al umma
-
సెంట్రల్ జైలులో ఉగ్రవాదుల బీభత్సం
దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగినవాటిలో ఒకటైన పుళల్ సెంట్రల్ జైలులో అల్ ఉమా ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ముగ్గురు ఉన్నతాధికారులను తీవ్రంగా కొట్టి, మరో ఇద్దరినీ బందీలుగా చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో జైళ్లలో ఉగ్రవాద ఖైదీల ప్రవర్తనా తీరు మరోసారి చర్యనీయాంశంగా మారింది. హిందూ ఆలయాలే లక్ష్యంగా కోయంబత్తూరు సహా తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు పాల్పడి, అరెస్టయ్యి ప్రస్తుతం పుళల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అల్- ఉమా ఉగ్రవాదులకు, జైలు సిబ్బందికి జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అల్- ఉమా కీలక నేత ఫక్రుద్దీన్ అలియాస్ పోలీస్ ఫక్రుద్దీన్ కోసం అతడి బంధువులు బయటి నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను జైలులోకి అనుమతించబోమని అధికాలులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ ఫక్రుద్దీన్ సహా అతని అనుచరులు పన్నా ఇస్మాయిల్, బిలాల్ మాలిక్, ఇంకొందరు ఆదందోళనకు దిగారు. ముత్తుమణి, రవి మోహన్, సెల్విన్ దేవదాస్ అనే ముగ్గురు వార్డెన్లను ఉగ్రవాదులు చితకబాదారు. ఆ తరువాత అసిస్టెంట్ జైలర్ కుమార్, మరో వార్డెన్ మారీలను తమ బ్యారెక్ లోనే బందీలుగా చేసుకున్నారు. 'వీళ్లను విడిచిపెట్టాలంటే మా లాయర్లతో మాట్లాడించాలి' అని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులంతా జైలు వద్దకు చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటల హైడ్రామా అనంతరం ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారని తమిళనాడు జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జె.కె. తిరుపతి చెప్పారు. కొయంబత్తూరులో పేలుళ్ల అనంతరం ప్రధాన నిందితులు నలుగురూ ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరులో ఓ ఇంట్లో తలదాచుకోవటం, కార్డన్ అండ్ సెర్చ్ లో పోలీసులకు పట్టుబడటం తెలిసిందే. -
చిత్తూరు జిల్లా కోర్టుకు అల్-ఉమ్మా ఉగ్రవాదులు
చిత్తూరు : గత ఏడాది అక్టోబర్ 5న పుత్తూరులో పట్టుబడ్డ ముగ్గురు ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితులకు 13 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని వేలూరు జైలుకు తరలించారు. కాగా పుత్తూరులో ఉగ్రవాదులు మకాం వేశారన్న పక్కా సమాచారం తమిళనాడు పోలీసులకు అందటంతో రాష్ట్ర పోలీసులతో కలిసి కమాండో ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులను గత ఏడాది అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల కమాండో ఆపరేషన్‌లో బిలాల్ మాలిక్, మున్నా ఇస్మాయిల్ ప్రాణాలతో చేతికి చిక్కగా, వారితోపాటు బిలాల్ భార్య హుస్సేన్ బాను (27), కుమార్తెలు అయేషా (4), ఫాతిమా (3), కుమారుడు యాసిన్ (1)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరినుండి 80 జిలిటెన్‌టిక్స్, ఐఇడిలు, పిస్టల్స్, రెండు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరడుగట్టిన ఉగ్రవాదులైన బిలాల్ బృందాన్ని పట్టుకోవడంలో ఆక్టోపస్ పోలీసులుకాని తమిళనాడు, చిత్తూరు జిల్లా పొలీసులు ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా టియర్ గ్యాస్‌తో ఆపరేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహించడం గమనార్హం. -
పుంగనూరులో తమిళనాడు పోలీసులు తనిఖీలు
చిత్తూరు జిల్లా పుత్తూరులో ఇటీవల అల్ ఉమా సంస్థకు చెందిన తీవ్రవాదులు పట్టుబడిన నేపథ్యంలో పుంగనూరులో గత అర్థరాత్రి నుంచి తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పుంగనూరులోని నక్కబండ కాలనీలో ప్రతి ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందుకోసం పుంగనూరులో తమిళనాడు ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా మోహరించారు. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అల్ ఉమా తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులను తమిళనాడులోని తిరువళ్లూరు పోలీసులు నాలుగురోజుల క్రితం పుత్తూరులో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తిరుమల బ్రహ్మోత్సవాలలో బాంబు పేలుళ్లు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తీవ్రవాదులు తమ విచారణలో వెల్లడించారని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం విదితమే. -
పుత్తూరు ఘటనలో కరుడుగట్టిన ఉగ్రవాదులు
చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆక్టోపస్(ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్) చేపట్టిన మొట్ట మొదటి ఆపరేషన్ విజయవంతమైంది. ఆక్టోపస్ కమాండోలు చాకచక్యంగా వ్యవహరించి కరుడుగట్టిన ఇద్దరు తీవ్రవాదులను పట్టుకున్నారు. గేటుపుత్తూరు మేదరవీధిలోని ఒక ఇంట్లో దాక్కున్నవారిలో ఒకరు ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ అలియాస్ మున్నా కాగా, రెండవ వాడు అల్-ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ మాలిక్. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని చెన్నై తరలించారు. ఈ ఆపరేషన్‌లో తమిళనాడు, స్థానిక పోలీసులతోపాటు ఆక్టోపస్ కమాండోలు, ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) సిబ్బంది పాల్గొన్నారు. అల్-ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన కరుడుగట్టిన తీవ్రవాది పోలీస్ ఫక్రుద్దీన్‌ను తమిళనాడు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. చెన్నైలో దాడులు చేయాలన్న లక్ష్యంగా అతను చెన్నై పెరియార్ మేడలోని ఒక లాడ్జిలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా పుత్తూరులో శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. శనివారం తెల్లవారు జామునుంచి పోలీసులను ఉగ్రవాదులు నానా తిప్పలు పెట్టారు. తమిళనాడుకు చెందిన సిఐ లక్ష్మణన్‌ను కత్తితో అయిదారు చోట్ల పొడిచారు. అతను తీవ్రంగా గాయపడ్డారు. ఒక కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఆక్టోపస్ కమాండోలను 50 మందిని తిరుమల నుంచి పుత్తూరుకు రప్పించారు. పోలీసులు బెదిరించడంతో బిలాల్ తన భార్య, ముగ్గురు పిల్లలను మధ్యాహ్నం బయటకు పంపించాడు. లొంగిపోయిన వారిని పోలీసులు పుత్తూరు ఆస్పత్రికి పంపారు. సుమారు 11 గంటల సేపు పోరాడి బిలాల్, ఇస్మాయిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో తీవ్రవాది అలీం తప్పించుకున్నాడు. తప్పించుకుపోయిన ఉగ్రవాది జాడ కనుక్కునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వీరు అనేక పేలుడు సంఘటనలలో నిందితులని తెలుస్తోంది. ఆ ఇంట్లో పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆల్-ఉమా తీవ్రవాదుల లక్ష్యం తిరుమలేనని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. బిలాల్, ఇస్మాయిల్ మరో ఇద్దరు కలిసి తిరుమలలో రెక్కీ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు ఫక్రుద్దీన్ కోసం ఏళ్ల తరబడి గాలిస్తున్నారు. ఇమాం అలీ అనే తీవ్రవాదిని 2002లో మదురై కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళుతుండగా ఫక్రుద్దీన్ పోలీసులపై బాంబులు విసిరి అతడిని విడిపించుకుపోయాడు. బీజేపీ అగ్రనేత అద్వానీపై 2011లో హత్యాయత్నం, హిందూమున్నని తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి వెల్లయప్పన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, ఆడిటర్ రమేష్ హత్యకేసుల్లో ఫక్రుద్దీన్ నిందితుడు. మదురై జిల్లా సుంగంపల్లివాసల్ వీధికి చెందిన పోలీస్ ఫక్రుద్దీన్ (48), ఇతని అనుచరులైన తిరునల్వేలి మేల్పాలయూనికి చెందిన ఇస్మాయిల్ (35), బిలాల్మాలిక్ (25), అబూబకర్ సిద్ధిక్ (48) కోసం పోలీసులు వేట ప్రారంభించారు. వీరిని పట్టిస్తే 20 లక్షల రూపాయలు, సమాచారమిచ్చినా ఒక్కోక్కరికి 5 లక్షలు రూపాయల బహుమతి ప్రకటించారు. బాంబులు తయారు చేయడం, అమర్చడం, వాటిని పేల్చడం వంటి విషయాల్లో కాశ్మీర్‌లోని తీవ్రవాదుల వద్ద పోలీస్ ఫక్రుద్దీన్ శిక్షణ పొందాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం ముమ్మరంగా వేట సాగించారు. ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడైన ఇస్మాయిల్ మధురై కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఇస్మాయిల్, మాలిక్, ఫక్రుద్దీన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది. -
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర!
గత అర్థరాత్రి నుంచి తమ బలగాలు పుత్తూరులో చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తి అయిందని ఆక్టోపస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. అల్ ఉమా ఉగ్రవాది బిలాల్ మాలిక్‌తోపాటు మున్నాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిద్దరిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అంబులెన్స్‌లో చెన్నైకు తరలించినట్లు చెప్పారు. తిరుమలలో నేటి నుంచి ప్రారంభంకానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని వివరించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పోలీసులకు చిక్కిన ఉగ్రవాదిని దర్యాప్తులో భాగంగా విచారించగా కీలక సమాచారాన్ని అందించాడని తెలిపారు. దాంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేసి చెప్పారు. అయితే ఉగ్రవాదులతోపాటు ఉన్న మహిళ ముగ్గురు చిన్నారులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆక్టోపస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. చెన్నై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ హత్యకేసులో బిలాల్ మాలిక్ ముఖ్య నిందితుడు అన్న విషయం తెలిసిందే.