మంచి మాట: ఉత్తమ వ్యక్తిత్వం ఎలా రూపు దిద్దుకుంటుంది?
కొంతమంది దృష్టిలో వ్యక్తిత్వమంటే... ప్రవర్తన, దార్శనికత, ఉద్వేగ భరితం, చక్కని ఆలోచనా విధానం, సంభాషించే పద్దతి, కుటుంబంతో, ఇతరులతో మసలుకునే విధానం.. విశ్వాసాలు. మరికొంతమందికది సాహసం.. నియమబద్ధత.. ఖచ్చితత్వం.. క్రమశిక్షణ.. సృజనశీలత. ఇలా ఒక వ్యక్తిలోని అనేక గుణాల సమాహారమే వ్యక్తిత్వమంటే. ఈ లక్షణాలలో ఏ ఒక్కటైనా అభిలషణీయమైన నిష్పత్తిలోకాక హెచ్చు స్థాయి లో ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిత్వం ఒక విశిష్ఠతను సంతరించు కుంటుంది. అది మంచిగా.. లేదా చెడుగా పరిణమించవచ్చు. ఇక్కడ అప్రమత్తత కావాలి.
ఒక మహాభవనం నిర్మించాలంటే దానికి పటిష్టమైన పునాది అవసరం. ఇటుక మీద ఇటుక పెడుతూ సిమెంట్ పూస్తూ తాపీతో చదును చేసి.. గోడలు కట్టి.. ఆకర్షణీయమైన.. ఆహ్లాదకరమైన రంగులు వేసి ఇతర సర్వ హంగులు సమకూర్చిన తరువాత కాని తయారు కాదు ఏ మహా భవంతి అయినా. ఉన్నత వ్యక్తిత్వ సౌధానికి అంతే. తపన.. కోరిక.. పట్టుదలనే ఇటుకలకు సంకల్పం, ధృతి అనే సిమెంట్‌ను జోడించి నిర్మించాలి.
ఇంత దృఢమైన, సుందరమైన భవన స్థాపన అనేక సంవత్సరాల కృషి.. తపన. కోరిక ..పట్టుదల వల్ల మాత్రమే సాకారమవుతుంది. దీనిని ఒకసారి నిర్మించి వదిలేస్తే సరిపోదు. నిరంతర పరిశీలన కావాలి. దీనిలోని లోపాలను గమనించి అవసరమైతే పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే ఒక గొప్ప వ్యక్తిత్వ సౌధం ఏర్పడి మరింతగా శక్తిమంతమైనదిగా రూపొందుతుంది. అలా తమ జీవితకాలమంతా ఎవరైతే తపిస్తారో ఆ వ్యక్తిత్వం ఒక పారిజాత పుష్పమవుతుంది.
ఎన్నటికీ ఇగిరిపోని గంధ మవుతుంది. దాని ప్రభావం ఆ తరం వారి మీదే కాక, అనేక తరాలవారి మీద ఉంటుంది. శాశ్వత ముద్ర వేస్తుంది. వారే చిరంజీవులవుతారు. ఏకాగ్రత సాధనకు ఏకలవ్యుడు.. జ్ఞానాన్వేషణలో గురువునే ప్రశ్నించిన నరేంద్రుడు.. ఆకలితో మలమల మాడుతూ శలభాల్లా పడిపోతున్న గోదావరి వాసులకు పాశ్చాత్యుడైనా అపర భగీరధుడై గోదావరీ జలాలను పారించి వారికి అన్నపూర్ణనే ఇచ్చిన సర్ అర్థర్ కాటన్ మానవత్వం, ఆకలితో అలమటించే వారికి డొక్కా సీతమ్మ నిరతాన్నదానం .. ఇలా ఎందరివో ఉత్తమ వ్యక్తిత్వాలు.
ఈ వ్యక్తిత్వ రూపకల్పన ఎలా జరుగుతుంది, దీనికి ప్రేరణ ఎలా వస్తుంది, దీని దిశ –దశ లు ఏమిటి.. అన్న జిజ్ఞాస మనలో కలగాలి. అన్వేషణ చేయాలి. దీనికి మంచి పుస్తకాలు చదవాలి. సారాన్ని గ్రహించాలి. దానిని మదిలో నిలుపుకోవాలి. మన జీవితానికి ఎంత వరకు.. ఎలా అన్వయించుకోవాలో తెలియగల వివేచన కావాలి.
ఒక సాధారణ కరమ్ చంద్ గాంధీ అనే గుజరాతీయుడు జాన్ రస్కిన్.. టాల్‌స్టాయ్.. హెన్రీ డేవిడ్ థోరో ల రచనల ఆలంబనగా తన జీవితాన్ని.. దాని పథాన్ని మార్చుకుని ఎంతటి ఉన్నత దశకు చేరుకున్నాడో మన కందరకు తెలుసు. ఆయన మీద భగవద్గీత ఎంత ప్రభావాన్ని చూపిందో... బైబిల్ కూడ అంతే. వాటిని చక్కని వ్యక్తిత్వ సాధనకు గొప్పగా ఉపయోగించుకున్నాడు. అంతేకాదు. ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపిన.. చూపగలిగే వ్యక్తులలో నాటి నుండి నేటి వరకు ఉన్నారు. పుస్తక పఠనం చక్కని వ్యక్తిత్వానికి ఎలా దారితీస్తుందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలదు. ఈ రకమైన ప్రభావం పరోక్షంగా ఉంటుంది.
దీనికన్నా సులువైన, గొప్పదైన మార్గమూ ఉంది. అదే పరిశీలన. అది చాలా అద్భుతమైనది. మన చుట్టూ వుండే మనుష్యులు.. వారి ప్రవర్తన ను పరిశీలించటం వల్ల కూడ చక్కని వ్యక్తిత్వం ఒనగూరుతుంది. వ్యక్తులే కాదు, గ్రహించగలిగే శక్తే ఉండాలే కాని, ఈ అనంతమైన సృష్టిలో మనకు స్ఫూర్తినివ్వనిది.. ఇవ్వలేనిదేముంది..? తుఫానులో విపరీతమైన గాలి వానకు, కూకటి వేళ్ళతో కూలిపోయే మహావృక్షాలు ఉంటాయి. ఆ పక్కనే భూమి మీద ఒరిగి పోయి.. గాలివాన తరువాత మళ్ళీ నిటారుగా నిలబడి తమ ఉనికి చాటుకునే గడ్డిపరకలూ ఉంటాయి. అక్కడివరకూ మన పరిశీలనా దృష్టిని సారించగలగాలి. కష్టాలు, బాధల తుఫానులతో అతలాకుతలమయ్యే వేళ గడ్డిసరకని ఆదర్శంగా తీసుకుంటే ధైర్య స్థైర్యాలు అలవడతాయి. ఇవి గొప్ప వ్యక్తిత్వపు లక్షణాలే కదూ!
మనం పుట్టిన ప్రదేశం.. దాని శీతోష్ణ స్థితులు.. కుటుంబ నేపథ్యం.. ఆర్థిక స్థితి.. ఇవన్నీ మన ఆలోచన రీతిని ప్రభావితం చేసేవే. ఆ ప్రభావిత ఆలోచనలు మన మాట తీరును.. ప్రవర్తనను నిర్దేశిస్తాయి. వీటి సారమే కదా మన వ్యక్తిత్వం. ఇదే మన జీవనశైలి అనే రథానికి సారథి.
కొందరి మనసు వజ్ర దృఢ సమానమైన కఠినం. ఇంకొందరిది వెన్నంత మృదుత్వం. మరికొందరిది ఈ రెండిటి కలవోత. ఈ రెండిటికి చెందక పాదరసంతో పోల్చతగ్గ వ్యక్తిత్వం కలవాళ్ళుంటారు. ఒక స్థిరమైన ఆలోచన.. వైఖరి.. లేక వారి ప్రవర్తన.. మాట.. అనూహ్యంగా క్షణ క్షణానికి మారిపోతుంటాయి. అభిప్రాయాలూ అంతే.
‘ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి.. ‘ అన్న సుమతీకారుడి మాటలకు ప్రత్యక్షరూపమే కొందరి వ్యక్తిత్వం. మాటలు తూచి తూచి మాట్లాడతారు. ఎవరి మనస్సు నొప్పించరు. మృదుస్వభావులు. వివాద రహితులు. జనప్రియులు.
తన వారన్నవారందరిని కోల్పోయి, అనాథలై, అభాగ్యులై జీవన సమరంలో అతి చిన్నవయసులో ప్రవేశించే వారి ఆలోచన, వారి సమాజపు ఆకళింపు పూలపాన్పు జీవిత నేపథ్యం ఉన్నవారి కన్నా భిన్నంగా ఉంటుంది. పలుకు పదునుగా, కరకుగా ఉంటుంది. జీవన పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యులకు ఈ మనస్తత్వమున్నవారు చేరువవుతారు. దానిని అక్కున చేర్చుకుంటారు.
వ్యక్తిత్వాలలో ఎన్నిరకాలుంటాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పలేనన్ని.. గణించలేనన్ని– అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతివ్యకి ఒకరకమైన వ్యక్తిత్వానికి నమూనా. ప్రతివ్యక్తిలోనూ వుండే విభిన్నత..ౖ వెవిధ్యమే ఇందుకు హేతువు.
మంచి వ్యక్తిత్వ వర్గీకరణకు.. నిర్వచనానికి మనం కొన్ని ప్రమాణాలు పెట్టుకుంటాం. ఏ వ్యక్తి పేరు తలచుకోగానే మన మనసుకు ఒక రకమైన హాయి.. ఆనందం కలిగి మన ముఖంపై చిరునవ్వు చిందుతుందో, ఎవరి ప్రవర్తన మన మనస్సును నొప్పించదో అతడు మంచివాడని.. అతనిది మంచి వ్యక్తిత్వమని భావిస్తాం. వారి గురించి ఆలోచన మన మదిలో మెదలగానే మనసంతా పరిమళ భరితమవుతుంది. ఇది ఒక అవగాహన.
ఏ వ్యక్తుల పేర్లు తలచుకోగానే మనకు భక్తి, ప్రపత్తులు కలుగుతాయో... దేశభక్తి మనలో ఉప్పొంగుతుందో.. త్యాగనిరతి జ్ఞప్తికి వస్తుందో.. వారి ఉన్నతమైన మానవీయ లక్షణాలు తడతాయో.. నిర్భయత్వం.. ప్రేమ, కరుణ మనకు స్ఫురిస్తుందో .. ఆ వ్యక్తులందరూ గొప్పవారే... వారి వ్యక్తిత్వాలన్నీ గొప్పవే .. స్ఫూర్తిదాయకమైనవే. మనం ఏ వ్యక్తిత్వానికి చేరువవుతామన్నది మన స్వభావాన్ని బట్టి ఉంటుంది. మన జీవిత నేపథ్యం కూడ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వం దేశాన్ని ఉత్తమమైనదిగా చేస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తిత్వాన్ని పిల్లల్లో రూపు దిద్దటానికి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రయత్నించాలి.
కొందరు మనస్సులో ఏదైనా ఆలోచన తట్టిన క్షణమే పని చేసేస్తారు. లేడికి లేచిందే పరుగులా వాళ్ళనుకున్నది చేయటమే వారి తత్వం. ముందు వెనుకలు చూడరు. లోతుగా తరచి చూడరు. సాధ్యాసాధ్యాల గురించి యోచన చేయరు. పర్యవసానాలు దర్శించగలిగే శక్తే ఉండదు. ఈ వ్యక్తిత్వం కలిగినవారు వారు ముప్పును తెచ్చుకోవటమే కాదు. ఇతరులకూ తెస్తారు.
– బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు