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ.. సిట్టింగ్ శాసనసభ్యులను కాదని, తనకంటూ ఓ ప్రత్యేక జాబితా తయారు చేయడంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు.. పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి అధిష్టానానికి సిఫారసు చేసిన తీరు వారిని తీవ్ర కలవరానికి గురి చేసింది. సర్వేపై ఇప్పటికే లోక్‌సభ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చే శారు. ఎంపీ అభ్యర్థిగా సర్వే అయితే గెలుపు కష్టమని, ఆ ప్రభావం తమపై పడుతుందని, ఆయన మల్కాజిగిరికి వద్దేవద్దని ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ఎంపీ తీరుపై పలువురి ఎమ్మెల్యేల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నా.. వాటిని తీర్చేందుకు పీసీసీ చొరవ తీసుకోకపోగా, సమస్యను తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు శాసనసభ్యులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ బరిలో రాజేందర్! రాజేందర్‌తో పాటు మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకులు పలువురు టీఆర్ఎస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ రాజేందర్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్లో చేరిన రాజేందర్‌ను శుక్రవారం తెలంగాణ రాష్ట్రసమితి ముఖ్యనాయకులు, పలు జేఏసీల ప్రతినిధులు కలుసుకుని అభినందించారు. -
మల్కాజిగిరిలో ‘హస్త’వ్యస్తం
సర్వే తీరుపై రాజేందర్ మనస్తాపం టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తొందరపడొద్దంటూ బుజ్జగింపులు సర్వే తీరు మారకుంటే మరిన్ని వలసలు సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరిపై కాంగ్రెస్ గురి తప్పుతోంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ తీరుతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కాంగ్రెస్‌ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ముఖ్య అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుండి ఏకైక ఎమ్మెల్యే అయిన తనపై ఎంపీ సర్వే పార్టీ అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు చేసిన వైనాన్ని ఆయన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తీసుకెళ్లగా.. ‘ఏదైనా సమస్య ఉంటే మీ ఎంపీతో మాట్లాడుకోండి. నా వద్దకు ఎందుకొచ్చావ్’ అంటూ అసహనంగా మాట్లాడటంతో రాజేందర్ మనస్తాపానికి గురైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరేందుకు రాజేందర్ చేస్తున్న ప్రయత్నాలను పలువురు సహచర ఎమ్మెల్యేలు వారించినట్లు సమాచారం. ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకోవాలని, ఇతర నాయకుల తీరుతో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించినట్లు సమాచారం. కాగా రాజేందర్ గురువారం సాయంత్రం ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌తో మల్కాజిగిరి ఎంపీ సర్వే తీరుతో తాను విసిగి పోయిన వైనాన్ని వివరించినట్లు సమాచారం. మిగిలిన చోటా కలకలం.. ఎంపీ సర్వే తన లోక్‌సభ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తనదైన వర్గాన్ని మొదటి నుంచీ ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల ఎంపీ సర్వేపై తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా ఆయనను తిరిగి లోక్‌సభ అభ్యర్థిగా పెట్టొద్దంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు దిగ్విజయ్‌సింగ్‌ను కోరగా, దానికి ప్రతిగా సర్వే ఎల్బీనగర్లో సుధీర్‌రెడ్డికి బదులు రాంమోహన్‌గౌడ్, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్‌కు బదులు శ్రీధర్‌ను ప్రతిపాదిస్తూ మిగిలిన నియోజకవర్గాల్లో బండారి లక్ష్మారెడ్డి లేదా రాజిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి మేకల శివారెడ్డి, కుత్బుల్లాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ లేదా కాసాని జ్ఞానేశ్వర్, కేఏం ప్రతాప్, కూకట్‌పల్లిలో వెంగళరావు, హరీష్‌రెడ్డి, ఎం.సాయి సుధాకర్‌లలో ఒకరు, కంటోన్మెంట్లో శంకర్రావు మినహా ఎవరైనా తనకు అభ్యంతరం లేదంటూ సర్వే అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో కినుక వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సర్వేతో అమీతుమీ తేల్చుకోవాలన్న భావనతో ఉన్నట్లు తెలిసింది.