150 మంది ఉగ్రవాదులు హతం
మొగదిషు: నిన్నమొన్నటివరకు ఐఎస్ఐఎస్ టార్గెట్ గా ఇరాక్, సిరియాల్లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపిన అమెరికా వైమానిక దళం.. చాలా కాలం తర్వాత ఆఫ్రికా గడ్డపై బాంబులు విసిరింది. వరుస దాడులతో సోమాలియాను వణికిస్తోన్న అల్ షబాబ్(అల్ కాయిదా అనుబంధ సంస్థ) సంస్థపై దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ ట్రైనింగ్ క్యాంప్ ను లక్ష్యంగా చేసుకుని శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో దాదాపు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షక బలగాలపై దాడులకు పాల్పడేలా 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తుందన్న సమాచారం అందటంతో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాడులు నిర్వహించామని, చనిపోయిన వారంతా ఉగ్రవాదులేనని, సాధారణ పౌరులెవ్వరు లేరని పెంటగాన్ అధికారి డేవిడ్ పేర్కొన్నారు.
ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆఫ్రికన్ యూనియన్ శాంతి బలగాలతోపాటు విదేశీయులే లక్ష్యంగా దాడులు జరిపేందుకు అల్ షబాబ్ కుట్రపన్నిందని, రెండు నెలల కిందట రాజధాని నగరం మొగదిషులోని ఓ హోటల్ పై దాడి కూడా ఆ సంస్థపనేనని డేవిడ్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్ బలగాల ధాటికి 2011లో మొగదిషును నుంచి తోకముడిచిన ఉగ్రవాదులు ఇటీవల మళ్లీ విజృంభిస్తుండటంతో సోమాలియాలో రక్తపుటేరులు పారుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలోనేకాక కెన్యా, ఉగాండాల్లోనూ అల్ షబాబ్ కు జిహాదీలున్నారు.