'కేసీఆర్‌ కొడుకును ఏమనొద్దంట.. ' | sarve satyanarayana takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ ఓ హిట్లర్‌.. గవర్నర్‌ ఓ హెడ్‌మాస్టర్‌'

Published Sat, Jan 6 2018 7:40 PM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM

sarve satyanarayana takes on cm chandrababu naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సర్వేసత్యనారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కేసీఆర్‌ హిట్లర్‌లాగా నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు ఇప్పుడు రాష్ట్ర గవర్నర్‌ కూడా తోడయ్యారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మందకృష్ణను అరెస్టు చేసి జైలులో పెట్టడం అప్రజాస్వామికం అన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎస్సీ వర్గీకరణ కార్యచరణ చేపడతామని, వర్గీకరణ తమ జన్మహక్కు అని స్పష్టం చేశారు. శనివారం సర్వే సత్యనారాయణ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న మందకృష్ణను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..

'ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి ప్రధాని నరేంద్రమోదీ రమ్మన్నారు. కానీ, కేసీఆర్‌ మాత్రం అపాయింట్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేశారు. ఎందుకంటే ఆయన దళిత వ్యతిరేకి. తొలుత డిప్యూటీ సీఎంగా ఓ మాదిగను పెట్టి గంజిలో ఈగను తీసినట్లు తీసేసిండు. తర్వాత ఒక్క మాదిగను కూడా కేబినెట్‌లోకి తీసుకోలేదు. పోని మాల సోదరుడిని కూడా తీసుకున్నారా అంటే అదీ లేదు. ఆయన చేస్తున్న అక్రమాలపై మేం గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళితే ఆయన మాకు క్లాస్‌ పీకుతున్నారు. హెడ్‌మాస్టర్‌ లాగా మాకు పాఠాలు చెబుతున్నారు. మామీద గవర్నర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలాగా మాటలు పేలారు.

సీఎంను, సీఎం కొడుకును ఏమీ అనొద్దని అంటున్నారు. ఇసుక మాఫియా గురించి మాట్లాడొద్దంటున్నారు. ఇసుక లారీ కింద పడి మనిషి చనిపోయిండంటే పడింది ఇటుక లారీకింద అని గవర్నర్‌ అంటున్నారు. దేనికందైతేంది ప్రాణం పోయినవారికి న్యాయం చేయండయ్యా అంటే ఆయన అలా మాట్లాడుతున్నారు. వెంటనే ఆయనను బర్తరఫ్‌ చేయాలి. అసలు గవర్నర్‌ వ్యవస్థను రద్దుచేయాలి. తండ్రిలాంటి గవర్నరే ఇలా చేస్తే ఇక ప్రజలకు దిక్కెవరు. రాష్ట్రంలో ఉన్న కోటి మంది మాదిగలు మందకృష్ణ వెనుకే ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ మా జన్మహక్కు. దీనికోసం మేం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తాం. ప్రభుత్వమే చేస్తామని ముందుకొస్తే సహకరిస్తాం' అని సర్వే అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement