లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగేది అదే
బీఆర్‌ఎస్ శ్రేణుల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు
మల్కాజ్‌గిరిలో బీజేపీతోనే బీఆర్‌ఎస్ పోటీ.. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థ్ధిని పెట్టిందని విమర్శ
శామీర్‌పేట్: సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీలోకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డే అని వ్యాఖ్యానించారు. అలియాబాద్‌లో మంగళవారం జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీని చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్ మాత్రం మోదీ హమారా బడే భాయి ( పెద్దన్న ) అంటున్నారని గుర్తు చేశారు. అసలు సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కోసం పని చేస్తున్నాడా లేక నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నాడా అనే సందేహం కలుగుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
లిక్కర్‌స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయ మని అంటున్న రేవంత్ కవిత అరెస్టు కరెక్ట్ అని ఎలా అంటారని నిలదీశారు. మందికి పుట్టిన బిడ్డ లని తమ బిడ్డలని చెప్పుకోవడమే సీఎం రేవంత్ తత్వమని, బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని తాను చేశానని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని, ఆయన పక్కనే ఉన్న నల్లగొండ, ఖమ్మం మానవ బాంబులతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఆ తర్వాతే ఈటల ఓట్లడగాలి: మల్కాజ్‌గిరిలో బీజేపీతోనే బీఆర్‌ఎస్‌కు పోటీ అని, కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యరి్ధని పెట్టిందని కేటీఆర్ అన్నారు.
అందుకే మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. మల్కాజ్‌గిరి అభివృద్ధికి కేసీఆర్ ఏం చేశారో తాము చెప్పగలమని,, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏం చేసిందో చెప్పి ఈటల రాజేందర్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. పదేళ్లుగా కంటోన్మెంట్ భూములు కావా లని అడిగితే బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని, చివరికి తెలుగు అధికారి గిరిధర్ వల్ల పైల్ కదిలిందని గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ చేయలేదని ఈటల అనడం సిగ్గు చేటని, ఆయన ఆరి్ధకమంత్రిగా ఉన్నప్పుడే రూ. 16 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. సమావేశంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్ధి లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు వికారాబాద్‌లో కేటీఆర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వికారాబాద్‌లో పర్యటించనున్నారు. వికారాబాద్‌లోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 11:30 గంటలకు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment