సాక్షి, హైదరాబాద్: కొంత మంది నాయకులు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ దిక్కులేదని విమర్శించారు. ఘట్కేసర్‌లో బుధవారం మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.
రేవంత్ బీజేపీలో చేరడం పక్కా
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు రేవంత్ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని. మీ పక్కనే ఉన్నాయన్నారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహ అన్నింటిని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీలో చేరుతాడని జోస్యం చెప్పారు.
భద్రాచలానికి బీజేపీ ఒక్క రూపాయైనా ఇచ్చిందా?
పదేళ్లు దేశాన్ని నడిపిన ప్రధాని మోదీ తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు. సీఎం గుంపు మెస్త్రి అయితే ప్రధాని తాపీ మేస్త్రి అని ఎద్దేవా చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంపై ప్రేమ ఉంటే.. భద్రాచలం ఆలయానికి ఒక్కరూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది కూడా రాముడేనని అన్నారు.
చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు
రాముడితో పంచాయితీ లేదు.. బీజేపీతోనే..
‘శ్రీరాముడు అందరివాడు.. ఆ రాముడితో మనకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా బీజేపీతోనే. ఈ పదేళ్లలో ఏం చేశారని బీజేపీ వాళ్లను ప్రశ్నిస్తే జైశ్రీరాం అంటారు. రాముడు బీజేపీ పార్టీ మనిషి కాదు.. ఆయన అందరి మనిషి. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని తరిమేయాలన్నారు కేటీఆర్.
యాదాద్రిని రాజకీయంగా వాడుకోలేదు. దేవుడు దేవుడే.. ధర్మం ధర్మమే.. రాజకీయం రాజకీయమే. ఎవరు మన కోసం పని చేస్తున్నారో.. ఎవరు దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతుకుతున్నారో ప్రజలకు వివరించాలి. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, మతోన్మాదానికి కారణమైన బీజేపీని పాతరేయాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment