మల్కాజిగిరిలో ‘హస్త’వ్యస్తం
- సర్వే తీరుపై రాజేందర్ మనస్తాపం
- టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం
- తొందరపడొద్దంటూ బుజ్జగింపులు
- సర్వే తీరు మారకుంటే మరిన్ని వలసలు
సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరిపై కాంగ్రెస్ గురి తప్పుతోంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ తీరుతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కాంగ్రెస్‌ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ముఖ్య అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు.
ముదిరాజ్ సామాజిక వర్గం నుండి ఏకైక ఎమ్మెల్యే అయిన తనపై ఎంపీ సర్వే పార్టీ అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు చేసిన వైనాన్ని ఆయన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తీసుకెళ్లగా.. ‘ఏదైనా సమస్య ఉంటే మీ ఎంపీతో మాట్లాడుకోండి. నా వద్దకు ఎందుకొచ్చావ్’ అంటూ అసహనంగా మాట్లాడటంతో రాజేందర్ మనస్తాపానికి గురైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రాజేందర్ చేస్తున్న ప్రయత్నాలను పలువురు సహచర ఎమ్మెల్యేలు వారించినట్లు సమాచారం.
ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకోవాలని, ఇతర నాయకుల తీరుతో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించినట్లు సమాచారం. కాగా రాజేందర్ గురువారం సాయంత్రం ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌తో మల్కాజిగిరి ఎంపీ సర్వే తీరుతో తాను విసిగి పోయిన వైనాన్ని వివరించినట్లు సమాచారం.
మిగిలిన చోటా కలకలం..
ఎంపీ సర్వే తన లోక్‌సభ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తనదైన వర్గాన్ని మొదటి నుంచీ ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల ఎంపీ సర్వేపై తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా ఆయనను తిరిగి లోక్‌సభ అభ్యర్థిగా పెట్టొద్దంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు దిగ్విజయ్‌సింగ్‌ను కోరగా, దానికి ప్రతిగా సర్వే ఎల్‌బీనగర్‌లో సుధీర్‌రెడ్డికి బదులు రాంమోహన్‌గౌడ్, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్‌కు బదులు శ్రీధర్‌ను ప్రతిపాదిస్తూ మిగిలిన నియోజకవర్గాల్లో బండారి లక్ష్మారెడ్డి లేదా రాజిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి మేకల శివారెడ్డి, కుత్బుల్లాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ లేదా కాసాని జ్ఞానేశ్వర్, కేఏం ప్రతాప్, కూకట్‌పల్లిలో వెంగళరావు, హరీష్‌రెడ్డి, ఎం.సాయి సుధాకర్‌లలో ఒకరు, కంటోన్మెంట్‌లో శంకర్రావు మినహా ఎవరైనా తనకు అభ్యంతరం లేదంటూ సర్వే అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో కినుక వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సర్వేతో అమీతుమీ తేల్చుకోవాలన్న భావనతో ఉన్నట్లు తెలిసింది.