Alipurduar
-
భార్యపై అసభ్యకర కామెంట్లు.. చితకబాదిన ఐఏఎస్
-
భార్యపై అసభ్యకర కామెంట్లు.. చితకబాదిన ఐఏఎస్
కోల్‌కతా : తన భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసినందుకు ఓ యువకున్ని పోలీస్ స్టేషన్లోనే చితకబాదాడు పశ్చిమబెంగాల్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. యువకుడు క్షమించమని వేడుకున్నా పట్టించుకోకుండా చితక్కొట్టారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అలీపూర్‌ద్వార్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి నిఖిల్ నిర్మల్ భార్యపై అదే ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ సర్కార్ అనే యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేశాడు. దీంతో ఆ యువకుడిపై నిఖిల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని యువకున్ని అరెస్ట్ చేశారు. కాగ గత ఆదివారం ఐఏఎస్ అధికారి నిఖిల్ తన భార్య నందిని కిషన్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆవేశంతో ఆ యువకున్ని చితకబాదాడు. క్షమించండి అంటూ ఆ యువకుడు ప్రాధేయపడుతున్నా వినలేదు. అధికారి భార్య కూడా యువకున్ని కొట్టారు. ఇదంతా అక్కడ ఉన్నవారిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. కాగా ఓ ఐఏఎస్ అధికారి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి యువకున్ని కొట్టడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబట్టారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కొట్టడానికి ఐఏఎస్‌కి హక్కులేదని ఏపీడీఆర్ సభ్యురాలు జతీశ్వర్ భారతి అన్నారు. తన భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ, ఆయన వెళ్లి కొట్టడం ఏంటని ప్రశ్నించారు. చట్టం ప్రకారం వ్యవహరించాలి కానీ భార్యతో కలిసివెళ్లి కొట్టడం, చంపేస్తానని బెదిరించడం నేరమని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై వివరణ కోసం ఐఏఎస్ అధికారిని మీడియా సంప్రదించగా అందుబాటులోని రాలేదు. -
బెంగాల్ లో రోడ్డు ప్రమాదం.. 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు
కోల్ కతాః పశ్చిమబెంగాల్ అలిపుర్దౌర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్నఓ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 17 మంది పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకొన్న స్కూల్ బస్ ప్రమాదంలో 17 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అలిపుర్దౌర్ జిల్లా మదరిహత్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో స్థానిక ప్రైవేట్ ప్రాధమికోన్నత పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ను.. వేగంగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్ళేందుకు బస్ లో బయల్దేరిన విద్యార్థుల్లో 17 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. గాయాలైనవారిని అలిపుర్దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడినుంచీ తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్థిని మొహంపై యాసిడ్ పోశాడు
కోల్కత్తా : నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు కాలేజీ విద్యార్థి వెంట పడ్డాడు. సదరు యువకుడి ప్రతిపాదనను విద్యార్థి తిరస్కరించింది. అంతే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌తో ఆమె మొహంపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది... స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి ఎ.రవీంద్రనాథన్ తెలిపారు. నిందితుడు అభి షా (25)ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. అయితే తనను పెళ్లి చేసుకోవాంటూ గత కొంత కాలంగా నిరుద్యోగి అభి షా కాలేజీ విద్యార్థి వెంట పడుతూ తరచు వేధించేవాడని రవీంద్రనాథన్ చెప్పారు. నిందితుడు అభి షాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.