‘ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే’: కేటీఆర్‌ | Ktr Satire On Cm Revanth Reddy Government | Sakshi
Sakshi News home page

‘ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే’: కేటీఆర్‌

Published Sun, Nov 10 2024 9:15 AM | Last Updated on Sun, Nov 10 2024 11:18 AM

Ktr Satire On Cm Revanth Reddy Government

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 9 వరకు వీటిని నిర్వహించనుంది. అయితే ప్రజా విజయోత్సవాలపై.. ’‘ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే’’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ఎక్స్‌ వేదికగా సెటైర్లు వేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌లో ఏమన్నారంటే?
‘‘కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే..!!

 

 

కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా”.  ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలు

ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట..!! బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్”

ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన. మరి, ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారు.

ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా ?

రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా? హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా? ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా? వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్ లు చేసుకుంటారా ?

బీఆర్ఎస్ భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను మీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా? పావుశాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా ? 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా ?

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే.

ఈ ముఖ్యమంత్రికి పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదు. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement