సాక్షి, హైదరాబాద్: గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ లాంటి నాయకులు ఇన్‌చార్జీలుగా ఉండాల్సిన రాష్ట్రానికి ఆర్.సి.కుంతియా అనే ఐరన్‌లెగ్‌ను ఇన్‌చార్జిగా నియమించినందువల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైందని కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ‘ఉత్తమ్, కుంతియాకు హఠావో... కాంగ్రెస్‌కు బచావో’అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై సమీక్ష ఎవరు చేయమన్నారని ప్రశ్నించినందుకే తనపై దాడికి ఉసిగొల్పారని, తనపైకి వచ్చిన వారికి గట్టిగానే సమాధానం చెప్పి తాను సమావేశం నుంచి బయటకు వచ్చానన్నారు.
తనను సస్పెండ్ చేశామని టీపీసీసీ చెబుతోందని, ఏఐసీసీ సభ్యుడినయిన తనను సస్పెండ్ చేసే అధికారం వీళ్లకెక్కడిదని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయాలని అధిష్టానం చెబితే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎక్కడ ఉందని నిలదీశారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేశారని, గెలిస్తే సీఎం పదవికి అడ్డం వస్తాననే ఉద్దేశంతో తనను ఓడించాలని పలువురికి ఫోన్లు చేసి పురమాయించారని ఆరోపించారు. తనతోపాటు చాలామందిని ఓడించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వివరాలన్నింటితో త్వరలోనే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.
బడా ఐరన్‌లెగ్, చోటా ఐరన్‌లెగ్ కలసి రాష్ట్రంలో పార్టీని తమిళనాడు తరహాలో నాశనం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. వారి ఆటలు సాగనివ్వబోనని, వారి భరతం పడతానని, కాంగ్రెస్‌పార్టీ పక్షాన పోరాడుతానని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అన్నట్టు నిజంగా వీళ్లు ఇడియట్లేనని, సిగ్గూశరం లేనోళ్లని, మొత్తం తెలంగాణ కాంగ్రెస్‌పార్టీని ప్రక్షాళన చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా, మండలిలో పార్టీ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసినా ఈ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంకా ఈయనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పదవిని పట్టుకుని వేలాడుతున్నారని, వీళ్ల మొహాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదని, కేసీఆర్ మొహం నచ్చినందుకే ఆయనకు ఓట్లేశారని సర్వే అన్నారు. రాష్ట్రంలో కొత్త వారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం ఆశీర్వాదం తనకుందని, తనకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment