‘కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి’ | ktr slams on revanth reddy in nalgonda parliament meeting | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి’

Published Mon, Apr 1 2024 2:39 PM | Last Updated on Mon, Apr 1 2024 3:48 PM

ktr slams on revanth reddy in nalgonda parliament meeting - Sakshi

నల్లగొండ: జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, జేబుదొంగలే ఆ పని చేస్తారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. నల్లగొండ లోక్ సభ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొని కేటీఆర్‌ మాట్లాడారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి పేగులు మెడలో వేసుకుని తిరుగుతా అంటున్నారు. బోటీ కొట్టేవాళ్లే ఆ పని చేస్తారు. ఏక్ నాథ్ షిండేలు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. నల్లగొండ, ఖమ్మంలో ఉన్నవారితోనే నీకు(సీఎం రేవంత్‌రెడ్డి) ప్రమాదం ఉంది. కేసీఆర్ పర్యటన వీడియోలు చూస్తుంటే నల్లగొండలో ఎలా ఓడిపోయామని అనిపించింది.

ఎన్నికల ముందు నల్లగొండ జిల్లాలో జరిగిన సభలకు హాజరైతే జనాలు బ్రహ్మాండగా వచ్చారు.  నల్లగొండ జిల్లాలో ఏడెనిమిది సీట్లు వస్తాయని అనుకున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోక్ సభ ఎన్నికల్లో జరగకుండా ఆత్మవిమర్శ చేసుకుందాం. భారతదేశంలోనే అత్యధికంగా లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి కూడా వారి మనసు గెలుచుకోలేదు. ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చానని రేవంత్ అంటున్నారు. నోటిఫికేషనే ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారో రేవంత్ చెప్పాలి.‌

పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులు 70-80 శాతం బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. 73 శాతం జీతం పెంచిన ఏకై‌క నాయకుడు కేసీఆర్‌. ఒకటిన జీతాలు ఇవ్వకపోయినందుకు బీఆర్ఎస్‌కు దూరం అయ్యారు. రైతులకు కేసీఆర్ చేసినంత మేలు దేశంలో ఎవరూ చేయలేదు. రైతుబంధు, 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్. రైతులు కూడా బీఆర్ఎస్‌కు దూరం అయ్యారు. జిల్లాలో ఫ్లోరోసిస్ బూతాన్ని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీ. ఆ బూతాన్ని తరిమికొట్టింది బీఆర్ఎస్. కాంగ్రెస్ నాయకులు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు.బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి ప్రజల తప్పు కాదు నాయకులదే.  పదేళ్ల నిజం ఎదుట వంద రోజుల అబద్ధం కనిపిస్తోంది.

ముషంపల్లికి చెందిన రైతు మల్లయ్య మాట్లాడిన వీడియో చూస్తే బాధనిపించింది. గతంలో పది అసెంబ్లీ సీట్లు గెలిస్తే రెండు లోక్ సభ సీట్లు ఓడిపోయాం. నల్లగొండలో రెండు లోక్ స్థానాలను గెలవాలి. డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ అన్నారు. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయండి. మోసపోయినవాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి. 110 రోజులు అయినా రైతుబంధు రాలేదు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కొమటిరెడ్డి అంటున్నారు.  ఇంకో మంత్రి ఉత్తమ్ రైతుబంధు దుబారా అంటున్నారు. రైతు బంధు రూ. 15 వేలు కావాలన్నా క్వింటాల్‌కు రూ. 500 బోనస్ రావాలన్నా, రుణమాఫీ కావాలన్నా బీఆర్ఎస్‌కు ఓటేయండి.

రేవంత్ మోదీ కోసం పనిచేస్తుండా లేక రాహుల్ కోసమా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్‌కు దేశంలో నలభై సీట్లు గెలిచే పరిస్థితి లేదని మమతా బెనర్జీ అంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే. వరి పండించే విషయంలో నల్లగొండను దేశంలో నంబర్ వన్‌గా నిలిపాం.  బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని రాహుల్, రేవంత్ అన్నారు.. మోదీ దొంగ అని రాహుల్ అంటున్నారు.  రేవంత్ మాత్రం మోదీని పెద్దన్న అంటున్నారు’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement