sarve sathya narayana
-
కుంతియా వల్లే కాంగ్రెస్ సర్వనాశనం
సాక్షి, హైదరాబాద్: గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ లాంటి నాయకులు ఇన్‌చార్జీలుగా ఉండాల్సిన రాష్ట్రానికి ఆర్.సి.కుంతియా అనే ఐరన్‌లెగ్‌ను ఇన్చార్జిగా నియమించినందువల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైందని కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ‘ఉత్తమ్, కుంతియాకు హఠావో... కాంగ్రెస్‌కు బచావో’అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై సమీక్ష ఎవరు చేయమన్నారని ప్రశ్నించినందుకే తనపై దాడికి ఉసిగొల్పారని, తనపైకి వచ్చిన వారికి గట్టిగానే సమాధానం చెప్పి తాను సమావేశం నుంచి బయటకు వచ్చానన్నారు. తనను సస్పెండ్ చేశామని టీపీసీసీ చెబుతోందని, ఏఐసీసీ సభ్యుడినయిన తనను సస్పెండ్ చేసే అధికారం వీళ్లకెక్కడిదని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయాలని అధిష్టానం చెబితే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎక్కడ ఉందని నిలదీశారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేశారని, గెలిస్తే సీఎం పదవికి అడ్డం వస్తాననే ఉద్దేశంతో తనను ఓడించాలని పలువురికి ఫోన్లు చేసి పురమాయించారని ఆరోపించారు. తనతోపాటు చాలామందిని ఓడించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వివరాలన్నింటితో త్వరలోనే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. బడా ఐరన్‌లెగ్, చోటా ఐరన్‌లెగ్ కలసి రాష్ట్రంలో పార్టీని తమిళనాడు తరహాలో నాశనం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. వారి ఆటలు సాగనివ్వబోనని, వారి భరతం పడతానని, కాంగ్రెస్‌పార్టీ పక్షాన పోరాడుతానని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అన్నట్టు నిజంగా వీళ్లు ఇడియట్లేనని, సిగ్గూశరం లేనోళ్లని, మొత్తం తెలంగాణ కాంగ్రెస్‌పార్టీని ప్రక్షాళన చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా, మండలిలో పార్టీ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసినా ఈ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంకా ఈయనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పదవిని పట్టుకుని వేలాడుతున్నారని, వీళ్ల మొహాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదని, కేసీఆర్ మొహం నచ్చినందుకే ఆయనకు ఓట్లేశారని సర్వే అన్నారు. రాష్ట్రంలో కొత్త వారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం ఆశీర్వాదం తనకుందని, తనకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
క్యూట్ లవ్ స్టోరీ
శ్రీరామ్, పల్లవి జంటగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. లాగిన్ మీడియా శ్రీధర్‌రెడ్డి ఆశీస్సులతో కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ కార్తీక్ మాట్లాడుతూ –‘‘ప్రయోగాత్మక చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్న ఉదయ్‌గారు నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరి మనసును తాకే కథ. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా రియలిస్టిక్ కథను సినిమాగా రూపొందిస్తున్నాం. షూటింగ్ మొత్తం తెలంగాణలో జరుగుతుంది. నెక్ట్స్ వీక్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభించి, 35రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న రెండో చిత్రమిది. మంచి కథతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఉదయ్‌భాస్కర్ గౌడ్. శ్రీరామ్, పల్లవి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, సంగీతం: మహి మదన్ యంయం, సమర్పణ: వై. బాలరాజు గౌడ్, సహ నిర్మాత: వినయ్‌కుమార్ గౌడ్. -
'కేసీఆర్ కొడుకును ఏమనొద్దంట.. '
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సర్వేసత్యనారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కేసీఆర్ హిట్లర్‌లాగా నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ కూడా తోడయ్యారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మందకృష్ణను అరెస్టు చేసి జైలులో పెట్టడం అప్రజాస్వామికం అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎస్సీ వర్గీకరణ కార్యచరణ చేపడతామని, వర్గీకరణ తమ జన్మహక్కు అని స్పష్టం చేశారు. శనివారం సర్వే సత్యనారాయణ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న మందకృష్ణను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 'ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి ప్రధాని నరేంద్రమోదీ రమ్మన్నారు. కానీ, కేసీఆర్ మాత్రం అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఆయన దళిత వ్యతిరేకి. తొలుత డిప్యూటీ సీఎంగా ఓ మాదిగను పెట్టి గంజిలో ఈగను తీసినట్లు తీసేసిండు. తర్వాత ఒక్క మాదిగను కూడా కేబినెట్లోకి తీసుకోలేదు. పోని మాల సోదరుడిని కూడా తీసుకున్నారా అంటే అదీ లేదు. ఆయన చేస్తున్న అక్రమాలపై మేం గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళితే ఆయన మాకు క్లాస్ పీకుతున్నారు. హెడ్మాస్టర్ లాగా మాకు పాఠాలు చెబుతున్నారు. మామీద గవర్నర్ టీఆర్ఎస్ కార్యకర్తలాగా మాటలు పేలారు. సీఎంను, సీఎం కొడుకును ఏమీ అనొద్దని అంటున్నారు. ఇసుక మాఫియా గురించి మాట్లాడొద్దంటున్నారు. ఇసుక లారీ కింద పడి మనిషి చనిపోయిండంటే పడింది ఇటుక లారీకింద అని గవర్నర్ అంటున్నారు. దేనికందైతేంది ప్రాణం పోయినవారికి న్యాయం చేయండయ్యా అంటే ఆయన అలా మాట్లాడుతున్నారు. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలి. అసలు గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలి. తండ్రిలాంటి గవర్నరే ఇలా చేస్తే ఇక ప్రజలకు దిక్కెవరు. రాష్ట్రంలో ఉన్న కోటి మంది మాదిగలు మందకృష్ణ వెనుకే ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ మా జన్మహక్కు. దీనికోసం మేం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తాం. ప్రభుత్వమే చేస్తామని ముందుకొస్తే సహకరిస్తాం' అని సర్వే అన్నారు. -
మల్కాజిగిరిలో ‘హస్త’వ్యస్తం
సర్వే తీరుపై రాజేందర్ మనస్తాపం టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తొందరపడొద్దంటూ బుజ్జగింపులు సర్వే తీరు మారకుంటే మరిన్ని వలసలు సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరిపై కాంగ్రెస్ గురి తప్పుతోంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ తీరుతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కాంగ్రెస్‌ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ముఖ్య అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుండి ఏకైక ఎమ్మెల్యే అయిన తనపై ఎంపీ సర్వే పార్టీ అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు చేసిన వైనాన్ని ఆయన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తీసుకెళ్లగా.. ‘ఏదైనా సమస్య ఉంటే మీ ఎంపీతో మాట్లాడుకోండి. నా వద్దకు ఎందుకొచ్చావ్’ అంటూ అసహనంగా మాట్లాడటంతో రాజేందర్ మనస్తాపానికి గురైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరేందుకు రాజేందర్ చేస్తున్న ప్రయత్నాలను పలువురు సహచర ఎమ్మెల్యేలు వారించినట్లు సమాచారం. ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకోవాలని, ఇతర నాయకుల తీరుతో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించినట్లు సమాచారం. కాగా రాజేందర్ గురువారం సాయంత్రం ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌తో మల్కాజిగిరి ఎంపీ సర్వే తీరుతో తాను విసిగి పోయిన వైనాన్ని వివరించినట్లు సమాచారం. మిగిలిన చోటా కలకలం.. ఎంపీ సర్వే తన లోక్‌సభ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తనదైన వర్గాన్ని మొదటి నుంచీ ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల ఎంపీ సర్వేపై తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా ఆయనను తిరిగి లోక్‌సభ అభ్యర్థిగా పెట్టొద్దంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు దిగ్విజయ్‌సింగ్‌ను కోరగా, దానికి ప్రతిగా సర్వే ఎల్బీనగర్లో సుధీర్‌రెడ్డికి బదులు రాంమోహన్‌గౌడ్, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్‌కు బదులు శ్రీధర్‌ను ప్రతిపాదిస్తూ మిగిలిన నియోజకవర్గాల్లో బండారి లక్ష్మారెడ్డి లేదా రాజిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి మేకల శివారెడ్డి, కుత్బుల్లాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ లేదా కాసాని జ్ఞానేశ్వర్, కేఏం ప్రతాప్, కూకట్‌పల్లిలో వెంగళరావు, హరీష్‌రెడ్డి, ఎం.సాయి సుధాకర్‌లలో ఒకరు, కంటోన్మెంట్లో శంకర్రావు మినహా ఎవరైనా తనకు అభ్యంతరం లేదంటూ సర్వే అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో కినుక వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సర్వేతో అమీతుమీ తేల్చుకోవాలన్న భావనతో ఉన్నట్లు తెలిసింది. -
‘వారధి’పై ఆశలు ఏటిపాలు
అమలాపురం, న్యూస్‌లైన్ : కోనసీమ ప్రాంతానికి పదేళ్లుగా లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్‌ను ‘ఇదిగో.. నేను ఈ ప్రాంతానికి ఈ మేలు చేశాను’ అని నిర్దిష్టంగా చెప్పుకోలేని వైఫల్యం వెన్నాడుతోంది. బోడసకుర్రు-పాశర్లపూడిల మధ్య వైనతేయ పాయపై నిర్మిస్తున్న వంతెనను ఆదరాబాదరాగానైనా ప్రారంభింపజేసి, ఆ వైఫల్యాన్ని అధిగమించాలనుకున్న ఆయన ఆశలపై పురపోరు నోటిఫికేషన్ నీళ్లు చల్లింది. మంగళవారం జరగాల్సిన వంతెన ప్రారంభోత్సం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. 216 జాతీయ రహదారిలో భాగంగా నిర్మిస్తున్న ఈ వంతెన పూర్తయితే తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. అయితే వంతెన పూర్తిస్థాయిలో సిద్ధం కాకున్నా సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణతో ప్రారంభింపజేయాలని ఎంపీ హర్షకుమార్ ఆరాటపడ్డారు. రెండు వైపులా అప్రోచ్‌రోడ్లు, వంతెనపై సిమెంట్ రోడ్డు, పాశర్లపూడి వైపు 400 అడుగుల మేర వంతెనకు ఇరువైపులా రెయిలింగ్ నిర్మాణాలు ఇంకా పూర్తి కావలసి ఉంది. ఒకవైపు పనులు జరుగుతుండగానే.. మరోవైపు ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉదయం పది గంటలకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం, వెంటనే కోడ్ అమలులోకి రావడంతో వంతెన ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడం అనివార్యమవుతోంది. త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడ విడుదల కానుండడంతో.. ఇక కొత్త ప్రభుత్వ హయాంలోనే ఈ వంతెన ప్రారంభానికి నోచుకోనుంది. ఆరంభం నుంచి ప్రారంభం వరకూ వివాదాలే.. ఈ వంతెన నిర్మాణం ఆది నుంచీ అవాంతరాలు, వివాదాలతోనే సాగింది. వంతెన డిజైన్ మార్చాలనే నిర్మాణం వల్ల వరదల సమయంలో గండ్లు పడే ప్రమాదముందనే ఆరోపణలు వినిపించాయి. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2010 ఏప్రిల్ 25కు పూరి ్తకావాల్సిన నిర్మాణం నత్తనడకన సాగుతూ నాలుగేళ్లు ఆలస్యమైంది. నాలుగుసార్లు గడువు పెంచి గత ఏడాది సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి చేయకుంటే నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్వయంగా కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆదేశించినా ఫలితం లేక పోయింది. నిర్మాణం ఆరంభంలోనే పి-4 పియర్ నదిలోకి ఒరిగిపోయింది. కెంటలెడ్జ్ పద్ధతిలో దీనిని సరిదిద్దగా మరోసారి 23 పియర్ ఒరిగిపోయింది. రెండు, మూడు పియర్ల నుంచి మూడు గర్డర్లు పడిపోయాయి. వంతెన నిర్మాణంలో సాంకేతిక లోపాల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని, అదనంగా రూ.20 కోట్లు ఇవ్వాలని నిర్మాణ సంస్థ గామన్ ఇండియా పేచీకి దిగడం వల్ల కూడా పనులు ఆలస్యమయ్యాయి. వంతెనకు సామాజికవర్గాల వారీగా తమ నేతల పేర్లు పెట్టాలంటూ కోనసీమలోని పలు పార్టీలకు చెందిన నాయకులు డిమాండ్ చేయడం మరో వివాదానికి దారి తీస్తోంది. ఎంపీ వర్గీయుల దింపుడు కళ్లం ఆశలు అమలాపురం, న్యూస్‌లైన్ : వంతెన నిర్మించిన ఘనతను ఖాతాలో వేసుకోవాలనుకున్న ఎంపీ హర్షకుమార్ ఆశలకు ఎన్నికల కోడ్ గండి కొట్టినా.. ఆయన వర్గీయుల్లో ఇంకా దింపుడు కళ్లం ఆశలు మిగిలే ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా.. వంతెన ప్రారంభోత్సవానికి వచ్చిన ఢోకా లేదని, ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం ఆ కార్యక్రమం జరిగి తీరుతుందని వారు ప్రచారం చేస్తున్నారు. అనధికారికంగా కొబ్బరికాయ కొట్టయినా ఈ వంతెన నిర్మాణం ఘనతను తమ నాయకుడి ఖాతాలో వేసి తీరాలనుకుంటున్నట్టు సమాచారం. వారి ప్రయత్నాలకు ఎంపీ కూడా అభ్యంతరం చెప్పనట్టు తెలుస్తోంది. కాగా వంతెన ప్రారంభోత్సవానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ వస్తే అడ్డుకుని తీరుతామని కోనసీమ జేఏసీ ప్రకటించింది. సోమవారం అమలాపురం కాటన్ అతిథి గృహంలో చైర్మన్ వి.ఎస్.దివాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో పెట్టిన సమయంలో సీమాంధ్ర ఎంపీలపై దాడి చేసిన వారిలో సర్వే కూడా ఉన్నారని, అలాంటి నేతతో వంతెనను ప్రారంభింపజేయడం అనుచితమని జేఏసీ అభిప్రాయపడుతోంది. సర్వే గనుక ప్రారంభించడానికి వస్తే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అమలాపురం గడియారస్తంభం సెంటర్ నుంచి బోడసకుర్రు వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహనరావు, ప్రతినిధులు డాక్టర్ ఎస్.ఆర్.ఎస్.కొల్లూరి, యిళ్ల భక్తవత్సలం, మానే వెంకటేశ్వరరావు, అత్కూరి శరభరాజు, కరాటం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సర్వే
నేడు ఏఐసీసీ పరిశీలకుల రాక సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తరఫున సర్వే నిమిత్తం ఏఐసీసీ పరిశీలకులు సోమవారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు ఒక్కొక్కరి చొప్పున 42 మంది పరిశీలకులను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎంపిక చేశా రు. సోమవారం ఆరుగురు నగరానికి రానున్నారు. కర్ణాటక ఎమ్మెల్యే గోవిందరాజన్కు రాజంపేట లోక్‌సభ పరిధిలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అప్పగించారు. ఉడిపి ఎమ్మెల్యే ప్రమోద్ మాధవరాజ్‌కు కర్నూలు; టుంకూర్ ఎమ్మెల్యే రఫీక్ అహ్మద్‌కు నల్లగొండ, మాజీ ఎంపీ అవారీకి విశాఖ, కర్ణాటక ప్రభుత్వ విప్ వెంకటేశ్‌కు తిరుపతి, మరో ఎమ్మెల్యే యశ్వంత్‌రావుగౌడకు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో పరిశీలన బాధ్యత అప్పగించారు. వీరు తొలుత పీసీసీ చీఫ్ బొత్సతో సమావేశంకానున్నారు. తర్వాత నియోజకవర్గాలకు వెళ్లి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలను సేకరిస్తారు. పది రోజుల పాటు పర్యటించనున్న ఆయా నేతలు ర్యాండమ్ పద్ధతిలో ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు రెండ్రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.