- మార్పులు.. చేర్పులు.. వడపోతలు
- చివరి నిమిషం వరకు ఆగని యత్నాలు
- 11 స్థానాల్లో కుదిరిన ఏకాభిప్రాయం
- కూకట్‌పల్లికి ముద్దం, మల్కాజిగిరికి ఆకుల పేర్లు
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్‌లో ఈసారి కొత్తనీరు పారుతోంది. శాసనసభ అభ్యర్థుల జాబితాలో పలు కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి. శనివారం రాత్రే ప్రకటించాల్సినగ్రేటర్ హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలకు ప్రతిపాదించిన జాబితాపై గుర్రుగా ఉన్న పలువురు నేతలు మళ్లీ ఢిల్లీ బాటపట్టారు. అక్కడి నుంచి అందిన సమాచారం మేరకు.. తమ అదృష్టాన్ని చివరిసారిగా పరీక్షించుకునేందుకు ఏఐసీసీ కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు.
మరికొందరు ఆదివారం గాంధీభవన్ ఎదుట నిరసనకు దిగారు. అయితే ముందుగా రూపొందించిన జాబితాకు, ప్రస్తుతం సిద్ధమైన జాబితాకు మధ్య భారీ తేడాలున్నట్లు సమాచారం. అంబర్‌పేట నుండి వి.హన్మంతరావు పేరు ఖరారైన ట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం (రాజ్యసభ) ఉండగా, మళ్లీ ఇప్పుటు టికెట్ ఎందుకంటూ ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు మెయిళ్లు, ఫ్యాక్స్‌ల ద్వారా ఆదివారం ఏఐసీసీ కార్యాల యంలో నిరసన తెలిపారు.
ఈ నియోకజవర్గం నుండి కార్పొరేటర్ దిడ్డి రాంబాబుతో పాటు మరో ఇద్దరు విద్యాసంస్థల ప్రతినిధుల పేర్లను ఏఐసీసీ పరిశీలించింది. ముషీరాబాద్ నియోకజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మణెమ్మ తనయుడు శ్రీనివాసరెడ్డి తనకు టికెట్ దాదాపు ఖాయమైందన్న భరోసాతో ఉండగా, ఏఐసీసీ జాబితాలో మాత్రం గత ఎన్నికల్లో ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పి.వినయ్‌కుమార్ పేరు ఉన్నట్లు సమాచారం. వినయ్‌కి కాంగ్రెస్‌లో సభ్యత్వం కూడా లేదని ఆయన ప్రత్యర్థివర్గం ఏఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిస్థితే కంటోన్మెంట్‌లోనూ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్రావు పార్టీ తీరుపై అగ్గిమీద గుగ్గిలం అవుతూ అక్కడి నుండే స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే ఏర్పాట్లు చేస్తున్నారు
మల్కాజిగిరిలో మళ్లీ రాజేందర్!
మల్కాజిగిరి శాసనసభకు ఏఐసీసీ రూపొందించిన జాబితాలో విచిత్రంగా ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పేరు కనిపిస్తోందని సమాచారం. ఇటీవలే రాజేందర్ టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే తనకు టికెట్‌ఇస్తే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమేనని రాజేందర్ ఏఐసీసీకి సందేశం ఇవ్వటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదే నియోజకవర్గం నుంచి ఆదం సంతోష్‌కుమార్, నందికంటి శ్రీధర్ సైతం టికెట్ తమకు ఖాయమైపోయిందన్న ధీమాలో ఉన్నారు. కూకట్‌పల్లి శాసనసభ స్థానానికి నిర్మాత ఆది శేషగిరిరావు పేరు దాదాపుగా ఖరాైరె న అనంతరం, అనూహ్యంగా కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ ముందుకొచ్చారు.
ఏకాభిప్రాయం ఉన్న స్థానాలివే..
ఖైరతాబాద్- దానం నాగేందర్
గోషామహల్ -ముఖేష్‌గౌడ్
నాంపల్లి- వినోద్
కార్వాన్- రూప్‌సింగ్
సికింద్రాబాద్ -జయసుధ
సనత్‌నగర్- మర్రి శశిధర్‌రెడ్డి
జూబ్లీహిల్స్- విష్ణువర్ధన్‌రెడ్డి
ఉప్పల్ - బండారి లక్ష్మారెడ్డి
ఎల్‌బీనగర్- సుధీర్‌రెడ్డి
కుత్బుల్లాపూర్ -కూన శ్రీశైలంగౌడ్
శేరిలింగంపల్లి-భిక్షపతియాదవ్