కాంగ్రెస్‌కు షాక్
- రాజేందర్ గుడ్‌బై.. పార్టీలో కలకలం
- మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఊగిసలాట..
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్‌లో తొలిషాక్ తగిలింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, పీసీసీ అధ్యక్షులు పొన్నాల తీరుతో మనస్తాపానికి గురైన రాజేందర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదే నియోకజవర్గంలోని మరో ఇద్దరు శాసనసభ్యులు సైతం కాంగ్రెస్‌లో కొనసాగే అంశంపై ఊగిసలాడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఆ పార్టీ బలహీనపడే పరిస్థితి కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు గానూ ఐదింటా కాంగ్రెస్ శాసనసభ్యులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానాల్లో మల్కాజిగిరి ఒకటని అధిష్టానం లెక్కలు వేసుకుంటున్న తరుణంలో.. తాజా పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ.. సిట్టింగ్ శాసనసభ్యులను కాదని, తనకంటూ ఓ ప్రత్యేక జాబితా తయారు చేయడంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు.
అంతేకాదు.. పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి అధిష్టానానికి సిఫారసు చేసిన తీరు వారిని తీవ్ర కలవరానికి గురి చేసింది. సర్వేపై ఇప్పటికే లోక్‌సభ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చే శారు. ఎంపీ అభ్యర్థిగా సర్వే అయితే గెలుపు కష్టమని, ఆ ప్రభావం తమపై పడుతుందని, ఆయన మల్కాజిగిరికి వద్దేవద్దని ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు.
ఇలా ఎంపీ తీరుపై పలువురి ఎమ్మెల్యేల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నా.. వాటిని తీర్చేందుకు పీసీసీ చొరవ తీసుకోకపోగా, సమస్యను తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు శాసనసభ్యులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
మల్కాజిగిరి లోక్‌సభ బరిలో రాజేందర్!
రాజేందర్‌తో పాటు మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకులు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ రాజేందర్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా టీఆర్‌ఎస్‌లో చేరిన రాజేందర్‌ను శుక్రవారం తెలంగాణ రాష్ట్రసమితి ముఖ్యనాయకులు, పలు జేఏసీల ప్రతినిధులు కలుసుకుని అభినందించారు.