al Shabaab
-
పేలుళ్లతో దద్దరిల్లిన సొమాలియా రాజధాని
మొగదిషు: సొమాలియా రాజధాని మొగదిషులో కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోని జంక్షన్ వద్ద శనివారం రెండు కారు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బాధితులంతా పేలుడు సమయంలో అటుగా వాహనాలపై వెళ్తున్న పౌరులేనని మీడియా పేర్కొంది. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ తదితర ఉగ్రసంస్థలు రాజధాని లక్ష్యంగా పాల్పడుతున్న హింసాత్మక చర్యలకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. సరిగ్గా ఇదే జోబ్ జంక్షన్లో 2017లో ఉగ్ర సంస్థ అల్ షబాబ్ అమర్చిన ట్రక్ బాంబు పేలి 500 మంది బలయ్యారు. -
70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు
మొగాదిషు: ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమాలియాలో 70 మంది ఉగ్రవాదులను ప్రభుత్వ బలగాలు మట్టుబెట్టాయి. మరో 30 మందిని బంధించాయి. సైనికాధికారులు సోమవారం ఈ విషయాన్ని ప్రకటించాయి. ఉత్తర సోమాలియాలోని నుగల్ ప్రాంతంలోని సుజ్ వ్యాలీలో ప్రభుత్వ బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకరమైన పోరు గత నాలుగు రోజులుగా జరుగుతుందని పుంట్లాండ్ మంత్రి తెలిపారు. 'మేం అల్ షహబ్ సంస్థకు చెందిన 70 మందిని హతమార్చాం. 30 మందిని అరెస్టు చేశాం. ఉగ్రవాదులపై ఇది సైన్యం సాధించిన విజయం అని ఆయన చెప్పారు. మొత్తం 500 మందిని చుట్టుముట్టామని త్వరలోనే మిగితావారి ఆటకట్టవుతుందని తెలిపారు. -
'పన్నెండుమంది సైనికుల్ని చంపేశాం'
మోగాదిషు: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ షహబ్ దారుణానికి పాల్పడింది. పన్నెండుమంది కెన్యా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. అంతేకాకుండా మరో ఇద్దరిని తమ అదుపులో ఉంచుకున్నట్లు తెలిపింది. కెన్యా డిఫెన్స్ ఫోర్సెస్(కేడీఎఫ్)కు అల్ షహబ్ ఉగ్రవాదులకు మధ్య భారీ ఎత్తున పోరు జరిగిందని, ఇందులో కొంతమంది సైనికులను బందించిన అల్ షహబ్ వారిని చంపేసినట్లు ప్రకటించిందని కెన్యా మీడియా సంస్థ వెల్లడించింది. దక్షిణ సోమాలియాలోని జుబ్బా ప్రాంతంలోగల కోకాని అనే గ్రామం వద్ద ఇది చోటుచేసుకున్నట్లు తెలిపింది. -
150 మంది ఉగ్రవాదులు హతం
మొగదిషు: నిన్నమొన్నటివరకు ఐఎస్ఐఎస్ టార్గెట్ గా ఇరాక్, సిరియాల్లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపిన అమెరికా వైమానిక దళం.. చాలా కాలం తర్వాత ఆఫ్రికా గడ్డపై బాంబులు విసిరింది. వరుస దాడులతో సోమాలియాను వణికిస్తోన్న అల్ షబాబ్(అల్ కాయిదా అనుబంధ సంస్థ) సంస్థపై దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ ట్రైనింగ్ క్యాంప్ ను లక్ష్యంగా చేసుకుని శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో దాదాపు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షక బలగాలపై దాడులకు పాల్పడేలా 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తుందన్న సమాచారం అందటంతో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాడులు నిర్వహించామని, చనిపోయిన వారంతా ఉగ్రవాదులేనని, సాధారణ పౌరులెవ్వరు లేరని పెంటగాన్ అధికారి డేవిడ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆఫ్రికన్ యూనియన్ శాంతి బలగాలతోపాటు విదేశీయులే లక్ష్యంగా దాడులు జరిపేందుకు అల్ షబాబ్ కుట్రపన్నిందని, రెండు నెలల కిందట రాజధాని నగరం మొగదిషులోని ఓ హోటల్ పై దాడి కూడా ఆ సంస్థపనేనని డేవిడ్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్ బలగాల ధాటికి 2011లో మొగదిషును నుంచి తోకముడిచిన ఉగ్రవాదులు ఇటీవల మళ్లీ విజృంభిస్తుండటంతో సోమాలియాలో రక్తపుటేరులు పారుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలోనేకాక కెన్యా, ఉగాండాల్లోనూ అల్ షబాబ్ కు జిహాదీలున్నారు. -
సోమాలియాలో 25 మంది తీవ్రవాదులు మృతి
మొగాదీష్ : సోమాలియాలోని హిరాన్ ప్రాంతంలో ప్రభుత్వ దళాలు జరిపిన దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారని సైనిక ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. వీరంతా అల్ షబాబ్ తీవ్రవాద సంస్థకు చెందిన వారని తెలిపారు. ప్రభుత్వ దళాలు, ఇథియోపియన్ దళాలు సంయుక్తంగా గత 48 గంటల పాటు జరిపిన పోరులో ఈ తీవ్రవాదులను మట్టుబెట్టారని చెప్పారు. లక్ జీలో గ్రామంలో అత్యధికంగా తీవ్రవాదులు మరణించారని చెప్పారు. అల్ షబాబ్ తీవ్రవాదుల చెరలో ఉన్న గ్రామాలను వారి నుంచి విడిపించే వరకు ఈ పోరు జరుగుతుందని సైనిక ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. -
ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి
సోమాలియా దేశ సరిహద్దుల్లోని బలద్వీని పట్టణంలో నిన్న ఓ హోటల్లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 16 మంది మృతి చెందారని స్థానిక నాయకుడు ఆదివారం వెల్లడించారు.ఆ ఘటనలో మరో 33మంది గాయపడ్డారని తెలిపారు. వారంతా పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సైనికులు,స్థానిక పౌరులతో కిటకిటలాడుతున్న హోటల్లోకి బాంబు ధరించిన వ్యక్తి ప్రవేశించి, చూస్తుండగానే తనకు తాను పేల్చేసుకున్నాడని చెప్పారు. ఆ దాడికి పాల్పడింది తామేనని ఆల్ ఖైదా తీవ్రవాద అనుబంధ సంస్థ ఆల్ షబాబ్ అని ప్రకటించింది. ఇథియోపియా సరిహద్దు ప్రాంతాల్లోని స్థానికులు, విదేశీ సైనికులపై అల్ ఖైదా సంస్థకు చెందిన తీవ్రవాదులు తరచుగా దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.