పరపతి ఉన్న ప్రజా నాయకుడివే అయితే మల్కాజిగిరిలో పోటీపడదాం
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
నువ్వు సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చెయ్యి.. నేను కూడా చేస్తా..
మాకు ఒక్కసీటూ రాదంటావా?.. నీ సిట్టింగ్ స్థానంలోనే పోటీపడదాం
రేవంత్‌ది పేమెంట్ కోటా.. డబ్బులతోనే పీసీసీ, సీఎం పదవులు వచ్చాయి
గెలిస్తేనే మగాడంటారా..? కొడంగల్‌లో ఓడిపోయినపుడు కాదా?
చేతనైతే లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా రూ.2 లక్షల రుణమాఫీ, ఇతర హామీలు అమలు చెయ్యి
మేడిగడ్డ వద్ద దిద్దుబాటు చర్యలు చేపట్టి రైతులకు నీరందేలా చూడాలని సూచన
ఢిల్లీకి కప్పం కట్టేందుకు, బ్యాగులు మోసేందుకు బిల్డర్లను బెదిరిస్తున్నారని ఆరోపణ
మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ నివేదిక రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. అంత ఉబలాటం, దమ్ము, ధైర్యం, తెగువ ఉంటే.. పరపతి ఉన్న నాయకుడివే అయితే.. నువ్వు (రేవంత్) సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ సీట్లోనే తేల్చుకుందాం. అది పోతే ఇది, ఇదిపోతే అది.. అన్నట్టు సేఫ్ గేమ్ ఆడకుండా.. నువ్వు సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఎంపీగా నీ పనితీరు, మున్సిపల్ మంత్రిగా నా పనితీరును ఆ ఒక్క సీటులోనే తేల్చుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం..’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు.
రేవంత్ మాటలకు విశ్వసనీయత ఏది?
గతంలో జీహెచ్‌ఎంసీలో, కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన రేవంత్‌రెడ్డి మాటలకు విశ్వసనీయతే లేదని కేటీఆర్ విమర్శించారు. ‘‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిస్తే మగాడు.. ఓడితే కాదంటావా? గతంలో కొడంగల్‌లో ఓడినపుడు నువ్వు కాదా..? ఇదేం లాజిక్? నువ్వు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గెలిచారో చెప్పలేరు. ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్న రేవంత్ నేనే సీఎం, నేనే పీసీసీ అధ్యక్షుడు అని గొంతు చించుకుంటున్నారు. ఏం మీ మంత్రివర్గ సహచరులు మిమ్మల్ని గుర్తించడం లేదా? మగతనం గురించి మాట్లాడుతున్న రేవంత్.. ఎన్నికల కోడ్ వచ్చేలోగా రూ.2లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకంతో పాటు మిగతా 420 హామీలను నెరవేర్చాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రేవంత్‌రెడ్డిది పేమెంట్ కోటా..
రాజకీయాల్లో తనది మేనేజ్‌మెంట్ కోటా అంటున్న రేవంత్.. రాహుల్, ప్రియాంక గాంధీ ఏ కోటానో చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటా కింద మాణిక్యం ఠాగూర్‌కు డబ్బులిచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని, ఇతరులకు డబ్బులిచ్చి సీఎం పదవి కొనుక్కున్నారు. పేమెంట్ కోటా అభ్యర్థి రేవంత్.. తనను ప్రజలు ఎన్నుకున్నట్టు మాట్లాడితే ఎలా? పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు కోసం ఢిల్లీకి కప్పం కట్టాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీని నడపాలంటే రేవంత్, డీకే శివకుమార్ రోజుకు 18 గంటలు కష్టపడాలి.
బిల్డర్లు, కాంట్రాక్టర్లను పిలిచి బెదిరించి, వేధించి డబ్బుల వసూలు దందా చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలో బిల్డింగ్ అనుమతులను ఎవరిని బెదిరించడం కోసం నిలిపివేశారు. హైదరాబాద్ బిల్డర్లు త్వరలోనే రోడ్డెక్కే పరిస్ధితి ఉంది. కేంద్రంలోని బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ఎటుపోతారో అందరూ చూస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నట్టే.. భవిష్యత్తులో తెలంగాణలో కూడా రాజకీయం రంజుగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. లంకె బిందెలు ఎక్కడున్నాయో మనకేం తెలుసు. తెలంగాణ తల్లి మీద ఆభరణాలు మాయం చేశాడు’’ అని కేటీఆర్ విమర్శించారు.
టీఆర్‌ఎస్‌గా మార్పుపై నిర్ణయం తీసుకోలేదు..
రాజకీయ పారీ్టల్లో చేరికలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పోరాటవాదులు పారీ్టతో ఉంటారని, అవకాశవాదులు వదిలివెళ్తారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుందన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సునీత మహేందర్‌రెడ్డి (చేవెళ్ల), బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజిగిరి), వెంకటేశ్ నేత (పెద్దపల్లి)లకు టికెట్లు ఇస్తారేమోనని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. బీఆర్‌ఎస్‌గా ఉన్నా తమ ఫోకస్ ప్రస్తుతానికి తెలంగాణపైనే ఉందని చెప్పారు. తమ పాలనలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే.. రాజకీయ వేధింపులకు దిగకుండా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు.
ఎన్డీఎస్‌ఏ నివేదిక రాజకీయ ప్రేరేపితం
సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లలో లీకేజీలు, పగుళ్లు సహజమని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఏ విచారణలు చేసినా సరే, ఇంజనీరింగ్ నిపుణులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. కానీ గత ప్రభుత్వంపై ఆరోపణలు, శ్వేతపత్రాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఎలాంటి హైడ్రోలాజికల్ అధ్యయనాలు చేయకుండానే రాజకీయ ప్రేరేపితంతో ఆదరాబాదరాగా నివేదికను విడుదల చేసిందని విమర్శించారు. ఎప్పుడూ కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికలను తప్పుబట్టే కాంగ్రెస్, మంత్రి ఉత్తమ్ ఇప్పుడు ఎన్డీఎస్‌ఏ నివేదికను ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుతున్నారేమని ప్రశ్నించారు.
రైతులను ఆదుకునేందుకు తగిన పరిష్కారం చూపాలనే కామన్ సెన్స్ ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. ‘‘మేం మేడిగడ్డకు వెళ్తుంటే.. కాంగ్రెస్ పాలమూరు ప్రాజెక్టు సందర్శన పేరిట చౌకబారు రాజకీయం చేస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టి నీరు ఇవ్వకపోవడం వికృత రాజకీయం, నేరపూరిత చర్య. పాలమూరు ప్రాజెక్టులో 80శాతం పనులు పూర్తిచేశాం. ఉత్తమ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బ్యారేజీలు, రిజర్వాయర్లతోపాటు తన శాఖకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పనులు మానుకుని మేడిగడ్డ వద్ద దిద్దుబాటు పనులు చేపట్టాలి..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment