అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు
అవినీతి, అక్రమాలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్న వైనం
వేడి రాజేసిన ఫార్ములా ఈ–రేస్, అమృత్ టెండర్ల వ్యవహారం
‘ఈ–రేస్‌కు చెల్లింపులు’పై కేటీఆర్‌పై కేసు, విచారణకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం
అమృత్ టెండర్లపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు
తాజాగా వేడి పెంచుతున్న ఫోన్ ట్యాపింగ్
కలెక్టర్‌పై దాడి ఘటనతో ముదురుతున్న రాజకీయ యుద్ధం
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అక్రమాలంటూ ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సవాళ్లు..ప్రతి సవాళ్లు, వ్యక్తిగత దూషణలు, కించపరిచే వ్యాఖ్యలు.. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు గత కొంతకాలంగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గత పదేళ్ల పాలనపై విమర్శలు, ఆరోపణలతో, బీఆర్‌ఎస్ లక్ష్యంగా అధికార కాంగ్రెస్ దాడిని తీవ్రం చేస్తుంటే, విపక్ష బీఆర్‌ఎస్ కూడా నిత్యం సీఎం రేవంత్, మంత్రులు లక్ష్యంగా విరుచుకుపడుతోంది.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ–రేస్, అమృత్ టెండర్లు, ఫోన్ ట్యాపింగ్, వికారాబాద్ కలెక్టర్‌పై దాడి లాంటి ఉదంతాలు, వ్యవహారాలను తమ రాజకీయ లబి్ధకి ఉపయోగించుకునేలా రెండు పార్టీలూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. గల్లీలో, ఢిల్లీలో ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇంకోవైపు మరో ప్రధాన పక్షం బీజేపీ.. ఈ రెండు పార్టీలపై విమర్శల జోరు పెంచుతూ పావులు కదుపుతోంది.
‘దీపావళి బాంబుల’తో పెరిగిన వేడి
సీఎం రేవంత్, మంత్రులు ఒకవైపు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, బీఆర్‌ఎస్ నేతలు మరోవైపు అన్నట్టుగా పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ఇటీవల దీపావళికి బాంబులు పేలతాయంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏం బాంబులు పేలతాయో, ఏ జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో ఫార్ములా–ఈ కార్ల రేసు వ్యవహారంలో విదేశీ కంపెనీకి రూ.55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా చెల్లించారన్న దానిపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించడం, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు, విచారణకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరడం సంచలనం సృష్టించింది. దానికి ప్రతిగా అన్నట్లు మాజీ మంత్రి కేటీఆర్.. అమృత్ టెండర్ల వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, ముఖ్యమంత్రి తన బావమరిదికి అర్హత లేకపోయినా రూ.1,100 కోట్లకు పైగా టెండర్ దక్కేలా చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
అంతేగాకుండా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అమృత్ టెండర్లలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు. ఈ ఆరోపణలను పలువురు మంత్రులు తిప్పికొట్టారు. తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి తప్పించేలా కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారంటూ.. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీఎం రేవంత్ ఖండించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు పోలీసు అధికారులను దాటి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేల దిశగా సాగుతుండటం కూడా వేడిని రాజేస్తోంది. ఇప్పటికే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారనే సమాచారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఫార్మా సంస్థలకు అవసరమైన భూముల కోసం అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, ‘కడ’ప్రత్యేకాధికారి తదితరులపై జరిగిన దాడి కూడా పూర్తిగా రాజకీయ రంగు తీసుకుంది.
ముందస్తు ప్రణాళికతోనే అధికారులపై దాడి జరిగిందని, దీనికి సూత్రధారి బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు సురేష్ అని, ఆయన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి దాడికి ముందు పదుల సంఖ్యలో కాల్స్ చేసినట్లు అధికార పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్‌ఎస్ అడ్డుపడుతోందని మంత్రి శ్రీధర్‌బాబు స్వయంగా ఆరోపించడం గమనార్హం.
కాగా అధికారులపై దాడులను ఖండిస్తూనే.. అమాయక రైతులను అరెస్టు చేస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దాడిలో పోలీసుల వైఫల్యం ఉందని మరో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. లగచర్ల ఘటన ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి నిదర్శనమని సీపీఎం పార్టీ వ్యాఖ్యానిస్తే.. అధికారులపై దాడిని ఒక పార్టీకి అంటగట్టి రైతులను కేసుల్లో ఇరికించవద్దని సీపీఐ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment